PSR Court Hearing: జెత్వానీ కేసులో ఏం జరిగిందో చెప్పిన పీఎస్‌ఆర్
ABN, Publish Date - Apr 23 , 2025 | 11:47 AM
PSR Court Hearing: నటి జెత్వానీ కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులును కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని పీఎస్‌ఆర్ వాదించారు.
అమరావతి, ఏప్రిల్ 23: నటి జెత్వానీ కేసులో (Actress Jethwani Case) అరెస్ట్ అయిన పీఎస్‌ఆర్ ఆంజనేయులును (PSR Anjaneyulu) ఈరోజు(బుధవారం) ఉదయం థర్డ్ ఏసీజేఎమ్ కోర్టులో సీఐడీ పోలీసులు హాజరుపర్చారు. న్యాయమూర్తి ఛాంబర్‌లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట లాయర్‌తో కలిసి తన వాదనలు వినిపించారు పీఎస్‌ఆర్. జెత్వానీ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికు వివరించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని వాదించారు. మాజీ డీసీపీ విశాల్ గున్నిని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్‌గా మారి.. ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారని న్యాయమూర్తి ముందు చెప్పుకొచ్చారు. 164 స్టేట్‌మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా.. ఇవ్వడానికి ఆయన నిరాకరించారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన న్యాయమూర్తి ముందు పీఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఏ సంబంధం లేదు: పీఎస్‌ఆర్
‘నేను ఈ కేసులో సహకరిస్తాను అన్నాను. అసలు ఇది తప్పుడు కేసు. నాకు ఈ కేసు విషయంలో సంబంధం లేదు’ అని జడ్జి ముందు పీఎస్‌ఆర్ తెలిపారు. అలాగే పీఎస్‌ఆర్ తరపున న్యాయవాది నగేష్ రెడ్డి వాదిస్తూ.. కేసులోని టెక్నికల్ డిటైల్స్ చెప్పుకొచ్చారు. మిగితా నిందితులకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని.. అసలు రిమాండ్ విధించాలనే దానికి బేస్ లేదన్నారు. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరుతున్నామని న్యాయవాది నగేష్ రెడ్డి వాదించారు.
నటిపై అక్రమ కేసు: రాజేంద్రప్రసాద్
న్యాయమూర్తి ముందు సీఐడీ తరపున రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే ముంబై నటిపై అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఇదే విషయాన్ని విశాల్ గున్ని కూడా సీఐడీ విచారణలో వెల్లడించారని తెలిపారు. ఆగమేఘాల మీద విశాల్ గున్నిని అప్పటి కమిషనర్ అప్పటి సీఎంవోకు పిలిపించారని న్యాయవాది రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు.
అంతా పీఎస్‌ఆర్‌దే..
ప్రభుత్వ న్యాయవాది సాయి రోహిత్ వాదిస్తూ.. జెత్వానీ కేసులో ప్రణాళిక అంతా పీఎస్‌ఆర్ ఆంజనేయులుదే అని విశాల్ గున్ని స్టేట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. విజయవాడ డీసీపీగా ఉన్న విశాల్ గున్నీని డీఐజీగా ప్రమోషన్ ఇచ్చి వైజాగ్ పంపాలని.. అయితే జెత్వనీ కేసు అరెస్ట్‌లు పూర్తి అయ్యాకే పంపుతామని విశాల్ గున్నీని పీఎస్‌ఆర్ బెదిరించారని తెలిపారు. విశాల్ గున్నీ, అప్పటి కమిషనర్ కాంతి రాణాను సీఎంఓకు పీఎస్‌ఆర్ పిలిపించారన్నారు. జెత్వానీని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో అనే విషయాన్ని పీఎస్‌ఆర్‌కు తెలియజేశామని విశాల్ గున్నీ అంగీకరించినట్లు చెప్పారు. జెత్వానీపై తప్పుడు కేసు పెట్టి 42 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు. పీఎస్‌ఆర్‌పై గుంటూరు జిల్లా నగరం పాలెంలో కూడా మరో కేసు నమోదు అయింది అని ప్రభుత్వ న్యాయవాది సాయి రోహిత్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం వాదనలు ముగిశాయి. పీఎస్‌ఆర్‌కు వచ్చే నెల 7 వరకు అంటే 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. పీఎస్‌ఆర్‌కు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: హృదయాన్ని కదిలించే విషాదం..పహల్గామ్ ఉగ్రదాడిలో అర్ధాంతరంగా ఆగిన జీవితం
Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 23 , 2025 | 12:23 PM