Labour Law Amendments: కార్మిక చట్టాలకు సవరణలు
ABN, Publish Date - Jun 10 , 2025 | 03:47 AM
కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్ 2020కు అనుగుణంగా పలు కార్మిక చట్టాలకు సవరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, ఏపీ ఫ్యాక్టరీస్ రూల్స్ 1950కు సంబంధించి పని గంటల సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలపగా..
పనివేళలు 10 గంటల పెంపునకు ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
పారిశ్రామిక వివాద, కాంపౌండింగ్ చట్టాల్లోనూ సవరణలకు ప్రతిపాదనలు
పని ప్రదేశాల్లో మహిళల రక్షణకు రూల్స్
కొన్నింటికి కేంద్ర ప్రభుత్వ సమ్మతితో..
అమరావతి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్ 2020కు అనుగుణంగా పలు కార్మిక చట్టాలకు సవరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, ఏపీ ఫ్యాక్టరీస్ రూల్స్ 1950కు సంబంధించి పని గంటల సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలపగా.. రాత్రిపూట పనుల్లో మహిళలు పనిచేయడం, కార్మికుల సమస్యల పరిష్కారం తదితర అంశాల్లో సవరణలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం గతంలో రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలు మాత్రమే కార్మికుడు పనిచేయాలి. నెలలో 50 గంటలు ఓవర్‌టైం చేసుకునే అవకాశం ఉంటుంది. ఐదు గంటల తర్వాత కనీసం ఒక గంట విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే తాజా సవరణల ప్రకారం.. రోజుకు 8 నుంచి 10 గంటల వరకు పనిచేయవచ్చు. వారానికి సరాసరిన 48 గంటలు పనిచేయాలన్న దానిపై ఎలాంటి మార్పు చేయలేదు. అదేవిధంగా ప్రతి మూడు నెలలకు 144 గంటలు ఓవర్‌టైం పనిచేయవచ్చు. గతంలో 8 గంటలు దాటి పనిచేస్తే ఓవర్‌టైంగా పరిగణించేవారు. తాజా సవరణల్లో 10 గంటలు దాటిన పనిని ఓవర్‌టైంగా పరిగణిస్తారు. ఫ్యాక్టరీస్ చట్టం ప్రకారం ఇప్పటి వరకు రోజుకు 9 గంటలు పనిచేసేవారు. తాజా సవరణ ప్రకారం 10 గంటలు చేస్తారు. గతంలో త్రైమాసికంలో 75 గంటలు ఓవర్‌టైం చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు 144 గంటలు చేసుకోవచ్చు. గతంలో ఐదు గంటల తర్వాత కనీసం అరగంట విశ్రాంతి ఉండగా.. తాజా సవరణల్లో 6 గంటల తర్వాత కనీసం అర్ధ గంట విశ్రాంతి తీసుకోవచ్చు.
రాత్రిపూట పనుల్లో మహిళలకు రక్షణ
ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లి్‌షమెంట్ చట్టంలో మహిళా కార్మికులు రాత్రి పూట పనిచేయరాదన్న నిబంధన 2022 వరకు ఉండేది. మహిళలపై వివక్ష చూపరాదన్న న్యాయస్థానాల ఆదేశాలతో ఆ తర్వాత కార్మిక చట్టాల్లో మార్పులు తెచ్చారు. పలు వసతులు కల్పించి, రాత్రి పూట కూడా మహిళలు పని చేసుకోవచ్చని పేర్కొన్నారు. పనిచేసే చోట కనీసం ఐదుగురు మహిళలు ఉండాలని, క్రెచ్ (పిల్లల సంరక్షణ కేంద్రాలు) సెంటర్లు, విశ్రాంతి గదులు, టాయ్‌లెట్లు తదితర ఐదు రకాల సర్వీసులుండాలని నిబంధన పెట్టారు. అయితే షాప్‌లు చిన్నవి కావడం వల్ల.. అలాంటి చోట్ల విశ్రాంతి గదులు, క్రచ్ సెంటర్లు ఏర్పాటు కష్టమవుతుందని కేంద్రం నిబంధనలను కొంత మేర సవరించింది. విశ్రాంతి గది, టాయ్‌లెట్ తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని తాజా ప్రతిపాదిత సవరణల్లో పేర్కొన్నారు. మెటర్నిటీ బెనిఫిట్ చట్టం-1961 ప్రకారం మహిళలకు ప్రసవానికి ముందు 8 వారాలు, తర్వాత 8 వారాలు పనిచేయరాదన్న నిబంధన అమలు చేయాలన్నారు. పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులు లేకుండా, ప్రతి మహిళ ఇంటి వద్దకు రవాణా సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాత్రి పని విషయంలో ఫ్యాక్టరీస్ చట్టంలోనూ సవరణలు తెచ్చారు. మహిళల సమ్మతితోనే రాత్రి పూట వారితో పనిచేయించాలని, సీసీ కెమెరాలు, రవాణా వంటి సౌకర్యాలతో రక్షణ తదితర ఆరు నిబంధనలను చేరుస్తూ ఫ్యాక్టరీస్ చట్టంలోని 66 1(బీ)కు సవరణలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వచ్చే క్యాబినెట్ సమావేశం ముందుకు వీటిని తీసుకురానున్నారు. చట్ట సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి సమ్మతి తర్వాత చట్టరూపం దాలుస్తుంది.
