Sanatana Dharma: సనాతన ధర్మ రక్షణకు మునివాహన సేవ
ABN, Publish Date - May 18 , 2025 | 04:36 AM
సనాతన ధర్మ రక్షణ కోసం రాయలచెరువుపేటలో మునివాహన సేవ నిర్వహించబడింది. దళిత పీఠాధిపతిని భుజాలపై మోసిన బ్రాహ్మణ పీఠాధిపతితో సామాజిక సమరసతకు ఉదాహరణగా నిలిచింది.
దళిత పీఠాధిపతిని భుజాలపై మోసిన బ్రాహ్మణ పీఠాధిపతి
తిరుపతి జిల్లా రాయలచెరువుపేటలో నిర్వహణ
రామచంద్రాపురం, మే 17(ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మ రక్షణ కోసం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువుపేట ఛాయామార్తాండ శనైశ్చర దేవస్థానం వద్ద శనివారం మునివాహన సేవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో దళిత వర్గానికి చెందిన మాతంగి మహాపీఠం పీఠాధిపతి మాతానందగిరి స్వామిని ఛాయా మార్తాండ పీఠాధిపతి ఉంగరాల సుబ్రహ్మణ్య శాస్త్రి తన భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి తీసుకెళ్లి సత్కరించారు. అంతకుముందు మాతానందగిరిస్వామికి పాదపూజ చేశారు. మహాభక్తుడిని భగవంతుడిగా పూజించడమే ముని వాహనసేవ అని పేర్కొన్నారు. సమరసత వేదిక జాతీయ కన్వీనర్ కె. శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ, సనాతన ధర్మ రక్షణ కోసం ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. మన దేశంలో 2,700 సంవత్సరాల క్రితం ఈసేవ ఉండేదన్నారు. మాతానందగిరి స్వామి మాట్లాడుతూ.. రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యుల పరంపరంగా హిందూ చైతన్యాన్ని పెంపొందిస్తున్నామన్నారు. సమరసత సేవ ఫౌండేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఎం.లీలాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.మన్మథరావు, కన్వీనర్ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 04:37 AM