పాక్ అణు బెదిరింపులకు తలవంచం: ఎంపీ లావు
ABN, Publish Date - Jun 06 , 2025 | 04:48 AM
పాకిస్థాన్ అణు బెదిరింపులకు భారత్ తలవంచబోదని మేం పర్యటించిన దేశాల నేతలు, మేధావులకు స్పష్టం చేశామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్ అణు బెదిరింపులకు భారత్ తలవంచబోదని మేం పర్యటించిన దేశాల నేతలు, మేధావులకు స్పష్టం చేశామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. పాక్ ఉగ్రవాదం గురించి తమకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదని, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాక్‌లోనే ఉంటాయని ఆయా దేశాలన్నీ అంగీకరించాయని తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు అండగా ఉంటూ, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌ను ఉగ్రవాద బాధిత దేశంగా తాము చూడబోమని స్పష్టం చేశామని తెలిపారు. గురువారం, ఇక్కడ తన అధికారిక నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లావు మాటాడారు. ‘పాక్ ఉగ్రవాదం, ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి గల కారణాలను ఖతార్, ఈజిప్టు, ఇథియోపియా, దక్షిణాఫ్రికా దేశాలలోని ఆయా రాజకీయ పార్టీల నేతలు, మేధావులకు వివరించాం. ఉగ్రవాదం పట్ల భారత్ వైఖరిని అన్ని దేశాలు సమర్థించాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దౌత్యపరంగా చేపట్టిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాకే ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టినట్లు వివరించాం. ఉగ్రవాద బాధిత దేశంగా పాక్‌ను చూడవద్దని ఆయా దేశాల నేతలకు విజ్ఞప్తి చేశాం. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదాన్ని నిర్వచించేలా, ఉగ్రవాదానికి పాల్పడే దేశాలపై కఠిన చర్యలు తీసుకునేలా కృషి చేయాలని కోరాం’ అని ఎంపీ లావు తెలిపారు. నేడు విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలసి పర్యటన వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
Updated Date - Jun 06 , 2025 | 04:50 AM