Dilshukhnagar Blast Victims Mothers Plea: అదో పీడకల మా ఇంటి దీపం ఆరిపోయింది
ABN, Publish Date - Apr 10 , 2025 | 05:08 AM
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో మృతి చెందిన లక్ష్మీశ్రీనివాసరెడ్డి తల్లి పుల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను ఉరిశిక్ష విధించాలని ఆమె కోరారు, అలాగే ప్రభుత్వం తన కుమారుని కుటుంబానికి అందకున్న పరిహారం, ఉద్యోగం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు
నిందితులను అందరూ చూస్తుండగా ఉరి తీయాలి
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల మృతుడు లక్ష్మీశ్రీనివాసరెడ్డి తల్లి పుల్లమ్మ ఆవేదన
రెంటచింతల, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘అదో పీడకల. మాటలకందని విషాదం. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల నిందితులను అందరూ చూస్తుండగా ఉరితీయాలి’ అని నాటి ప్రమాదంలో మృతి చెందిన బొమ్మిరెడ్డి లక్ష్మీశ్రీనివాసరెడ్డి తల్లి పుల్లమ్మ కోరారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల నిందితులకు తెలంగాణ హైకోర్టు మంగళవారం మరణ శిక్ష ధ్రువీకరించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాతపాలువాయి గ్రామానికి చెందిన ఆమె మాట్లాడుతూ.. ఫిబ్రవరి 21, 2013న దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం వద్ద పేలుళ్లలో తన ఒక్కగానొక్క కుమారుడ్ని పొట్టనపెట్టుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడు మృతి చెంది 12 సంవత్సరాలైనా పోలీసు శాఖ నుంచి ఉద్యోగం కానీ, పరిహారం కానీ అందలేదన్నారు. బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన కుమారుడు రెడ్డి ల్యాబ్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యాడని, 2013 ఏప్రిల్లో డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకుని వచ్చి ఉద్యోగంలో చేరమన్నారని.. అంతలోనే మృత్యుఒడికి చేరాడని నాటి దుర్ఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: జూలకంటి
లక్ష్మీశ్రీనివాసరెడ్డి కుటుంబీకులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. బుధవారం ఆయన రెంటచింతలలో మాట్లాడుతూ మృతుని తల్లిదండ్రులైన పుల్లమ్మ, కౌశిక్‌రెడ్డి పరిస్థితిని సీఎం , హోం మంత్రి, డీజీపీకి వివరిస్తానని హామి ఇచ్చారు.
Updated Date - Apr 10 , 2025 | 05:08 AM