Nara Lokesh : అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్
ABN, Publish Date - Mar 06 , 2025 | 06:12 AM
అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్‌రెడ్డిలా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. జగన్ బాగా ఫ్రస్ర్టేషన్‌లో ఉన్నారని, అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతితో అడ్డగోలుగా వ్యవహరించి, ప్రతిపక్షంలోకి రాగానే నీతులు, విలువల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు.
డిప్యూటీ సీఎంపై నోరుజారితే ఊరుకునేది లేదు
జగన్ మెజారిటీ ఎంత?.. పవన్ మెజారిటీ ఎంత?
మద్యంలో అవినీతి చేయలేదని తన పిల్లలపై ప్రమాణం చేయగలరా?: లోకేశ్
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్‌రెడ్డిలా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. జగన్ బాగా ఫ్రస్ర్టేషన్‌లో ఉన్నారని, అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతితో అడ్డగోలుగా వ్యవహరించి, ప్రతిపక్షంలోకి రాగానే నీతులు, విలువల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. బుధవారం వెలగపూడి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు వైనాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తికి ప్రజలు 11 స్థానాలు కట్టబెట్టారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఇప్పటికీ తెలుసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి జగన్‌కు ప్రతిపక్ష హోదా ఎలా ఇవ్వమంటారు? ఆయనకు చట్టాన్ని ఉల్లంఘించడం బాగా అలవాటు. అందుకే ఆయనపై అన్ని కేసులు ఉన్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ రూల్ బుక్‌లో చాలా స్పష్టంగా 10 శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉంది. దాని ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. అసెంబ్లీలో వైసీపీకి 11వ రో(వరుస) కేటాయించాం. ఆ వరుసలో 11 మంది కూర్చోవచ్చు’ అని లోకేశ్ అన్నారు.
జగన్‌కు విలువల్లేవు
‘ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి హుందాగా మాట్లాడతారని అందరం భావించాం. కానీ గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడటం దారుణం. జగన్ వ్యాఖ్యలు విన్న తర్వాత ఆయనకు విలువలు లేవని అర్థమైంది. మేం ఎవరిపైనా వ్యక్తిగత దాడులు చేయడం లేదు. వైసీపీ నాయకులు చేసిన తప్పులే వారి మెడకు చుట్టుకుంటున్నాయి. జగన్‌కు చట్టాలపై గౌరవం లేదు. చాన్స్ ఇస్తే అవినీతి నిరోధక చట్టాన్ని, సీబీఐని, ఈడీని అన్నిటినీ రద్దు చేసేస్తారు. మద్యంలో అవినీతి చేయలేదని జగన్ తన పిల్లలపై ప్రమాణం చేసి చెప్పగలరా? సీఎం పదవి కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన వ్యక్తి జగన్. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి, మాపై నిందమోపారు’ అని విమర్శించారు.
ఎక్కడా పరదాల్లేవు..
‘పరదాలు కట్టే ప్రభుత్వం పోయింది. బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసుల సంఖ్య తగ్గింది. ఎక్కడా పరదాలు లేవు. ఎవరైనా స్వేచ్ఛగా రావొచ్చు. ప్రజాసమస్యలను ప్రస్తావించవచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత జగన్‌కు భయం పట్టుకుంది. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హడావిడిగా వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి మళ్లీ బెంగళూరు వెళ్లిపోతారు’ అని లోకేశ్ అన్నారు.
అమరావతిపై మీ విధానమేంటి?
‘ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని జగన్‌కు డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు. వైసీపీ విధ్వంసం వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయింది. దాన్ని మేం గాడిలో పెడుతున్నాం. అమరావతిపై జగన్ రెడ్డి విధానమేంటో ఇప్పటికైనా చెప్పాలి. ఒక రాజధానికి కట్టుబడి ఉన్నారా లేక మూడుముక్కలాటకే సిద్ధంగా ఉన్నారా? చెప్పాలి. వైసీపీ పాలనలో 40 లక్షల మందికి ఎక్కడ ఉద్యోగాలు కల్పించారో వివరాలు ఇవ్వాలి. అన్ని ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు నిరుద్యోగులు ఒక్కరూ ఉండకూడదు కదా’ అని లోకేశ్ అన్నారు.
జగన్.. పవన్ ఎవరి మెజారిటీ ఎంత?
‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కించపరిచే విధంగా జగన్ మాట్లాడితే సహించేది లేదు. మొన్నటి ఎన్నికల్లో జగన్ కన్నా పవన్‌కు ఎక్కువ మెజారిటీ వచ్చింది. వైసీపీ కన్నా జనసేనకు ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇదంతా ఆలోచించకుండా... నోరుంది కదా అని అధికారంలో ఉన్న వారిని కించపరిచే విధంగా ఏదిబడితే అది ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. ఇప్పటికైనా జగన్ రెడ్డి సీఎం, డిప్యూటీ సీఎం గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. లేదంటే ఊరుకునేది లేదు’ అని లోకేశ్ హెచ్చరించారు.
Updated Date - Mar 06 , 2025 | 06:13 AM