Share News

Kavitha : వెన్నుపోటు రాజకీయాలు రావంటూ కవిత సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 29 , 2025 | 11:45 AM

ఏపీ సీఎం చంద్రబాబు ఏమి చేసినా.. కేంద్రం అడ్డుకోవటం లేదని ఒకింత అసహనాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇప్పటికీ గోదావరి నదీ జలాలు పంపకం సరిగా జరగలేదన్నారు.

Kavitha : వెన్నుపోటు రాజకీయాలు రావంటూ కవిత సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, మే 29: మా నాన్నకు తాను లేఖ రాస్తే తప్పేంటి? అయినా నీకు నొప్పి ఏందిరాబయ్? అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డపై ఎటు పడితే అటు మాట్లాడితే సరి కాదన్నారు. గురువారం కవిత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనకు నీతులు చెబుతోన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు.. తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలంటూ సూచించారు. కేసీఆర్ నీడలో పని చేస్తోన్న వారు.. తనపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు.

దమ్ముంటే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీపై మీ ప్రతాపం చూపించాలంటూ ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆమె సవాల్ విసిరారు. తాను అసలే మంచి దాన్ని కాదని.. తాను నోరు విప్పితే తట్టుకోలేరంటూ బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేయకుండా.. ట్వీట్టర్‌లో మెసేజ్‌లు పెడితే సరిపోతాయా? అంటూ ఆమె ప్రశ్నించారు. తనను రేవంత్ రెడ్డి కోవర్ట్ అనటం కరెక్టేనా? అని నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్ట్‌లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేసీఆర్‌కి అప్పుడే చెప్పా..

బీజేపీకి బీఆర్ఎస్‌ను అప్పగించే ప్రయత్నం జరుగుతుందని ఆమె అభిప్రాయమన్నారు. తనను కాంగ్రెస్ కోవర్ట్ అన్నారు. మరి బీఆర్ఎస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారనుకోవాలా? అని సందేహం వ్యక్తం చేశారు. తాను జైలులో ఉన్నప్పుడే.. బీజేపీలో బీఆర్ఎస్‌ను కలపొద్దని కేసీఆర్‌ను కోరానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తొందరపాటు నిర్ణయం వద్దని జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్‌కు సూచించానన్నారు. ఆరు నెలలు కాదు.. సంవత్సరాలు అయినా జైల్లో ఉంటానని కేసీఆర్‌కు తాను స్పష్టం చేశానని కవిత ఈ సందర్భంగా వివరించారు.


నాపై పడి ఏడుస్తున్నారు..

బీజేపీ నేతలకు చెందిన హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరో అందరకీ తెలుసునంటూ పార్టీలోని అగ్రనేతలను ఆమె పరోక్షంగా విమర్శించారు. తన లేఖ లీక్ చేసిందెవరు తేల్చమంటే.. తనపై పడి ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు. పదవులు కోరినట్లు తనపై పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారన్నారు. కేసీఆర్ లెక్క.. తాను చాలా తిక్కదానినని ఆమె పునరుద్ఘాటించారు. వెన్నుపోటు రాజకీయాలు తను రావని.. సూటిగా మాట్లాడుతానని కుండ బద్దలు కొట్టారు.


మహాభారతం క్యారెక్టర్లు..

సామాజిక తెలంగాణ సాధన కోసం తాను పోరాడుతానన్నారు. మా వాళ్ళు కొందరు.. సోషల్ మీడియాలో మహాభారతం క్యారెక్టర్లు వేస్తున్నారంటూ వ్యంగ్యంగా అన్నారు. వారు స్థాయికి మించి ఊహించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. వరంగల్ సభ తమ వలనే సక్సెస్ అయిందని కొందరు ఊహించుకుంటున్నారన్నారు. కేసీఆర్‌ను మోసేంత పెద్ద వాళ్ళు అయిపోయామని వారంతా భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎమ్మెల్యేలే ఓడించారు..

జైలు వెళ్ళేటప్పుడు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ వద్దంటేనే తాను ఈ పదవిలో కొనసాగుతున్నానన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిజామాబాద్ ఎంపీగా తనను ఓడించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంగా ఉండగా చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారన్నారు.


సీఎం చంద్రబాబు ఏమి చేసినా..

ఏపీ సీఎం చంద్రబాబు ఏమి చేసినా.. కేంద్రం అడ్డుకోవటం లేదని ఒకింత అసహనాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇప్పటికీ గోదావరి నదీ జలాలు పంపకం సరిగా జరగలేదన్నారు. ఏపీ చేపట్టనున్న బనకచర్ల ప్రాజక్టుతో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ నోటీసులు ఇస్తే.. పార్టీ ఎందుకు కార్యాచరణ తీసుకులేదని పార్టీలోని అగ్రనేతలను ఆమె సూటిగా ప్రశ్నించారు. పెద్ద నేతలుగా ఊహించుకునే వారు ఎందుకు స్పందించ లేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేరటానికి ప్రయత్నం చేశాననటం అబద్దమన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని ఈ సందర్భంగా కవిత అభివర్ణించారు. తన పార్టీ బీఆర్ఎస్.. తన నాయకుడు కేసీఆర్ అంటూ కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్ మాత్రమే తన నాయకుడని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ తప్ప.‌. ఇతర నేతల నాయకత్వంలో తాను పనిచేయనని కుండ బద్దలు కొట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న వారిని గౌరవిస్తానని కవిత పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..

భారీ వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం

For Telangana News And Telugu News

Updated Date - May 29 , 2025 | 12:10 PM