Minister Nara Lokesh : విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
ABN, Publish Date - Jan 05 , 2025 | 03:54 AM
ప్రభుత్వ విద్యావ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి దానిపై ప్రజల్లో నమ్మకం పెంచుతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళిక పునరుద్ధరణ.. ప్రైవేటుకు దీటుగా సర్కారీ విద్యా సంస్థలు
ర్యాంకులు కార్పొరేట్ కాలేజీలకే పరిమితం కాదు.. ఇకపై ప్రభుత్వ విద్యార్థులు కూడా సాధిస్తారు
రాజకీయాలకు దూరంగా విద్యావ్యవస్థ.. విద్యార్థులు ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి
త్వరలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ ప్రత్యేక కార్యక్రమం.. టీచర్లపై యాప్‌ల భారం తగ్గిస్తాం: మంత్రి లోకేశ్
జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
ప్రభుత్వ విద్యావ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి దానిపై ప్రజల్లో నమ్మకం పెంచుతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శనివారం విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. పాయకాపురం ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ, కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యప్రణాళిక పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచుతామని, అందుకే మధ్యాహ్న భోజన పథకానికి రాజకీయ నాయకుల పేర్లు కాకుండా డొక్కా సీతమ్మ పేరు పెట్టామని తెలిపారు. ఉద్యోగాలు అడిగేవారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. యాప్‌లు, పని ఒత్తిళ్లు లేకుండా టీచర్లను విద్యాబోధనకు మాత్రమే పరిమితం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ర్యాంకులు కార్పొరేట్ కళాశాలలకే పరిమితం కాదని ఇకపై ప్రభుత్వ కళాశాల విద్యార్థులు కూడా ర్యాంకులు సాధిస్తారని, అందుకోసం ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు అందిస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు.
డ్రగ్స్ వద్దు బ్రో..
మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేంగా ఈగల్ టాస్క్‌ఫోర్స్ ప్రారంభమైందని, ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టనున్నట్టు తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు లోకేశ్ సూచించారు. టీడీపీ ఒక్కసారి మాత్రమే గెలిచిన మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకుని ఒకసారి ఓటమి పాలైనా పట్టువదలకుండా అక్కడ రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచి చూపించానని చెప్పారు. జీవితాన్ని ఓ పరీక్షగా భావించి శ్రమించి ఉన్నత విజయాలు అందుకోవాలే తప్ప ఒకసారి పరీక్ష తప్పినంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని విద్యార్థులకు హితవు పలికారు. కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమ, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, విశాఖపట్నం జిల్లాలోని వేర్వేరు కళాశాలల్లో భోజన పథకాన్ని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎమ్యెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్,. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు.
ఇంటర్ విద్యార్థులకు సమతుల ఆహారం: సీఎస్
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పకడ్బందీగా అమలు చేస్తామని, ఇంటర్ విద్యార్థులకు సమతుల ఆహారం అందిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. కర్నూలు నగరంలోని బి.క్యాంపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1,48,149 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ప్రస్తుత విద్యా సంవత్సరంలో రూ.28కోట్లు, వచ్చే విద్యా సంవత్సరంలో రూ.86 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. వారానికి 5 రోజులు గుడ్లు, మూడు రోజులు చిక్కీలతో కూడిన మెనూ తయారుచేసినట్టు సీఎస్ తెలిపారు.
Updated Date - Jan 05 , 2025 | 03:54 AM