ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh weather: 9 రోజులు ముందుగానే నైరుతి

ABN, Publish Date - May 14 , 2025 | 04:19 AM

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 9 రోజుల ముందుగానే అండమాన్‌ ప్రాంతంలోకి ప్రవేశించి, రాష్ట్రానికి తక్కువ కాలంలో చేరే సూచనలు ఉన్నాయి. రానున్న రోజులలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Weather Updates

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

2-3 రోజుల్లో అరేబియా సముద్రంలోకి ప్రవేశం

27న కేరళను తాకే చాన్స్‌.. నేడు, రేపు వర్షాలు

విశాఖపట్నం/అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): ఎండలతో మండుతున్న ప్రజలకు చల్లని కబురు వచ్చింది. గత కొద్ది రోజులుగా చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు మంగళవారం దక్షిణ, ఉత్తర అండమాన్‌ సముద్రం, అండమాన్‌, నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు రుతుపవనాలు ఆగమనం దృష్ట్యా గత రెండు రోజులుగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ బంగాళాఖాతం మీదుగా నికోబార్‌ దీవుల వరకూ సముద్ర ఉపరితలానికి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తులో పడమర గాలులు బలంగా వీస్తున్నాయి. అదే సమయంలో దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో దట్టంగా రుతుపవన మేఘాలు ఆవరించాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల ప్రవేశంపై ప్రకటన చేసింది. రానున్న 2-3 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్‌ ప్రాంతం, అండమాన్‌ నికోబార్‌ దీవులు మొత్తం, అండమాన్‌ సముద్రంలో మిగిలిన ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని పేర్కొంది.


9 రోజులు ముందుగానే..

సాధారణంగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోకి మే 22న రుతుపవనాలు ప్రవేశించాలి. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో 9 రోజులు ముందుగానే నికోబార్‌ దీవులు, దక్షిణ, ఉత్తర అండమాన్‌ సముద్రంలోకి రుతుపవనాలు వచ్చేశాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కేరళను ముందస్తుగా ఈనెల 27వ తేదీనే (సాధారణ తేదీ జూన్‌ 1) తాకుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అలా జరిగితే 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగానే రావడం మళ్లీ ఇప్పుడు అవుతుంది. ఆ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 23వ తేదీనే కేరళలోకి ప్రవేశించాయి. కాగా, మంగళవారం అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఈ నెల 16 నుంచి 22వ తేదీ మధ్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఇది మరింత బలపడి ఈనెల 23వ తేదీ తర్వాత తుఫాన్‌గా మారే అవకాశం ఉందని బంగ్లాదేశ్‌ వాతావరణ నిపుణుడు ముస్తాఫా కమల్‌ పాషా రెండ్రోజుల క్రితం సోషల్‌ మీడియాలో పోస్టు చేసినట్టు ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి.

నేడు, రేపు పలు జిల్లాల్లో వర్ష సూచన..

తూర్పు ఉత్తరప్రదేశ్‌ నుంచి బిహార్‌ మీదుగా దక్షిణ ఒడిశా వరకు, విదర్భ నుంచి కర్ణాటక మీదుగా కేరళ వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు విస్తరించాయి. ఇంకా అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. వీటి ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు తెలిపాయి. బుధవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కోనసీమ, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని, గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నాయి. గురువారం అల్లూరి, ఉభయగోదావరి, అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పల్నాడు, నంద్యాల, ప్రకాశం, కడప, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ వివరించింది.


రానున్న రెండ్రోజులు భిన్న వాతావరణం..

రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు భిన్న వాతావరణం నెలకొంటుందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. కొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం చాలా చోట్ల 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, మన్యం, తూర్పుగోదావరి జిల్లాల్లోని 12 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 35 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా, మంగళవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.2, అల్లూరి జిల్లా కొండాయిగూడెంలో 42.9, నెల్లూరు జిల్లా దగదర్తి, ప్రకాశం జిల్లా దరిమడుగులో 42.8, ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి, ఏలూరు జిల్లా రాజుపోతేపల్లి, పల్నాడు జిల్లా అమరావతిలో 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, రాష్ట్రంలోని 74 ప్రాంతాల్లో 41 డిగ్రీలపైగా ఎండ ప్రభావం చూపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 10:16 AM