YCP Jaga: తొక్కించి చంపి అబద్ధాలా
ABN, Publish Date - Jun 24 , 2025 | 07:20 AM
అరాచక పాలన చేసి దారుణంగా ఓడిపోయిన మాజీ సీఎం జగన్‌లో కనీస ప్రాశ్చాత్తాపం లేకపోగా, పోలీసులు, ప్రభుత్వంపై ఎదురుదాడి ఏమిటని పోలీసు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
వీడియో ఎదురుగా ఉన్నా ఎదురుదాడా?.. మీ కారు కింద వ్యక్తి పడితే బాబు దోషా?
‘100 మంది’ షరతు ఎందుకు ఉల్లంఘించారు?.. బుల్లెట్ ప్రూఫ్ కారు ఎందుకు వద్దన్నారు?
మీపై కేసు కుట్ర, కుతంత్రమైతే.. పవన్‌పై తాడేపల్లి పీఎ్‌సలో పెట్టిన కేసు ఏంటి?
మానవత ఉంటే క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి చేర్చాలి కదా?.. కనీసం పశ్చాత్తాపం కూడా లేదా?
జగన్ తీరు, రోతపత్రిక రాతలపై పోలీసుల్లో అసహనం
(అమరావతి - ఆంధ్రజ్యోతి): అరాచక పాలన చేసి దారుణంగా ఓడిపోయిన మాజీ సీఎం జగన్‌లో కనీస ప్రాశ్చాత్తాపం లేకపోగా, పోలీసులు, ప్రభుత్వంపై ఎదురుదాడి ఏమిటని పోలీసు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సత్తెనపల్లి ఘటనలో వ్యక్తిని తొక్కించి చంపినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులపై నిందలు, సొంత పత్రికలో అబద్ధపు రాతలు రాయించడంపై మండిపడుతున్నాయి. సొంత పత్రికలో సత్తెనపల్లి ఘటనకు సంబంధించి పోలీసులు, ప్రభుత్వంపై రోత రాతలతో బురద చల్లడాన్ని ఈ వర్గాలు నిలదీస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పక్కన బెట్టి, సొంత వాహనంతో వ్యక్తిని తొక్కించి చంపితే...అది పోలీసుల వైఫల్యం.. ప్రభుత్వ కుతంత్రం.. అని ఎలా అంటారు.. ఎలా రోత రాతలు రాయిస్తారు? అని కొందరు పోలీసులు మండిపడుతున్నారు. ‘‘మీరు ప్రయాణిస్తున్న కారు కింద వ్యక్తి చనిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
అయినా, మీరు కనీసం ప్రాశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. పైగా ఆ ఘటనను ప్రభుత్వ కుతంత్రంగా చిత్రీకరించాలని చూస్తున్నారు. ఇది ఎంత వరకు సబబు?’’ అని మరికొందరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గాయపడి ప్రాణంతో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి చేర్చకుండా... రోడ్డు పక్కకు వదిలేసి వెళ్లిపోతే హత్య కేసు పెట్టాలా వద్దా అని నిలదీస్తున్నారు. ‘‘నరుకుతాం.. చంపుతాం.. అనే సత్తెనపల్లి పర్యటనలో ప్లెక్సీలను ప్రదర్శించిన సైకో బ్యాచ్‌ను సమర్ధిస్తావు. మీ టీవీ డిబేట్‌లో ఒక ప్రాంత మహిళల్ని నీచంగా కించపరిచినవారికి వత్తాసు పలుకుతావు. ఎక్కువ మంది వస్తే అదుపు చేయడం కష్టమవుతుందని, వందమందికే అనుమతి ఉందని పోలీసులు చెబితే.. నిబంధనలు ఉల్లంఘించి ఉద్దేశ పూర్వకంగా జన సమీకరణ చేసి పోలీసులపై నిందలు వేయడం ఏమిటి’’ అని ప్రశ్నిస్తున్నారు.
అప్పట్లో మీరు చేసిందేమిటి?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పెట్టిన కేసు విషయం కొందరు పోలీసులు గుర్తుచేస్తున్నారు. ‘‘జనసేన సభకు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చినందుకు వారి ఇళ్లను బుల్డోజర్లతో సీఎం జగన్ కూల్చేయించారు. వారి పరామర్శకు జాతీయ రహదారిపై వెళుతున్న పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ను చూసి తెనాలికి చెందిన ఒక వ్యక్తి సర్వీస్ రోడ్లో బైకుపై వెళుతూ కింద పడ్డాడంటూ తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో అప్పట్లో కేసు పెట్టారు. పవన్ కాన్వాయ్‌లోని ఏ వాహనమూ ఆ వ్యక్తి బైకును ఢీ కొట్టలేదు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి గాయాలు కూడా కాలేదు. అసలు కింద పడ్డాడో లేదో కూడా తెలియదు. అయినా పవన్ కల్యాణ్‌పై కేసు పెట్టారు. జగన్ ప్రయాణిస్తున్న కారుతో సింగయ్యను తొక్కించడం స్పష్టంగా వీడియోలో కనిపిస్తోంది. అయినా, కేసు నమోదు చేయడం కుట్ర అని మీరు అనడం నీచాతినీచం’’ అంటూ పోలీసు వర్గాలు మండిపడుతున్నాయి.
Updated Date - Jun 24 , 2025 | 07:20 AM