Nara Lokesh: ఏఐ, డ్రోన్ సాంకేతికతతో ఆలయాల్లో రద్దీ నియంత్రణ
ABN, Publish Date - Feb 20 , 2025 | 04:36 AM
తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు- ప్రదర్శన (ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో- ఐటీసీఎక్స్-2025) ముగింపు కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మనల్ని నడిపించేది దేవుడే
పిల్లలకు ఫోన్లు, ఐప్యాడ్లు ఇచ్చి పుస్తకాలకు దూరం చేస్తున్నాం
చిన్నారులకు స్పైడర్‌మ్యాన్ బదులు శ్రీకృష్ణ లీలలను చెప్పాలి
ఐటీసీఎక్స్ సదస్సు ముగింపు సభలో మంత్రి నారా లోకేశ్
తిరుపతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డ్రోన్ సాంకేతికతలు వినియోగించి ఆలయాల్లో రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మనల్ని ముందుకు నడిపించేది ఆ దేవుడేనని చెప్పారు. బుధవారం సాయంత్రం తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు- ప్రదర్శన (ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో- ఐటీసీఎక్స్-2025) ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రోదసిలోకి రాకెట్లు ప్రయోగించే ముందు ఇస్రో సైంటిస్టులు సైతం శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటున్నారని, అదే దేవుడిపై మనకున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. పిల్లలకు ఫోన్లు, ఐప్యాడ్లు ఇచ్చి పుస్తకాలకు దూరం చేస్తున్నామని, ఈ విధానం మారాలన్నారు. తన కుమారుడు దేవాన్ష్ వయసు తొమ్మిదేళ్లని, అతడికి సెల్‌ఫోన్, ఐప్యాడ్‌కు బదులు దేవుడి పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. నేటి తరం పిల్లలకు స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్‌కు బదులు శ్రీకృష్ణుడి లీలలు, శ్రీరాముడు, శివుడి గురించి తెలియజేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిందని, కొన్ని ఆలయాల్లో ఆ సేవలు అమలు చేస్తున్నామని లోకేశ్ గుర్తుచేశారు. త్వరలో టీటీడీలో కూడా వాట్సప్ సేవలు అందుబాటులోకి తెస్తామని, టికెట్ల కొనుగోలుకు భక్తులు క్యూలో నిల్చోకుండా వాట్సప్ ద్వారా కొనుగోలు చేసేలా చూస్తామని పేర్కొన్నారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా టెక్నాలజీ వినియోగించాలని సూచించారు. ఐటీసీఎక్స్ వంటి భారీ, గొప్ప కార్యక్రమాలను తిరుపతిలో తరచూ నిర్వహించాలని ఆకాంక్షించారు. ఐసీటీఎక్స్ ముగింపు కార్యక్రమంలో లోకేశ్‌ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, పులివర్తి నానీ, గాలి భానుప్రకాశ్, బొజ్జల సుధీర్‌రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
అంతర్జాతీయ ఫెడరేషన్: ప్రసాద్ లాడ్
ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడానికి, ఆలయాలన్నింటినీ ఏకం చేయడానికి వీలుగా అంతర్జాతీయ ఆలయాల ఫెడరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు ఐటీసీఎక్స్ ఛైర్మన్ ప్రసాద్ లాడ్ ప్రకటించారు. అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక గురువులు, ప్రముఖ పండితులు, విధాన నిర్ణేతలతో సలహా బోర్డు ఏర్పాటు చేయనుండటం కీలక ముందడుగుగా అభివర్ణించారు. సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలకు చెందిన 1500కు పైగా ఆలయాల నిర్వాహకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ క్లాంప్లెక్స్
తిరుపతిలో ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవంలో మంత్రి లోకేశ్
రాష్ట్రంలో క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో రూ.7.5 కోట్లతో నిర్మించిన అధునాతన ఇండోర్ స్టేడియాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. అంతకు ముందు వర్సిటీ ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలోని బీటెక్ ఈఈఈ విద్యార్థుల తరగతి గదికి వెళ్లి మాట్లాడారు. వారికి బోధన, వసతి, సదుపాయాలకు సంబంధించిన ప్రమాణాలపై ఆరా తీశారు. మంత్రి లోకేశ్‌తో విద్యార్థినులు సెల్ఫీలు దిగారు.
Updated Date - Feb 20 , 2025 | 04:36 AM