పారిశ్రామిక వివాద చట్టంలోనూ మార్పులు
పారిశ్రామిక వివాద చట్టంలోనూ కొన్ని మార్పులు చేస్తూ రాష్ట్ర కార్మిక శాఖ సవరణలు తెచ్చింది. ఇది కేంద్ర చట్టం కావున.. ఈ చట్టం సవరణకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం మూడేళ్ల లోపు దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనలు ఉండేవి. ఈలోపు దరఖాస్తు చేసుకోకపోతే ఆ విజ్ఞప్తికి కాలం చెల్లినట్లే. మూడేళ్ల గడువు వల్ల వివాదాలు ఎక్కువ అవుతున్నాయని, దాని నిడివి ఒక ఏడాదికి తగ్గించాలని 2019లో నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ 2020 నిబంధనలకు అది విరుద్దంగా ఉండడంతో మూడేళ్ల గడువును రెండేళ్లకు తగ్గిస్తూ తాజా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వచ్చే క్యాబినెట్ భేటీలో దానిని ఆమోదం కోసం పెట్టనున్నారు. అదే విధంగా పారిశ్రామిక వివాద చట్టం ప్రకారం అత్యవసర సేవలో పనిచేసే కార్మికులు బంద్ చేయాలంటే 14 రోజుల ముందు నోటీసులివ్వాలన్న నిబంధన ఇప్పటికే ఉంది. నాన్ యుటిలిటీ సేవా రంగంలో ఉన్న కార్మికులు కూడా బంద్ నిర్వహించాలంటే 14 రోజుల ముందు నోటీసులివ్వాలని తాజాగా సవరణ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం సమ్మతిస్తే ఈ రెండు ప్రతిపాదనలతో చట్ట సవరణ చేయనున్నారు.
కాంపౌండింగ్ చట్టంలో సవరణలు
జరిమానాకు సంబంధించి కాంపౌండింగ్ చట్టంలో కూడా సవరణలు తీసుకురానున్నారు. చిన్న పొరపాట్లకు అధికారులు ట్రాఫిక్ చలానా లాగా అప్పటికప్పుడు జరిమానాలను అక్కడికక్కడే వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. దీంతో చిన్న తప్పిదాలకు కోర్టుదాకా వెళ్లే ఇబ్బందులు ఉండవు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లి్‌షమెంట్ చట్ట సవరణలకు ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం లభించగా.. మిగిలినవి ప్రతిపాదనల దశలో ఉన్నాయి. అన్నీ కేంద్ర చట్టాలు కావడంతో రాష్ట్రపతి ఆమోదం తర్వాత అవి చట్టరూపం దాల్చనున్నాయి.
పనిగంటల పెంపును ఉపసంహరించుకోవాలి
పని గంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు సోమవారం లేఖ రాశారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కార్మిక లోకానికి వ్యతిరేకంగా కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్‌లను తీసుకురాగా.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ శ్రామికశక్తిపై గుదిబండ మోపిందని మండిపడ్డారు.
-సీపీఐ రామకృష్ణ
Updated Date - Jun 10 , 2025 | 03:52 AM