Nadendla Manohar: రేషన్ షాపుల ద్వారానే నిత్యవసర వస్తువుల పంపిణీ.. ఎందుకంటే..
ABN, Publish Date - May 29 , 2025 | 12:56 PM
రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టింది. జూన్ 1 నుంచి వీటిని అందించనుంది.
విజయవాడ, మే 29: బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువుల పంపిణీ చేపడుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తామన్నారు. అందుకోసం దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా ఈ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. గురువారం విజయవాడ మధురానగర్‌లోని 218 రేషన్ షాపులో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఈపోస్ మిషన్‌తోపాటు ఎలక్ట్రానిక్ కాటా పని తీరును మంత్రి నాదెండ్ల మనోహర్‌తోపాటు ఆ శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ స్వయంగా పరిశీలించారు.
అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గతంలో రేషన్ వస్తువులను ఉదయం 8 నుంచి 12 గంటలు, సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పంపిణీ జరిగేదన్నారు. ఇలా గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పేరుతో మాయ చేసిందంటూ ఆయన విమర్శించారు. దీని వల్ల రూ. వేల కోట్లు దుర్వినియోగం అయ్యేలా చేశారంటూ గత ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఈకేవైసీ 96 శాతం మేర పూర్తి చేశామని.. ఇది దేశంలోనే ఒక రికార్డు అని ఆయన పేర్కొన్నారు. పనులు మానుకుని రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి తమ ప్రభుత్వం స్వస్తి పలికామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల కోసం పని చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. జూన్ ఒకటి నుంచి 4. 40 లక్షల మందికి సరుకులు పంపిణీ చేయనున్నామన్నారు. మార్కెట్‌లో ధరలు పెరుగుదల ఉంటే.. సబ్సిడీపై రేషన్ షాపుల ద్వారా వాటిని ఇస్తామన్నారు. ప్రతి రేషన్ షాపు ఫొటొ తీసి యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉంచామని తెలిపారు. అన్ని షాపులకు ఈ సాయంత్రానికి సరుకులు చేరుతాయని వివరించారు. ఈపోస్ మిషన్, కాటా, సర్వీసింగ్ ఉచితంగా చేయిస్తున్నామని చెప్పారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించామన్నారు.
వృద్దులు, దివ్యాంగులకు వారి వారి ఇళ్లకు వెళ్లి సరుకులు అంద చేస్తామని తెలిపారు. అందుకు అన్ని విధాలా డీలర్లు ను కూడా సన్నద్ధం చేశాని చెప్పారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాలు సైతం రేషన్ షాపులు పని చేస్తాయని చెప్పారు. ఎం.డి.యూలు పది శాతం డబ్బులు కట్టారన్నారు. మిగతా నగదు కార్పొరేషన్ ద్వారా కట్టి.. వాహనాలు వారికే ఇస్తున్నామన్నారు. ప్రజలు కూడా రేషన్ షాపుల ద్వారానే సరుకులు ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు.
ఈ 15 రోజుల్లో వారికి వీలున్న సమయాల్లో సరుకులు తెచ్చుకుంటారన్నారు. 29,760 రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ ఉంటుందని తెలిపారు. మార్కెట్‌లో పెరిగే వస్తువులను బట్టి.. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే వాటిని అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశమని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..
వెన్నుపోటు రాజకీయాలు రావంటూ కవిత సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 29 , 2025 | 12:58 PM