వైసీపీని ప్రజలు నమ్మరు: మంత్రి బీసీ
ABN, Publish Date - May 23 , 2025 | 12:21 AM
ఒట్టి డైలాగులు చెప్పే నాయకులను ప్రజలు ఎప్పుడు నమ్మరని, తమకు సేవ చేసే నాయకులనే నమ్ముతారని, వైసీపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
నందికొట్కూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): ఒట్టి డైలాగులు చెప్పే నాయకులను ప్రజలు ఎప్పుడు నమ్మరని, తమకు సేవ చేసే నాయకులనే నమ్ముతారని, వైసీపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బీసీతో పాటు టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా మార్కెట్ యార్డు నూతన చైర్మన్‌గా వీరం ప్రసాద్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా సుధాకర్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సభ్యులుగా బి.మహేశ్వరి, తెలుగు పెద్ద దస్తగిరి, జి.విజయలక్ష్మి, ఐ.జీవన సుఖన్య, ఎం.రాములమ్మ, మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, పి.మళ్లీశ్వరి, ఆర్.ఛాయలీల, ఎస్.సంపత్‌కుమార్, జెడ్. నిర్మల, బి.రవిరాజ్, ఎస్.రేష్మా పర్వీన్, ఎస్.గాజుల మన్‌సూర్‌భాషలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మంత్రి బీసీ మాట్లాడుతూ గత వైసీపీ నాయకులు డైలాగులు చెబుతూ కాలం వెళ్లదీశారని, అది గమనించిన ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు. దీంతో కూటమి ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి పదవులు కట్టబెట్టడం ఒక్క టీడీపీకే దక్కుతుందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో నెలకొన్న ప్రధానమైన మూడు సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. ఎన్నికల ముందు ఇచ్చిన మిడ్తూరు ఎత్తిపోతల పథకం ఏర్పాటును 2029 నాటికి పూర్తి చేసి మిడ్తూరు, జూపాడుబంగ్లా మండలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా నందికొట్కూరు నుంచి పగిడ్యాలకు వెళ్లే ప్రధాన రోడ్డు గుంతలమయమైందని, వెంటనే మంజూరు చేయాలని మంత్రిని కోరారు. అలాగే మండ్లెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిరైతులను ఆదుకోవాలని కోరారు. మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ 80 శాతం వ్యవసాయంపై ఆధారపడిన నందికొట్కూరు నియోజకవర్గంలో సాగునీరు లేక రైతాంగం ఇబ్బందులకు గురవుతున్నారు. రైతాంగానికి సాగునీరు అందించే దిశగా తన అడుగులు ఎప్పుడూ ఉంటాయని మాండ్ర తెలిపారు. ప్రసాద్‌రెడ్డి, పార్టీని నమ్ముకుని ఉన్నందుకే ఆయనకు చైర్మన్ పదవి దక్కిందన్నారు. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ రబ్బాని, 29వ వార్డు కౌన్సిలర్ భాస్కర్‌రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ జాకీర్, జనసేన నాయకులు రవి, బీజేపీ నాయకులు దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 23 , 2025 | 12:21 AM