నందికొట్కూరు మార్కెట్ యార్డు అభివృద్ధికి సహకారం..
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:47 AM
నందికొట్కూరు మార్కెట్ యార్డు అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
నందికొట్కూరు, జూలై 11(ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు మార్కెట్ యార్డు అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి సమావేశం సమావేశం శుక్రవారం చైర్మన్ ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గౌరవాధ్యక్షులుగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో చేపట్టి మధ్యలోనే ఆగిపోయిన కాంప్లెక్స్ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. కొన్ని గోదాములు మరమ్మతులకు గురయ్యా యని, వాటిని రిపేరి చేయిస్తామని చెప్పారు. ఏసీ గోదాము నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఉల్లి కొనుగోలు చేసేందుకు అనుమతులు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు పండించిన ఉత్పత్తులను ఇక్కడే అమ్ముకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. చైర్మన్ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న దుకాణాల కాంప్లెక్స్ నిర్మాణాన్ని, గోదాముల మరమ్మతులు, ఏసీ గోదాము నిర్మాణం తదితర అంశాలపై తీర్మానాలను కమిటీ సభ్యులు ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎంసీ ఉపాధ్యక్షుడు సుధాకర్ యాదవ్, డైరెక్టర్లు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, మహేశ్వరి, పెద్ద దస్తగిరి, విజయలక్ష్మి, రాములమ్మ, మల్లీశ్వరి, నిర్మల, కార్యదర్శి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 13 , 2025 | 08:29 AM