AP Education Reforms: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్ భేటీ
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:57 AM
నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్(జీఐజీజీ) స్థాపనకు సహకారంపై ఏపీ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ మధ్య గురువారం ఒప్పందం కుదిరింది.
విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై చర్చ
నైపుణ్య శిక్షణలో సహకారానికి ఒప్పందం
న్యూఢిల్లీ, జూన్ 19(ఆంధ్రజ్యోతి): నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్(జీఐజీజీ) స్థాపనకు సహకారంపై ఏపీ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టీబీఐ) వ్యవస్థాపకుడు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో రాష్ట్ర మంత్రి లోకేశ్ గురువారం తాజ్ ప్యాలె్‌సలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న నైపుణ్యాభివృద్ధి అజెండా, నైపుణ్య గణన, దేశం వెలుపల యువతకు ఉపాధి తదితర అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై చర్చించారు. ఆగస్టులో విశాఖలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల సదస్సుకు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని బ్లెయిర్ హామీ ఇచ్చారు. గతేడాది జూలైలో టోనీ బ్లెయిర్‌ను లోకేశ్ ముంబైలో కలిశారు. ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఏఐ టూల్స్‌ను ఉపయోగించడానికి టీబీఐ ద్వారా సహకరించేందుకు బ్లెయిర్ అప్పుడు అంగీకరించారు. విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలుచేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ఏపీ విద్యాశాఖ, టీబీఐ మధ్య గతేడాది డిసెంబర్‌లో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా టీబీఐ విజయవాడలో తమ ఎంబెడెడ్ బృందాన్ని మోహరించి రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తోంది. అందులో ఒకటి ఏపీ ఉన్నత విద్యలో సంస్కరణలు కాగా, రెండోది జీఐజీజీ స్థాపన. ఏపీ విద్యాశాఖ, టీబీఐ మధ్య ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై గురువారం భేటీలో ఇరువురు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. సమావేశంలో ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్, బ్లెయిర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 05:58 AM