అదును సమయానికి సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి
ABN, Publish Date - Jul 03 , 2025 | 12:50 AM
అదును సమయానికి ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలని మండల పరిషత్ సభ్యులు కోరారు.
పాణ్యం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): అదును సమయానికి ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలని మండల పరిషత్ సభ్యులు కోరారు. బుధవారం పాణ్యం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఉశేన్ బీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. సరైన అదును సమయానికి ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు అందించాలని తొగర్చేడు సర్పంచ్ శ్రీనివాసరెడ్డి కోరారు. మట్టి నమూనాల వివరాలు వచ్చేలోపు అదును తప్పిపోతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో కొన్నిసార్లు పంటలు చెడగొట్టుకొని మరోపంటలు వేసుకోవాల్సి వస్తుందన్నారు. రైతులకు సక్రమంగా యూరియా అందడం లేదని ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు చెప్పారు. కౌలూరులో వ్యవసాయ సిబ్బంది కొరత తీర్చాలని ఎంపీటీసీ భాస్కరరెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులకు అవసరమైన కంది రకాలు ఇవ్వడం లేదని సర్పంచ్ రామచంద్రుడు చెప్పారు. మద్దూరు కంటి వైద్య నిపుణున్ని పాణ్యం సీహెచ్‌సీకి డిప్యుటేషన్‌పై బదిలీ చేయాలని సభ్యులు కోరారు. మండలంలో క్యాన్సర్ రోగులకు అవసరమైన వైద్య సలహాలు అందడం లేదని తమ్మరాజుపల్లె సర్పంచ్ అన్నారు. మండలంలోని ప్రహారీ లేని పాఠశాలలకు వెంటనే ప్రహారీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సభ్యులు కోరారు. దీనికి ఎంఈవో నిధుల కొరతతో పనులు జరగడం లేదన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వ ంటి పథకాలు ఇవ్వకూడదని సర్పంచ్ శ్రీనివాసరెడ్డి కోరారు. ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, డీటీ శివశంకరరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు సరళమ్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 12:50 AM