పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్
ABN, Publish Date - Apr 18 , 2025 | 01:04 AM
జిల్లాలోని బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో స్పెషల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంఈవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21లోపు బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని గత ప్రభుత్వంలో జీవో 117ప్రకారం పాఠశాలల సర్దుబాటుతో కొంతమంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరారని, ఈ విద్యాసంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోకు సవరణ చేయడం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. 1వ తరగతిలో చేరాలనుకున్న అంగన్‌వాడీ పిల్లలను గుర్తించాలని, ఈ నెల 8నుంచి 22వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్వాడ ఉత్సవాలు ద్వారా పౌష్టికాహారం అందజేస్తున్నామని చెప్పారు. ఆవరణలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార సందర్శనశాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ రామునాయక్, ఆత్మకూరు ఆర్డీవో అరుణజ్యోతి, డీఈవో జనార్దన్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ లీలావతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 18 , 2025 | 01:04 AM