ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Municipalities Told to Raise Income and Cut Waste: మున్సిపాలిటీల ఆదాయం పెంచాలి

ABN, Publish Date - Apr 11 , 2025 | 05:19 AM

మున్సిపాలిటీల ఆదాయం పెంచి స్వయం సమృద్ధిని సాధించాలని మంత్రి నారాయణ సూచించారు. పన్నుల వసూళ్లు పెంపుతోపాటు, వ్యర్థాల నిర్వహణ, తాగునీరు, వీధిలైట్లు వంటి ప్రాథమిక వసతులపై దృష్టి సారించాలని అన్నారు

  • అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి.. పురపాలికలు స్వయం సమృద్ధి సాధించాలి

  • ప్రథమ ప్రాధాన్యతగా వ్యర్థాల నిర్వహణ, తాగునీరు, వీధిలైట్లు, రోడ్ల నిర్మాణం

  • పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్ను వసూళ్లు

  • పన్నుల సొమ్ము వృఽథాగా ఖర్చు చేయొద్దు

  • అన్న క్యాంటీన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టండి

  • మున్సిపల్‌ కమిషనర్ల వర్క్‌షాపులో మంత్రి నారాయణ

అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రజల అవసరాలు తీర్చి వారి మన్ననలు పొందాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందుల్లేకుండా తగిన సౌకర్యాల్ని కల్పించాలన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణను కూడా నిరంతరం పరిశీలించాలని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అన్నారు. గురువారం విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో మున్సిపల్‌ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించి అవసరమైన నిధులను అవే ఖర్చు పెట్టుకునే విధంగా ఆదాయాన్ని పెంచాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో పన్ను రాబడి పెరిగేలా పనిచేయాలని సూచించారు. మున్సిపల్‌శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా మున్సిపల్‌ కమిషనర్లు పనితీరు కనబడాలని చెప్పారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణతో పాటు తాగునీరు, వీధిలైట్లు, రోడ్లకు మున్సిపల్‌ కమిషనర్లు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. 200 రోజుల లోపు వీధి శునకాలకు స్టెరిలైజేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నుల వసూళ్లు పెరిగేలా కృషి చేయాలని అన్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం పన్నుల వసూళ్లు రూ. 500 కోట్లు ఎక్కువగా వసూలు చేసిననందుకు మున్సిపల్‌ సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.


పన్ను వసూళ్లు కీలకం..

‘‘మున్సిపాలిటీల ఆదాయం వాటికే ఇచ్చేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు. మున్సిపాలిటీల్లో రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు పన్నుల వసూళ్లు చాలా కీలకం. పన్నుల ఆదాయంతో అనవసరమైన ఖర్చులు చేయొద్దు. ఆ నిధులను ప్రజలకు కనీస వసతుల కల్పనకు ఖర్చు చేయాలి. మున్సిపాలిటీల్లో ఎస్టాబ్లి్‌షమెంట్‌, మౌలిక వసతుల కల్పన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. నెల్లూరు మున్సిపాలిటీలో 2014-19 మధ్య పన్నుల వసూళ్లలో కొత్త విధానం అమలు చేశాం. దానివల్ల రూ. 1,067 కోట్లు వచ్చింది. రెవెన్యూ ఖర్చులు పోగా రూ. 40 కోట్లు మిగులు ఆదాయం అప్పట్లోనే తీసుకురాగలిగాం. దీన్ని కేపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌గా ఖర్చుపెట్టే వెసులుబాటు ఆ మున్సిపాలిటీకి లభించింది. 2014-19 సంవత్సరాల్లో మున్సిపల్‌శాఖ మంత్రిగా ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీల్లో పన్నులు పెంచలేదు. అనవసరపు ఖర్చులు అరికట్టడం వల్లనే రూ. 700 కోట్ల ఆదాయం మున్సిపాలిటీలకు లభించింది.

అత్యుత్తమ విధానాల అమలు

‘‘రాబోయే కాలంలో యాంత్రీకరణ అవసరం చాలా ఉంటుంది. దేశ విదేశాల్లో ఘన, ద్రవవ్యర్థాలు, రోడ్లు, నీరు, వీధి దీపాల నిర్వహణను పరిశీలించాం. అత్యుత్తమ విధానాలు ఇక్కడ అమలుచేస్తాం. 85 లక్షల టన్నుల వ్యర్థాలను అక్టోబరు 2 లోపు తొలగించాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్లు అందుకు తగ్గట్లు కార్యాచరణ రూపొందించుకోవాలి. అమృత్‌, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాంకు పనులకు సంబంధించి టెండర్లను త్వరలోనే పిలుస్తాం’’ అని మంత్రి చెప్పారు.


కార్యాచరణ ప్రణాళికతో సిద్ధం కావాలి

సంవత్సర కాలానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని పనిచేయాలని మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.సురే్‌షకుమార్‌ అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాల్లో వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్తి పన్ను వసూళ్లను 80శాతం వరకు పెంచేలా కృషి చేయాలని చెప్పారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ పి.సంపత్‌కుమార్‌ వర్క్‌షా్‌పలో మాట్లాడారు. ఈ వర్క్‌షాపులో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ అనిల్‌కుమార్‌, మెప్మా ఎండీ తేజ్‌భరత్‌, టిడ్కో ఎండీ సునీల్‌కుమార్‌రెడ్డి, గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటీఫికేషన్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎంకేవీ శ్రీనివాసులు, టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ విద్యుల్లత, పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ మరియన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 05:19 AM