Nara Lokesh: మిషన్ మోడ్‌తో నైపుణ్యం పోర్టల్
ABN, Publish Date - Jul 05 , 2025 | 03:34 AM
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్ప నే మన లక్ష్యం. లక్ష్య సాధనకు యువతను, పరిశ్రమలను అనుసంధానించాలి. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నైపుణ్యం పోర్టల్ అందుకు వేదికవ్వాలి. పోర్టల్‌ను సెప్టెంబరులో ప్రారంభించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలి అని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు.
యువత, పరిశ్రమల అనుసంధానం
సెప్టెంబరులో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి
ఆగస్టు 7 నుంచి అక్షర ఆంధ్ర
3 నెలలకోసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు
నైపుణ్యాభివృద్ధి, ఇంటర్ విద్య సమీక్షలో మంత్రి లోకేశ్
ఐటీఐల అభివృద్ధికి కేంద్రం నుంచి 600 కోట్లు
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్ప నే మన లక్ష్యం. లక్ష్య సాధనకు యువతను, పరిశ్రమలను అనుసంధానించాలి. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నైపుణ్యం పోర్టల్ అందుకు వేదికవ్వాలి. పోర్టల్‌ను సెప్టెంబరులో ప్రారంభించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలి’ అని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి, ఇంటర్ విద్యపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా రూపొందిస్తున్న నైపుణ్యం పోర్టల్‌ను మిషన్ మోడ్‌లో ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇందుకోసం 90 రోజుల కార్యక్రమం చేపడతాం. పోర్టల్‌లో రిజిస్ర్టేషన్ చేసుకున్న వెంటనే రెజ్యూమ్ సిద్ధం కావాలి. పోర్టల్ ద్వారా స్కిల్ అసె్‌సమెంట్, కంపెనీల్లో ఉద్యోగావకాశాలను యువతకు తెలియజేయాలి. ఆ తర్వాత నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ ఉద్యోగాలు పొందేలా చూడాలి. ప్రతి మూడు నెలలకోసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలి.’ అని అధికారులకు స్పష్టం చేశా రు. అధికారులు మాట్లాడుతూ, ఇటీవల మంత్రి లోకేశ్ ఢిల్లీ పర్యటన అనంతరం ఐటీఐల అభివృద్ధికి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం కింద రూ.600 కోట్లు వచ్చాయని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశా ల కల్పనను సులభతరం చేసేలా ఆయా దేశాల రాయబార కార్యాలయాల తో సంప్రదింపులు జరపాలని మంత్రి సూచించారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో 5,00,965 మంది అడ్మిషన్లు తీసుకున్నారని అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ... ‘టెన్త్ పూర్తి చేసుకున్న విద్యార్థులంతా ఇంటర్ లేదా ఒకేషనల్ కోర్సుల్లో తప్పనిసరిగా చేరేలా చూడాలి. ప్రతి విద్యార్థీ ఎక్కడ చేరారో ట్రాక్ చేయాలి’ అని ఆదేశించారు. నిరక్షరాస్యుల కోసం ఆగస్టు 7న అక్షర ఆంధ్ర(ప్రాజెక్ట్ అఆ) కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇబ్బంది తలెత్తకుండా మినహాయింపు సబ్జెక్టుకు సగటు మార్కులు వేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు.
Updated Date - Jul 05 , 2025 | 03:36 AM