CPI Ramakrishna: ప్రజా సేవ చేయాలి.. వదిలేయండని అంటున్నాడంటే..
ABN, Publish Date - Jun 01 , 2025 | 01:03 PM
దేశానికి స్వాతంత్రం వచ్చి 78 యేళ్లు అయినా నేటికీ పల్లెల్లో తాగునీరు ఇవ్వడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా గ్రామాలకు మంచి నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ, జూన్ 01: మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా ద్వారా రూ. వేల కోట్లు దోచేశాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అందరినీ తన కను సన్నల్లో నడిపించి.. జ్యూడీషియరీని సైతం అవినీతిలో భాగం చేశాడంటూ గాలి జనార్దన్ రెడ్డిని విమర్శించారు. జడ్జీలకు లంచాలు ఇస్తుండగా.. ఆనాటి అధికారులు పట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా గజ దొంగకు కేవలం ఏడు యేళ్లు జైలు శిక్ష అంటే చాలా తక్కువే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
ప్రజలకు సేవ చేయాలి.. వదిలేయండని అంటున్నాడంటే.. న్యాయ వ్యవస్థ ఎలా ఉందో అర్దం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 యేళ్లు అయినా నేటికీ పల్లెల్లో తాగునీరు ఇవ్వడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా గ్రామాలకు మంచి నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. బొట్టు పెట్టుకుని సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ తాగునీటి గురించి ఎందుకు మాట్లాడరంటూ ఆయన ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెబుతారే తప్ప.. గ్రామాలలో తాగునీటి గురించి స్పందించరా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఒండ్రుమట్టి నీళ్లు తాగుతున్న గ్రామాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని ఈ సందర్బంగా గుర్తు చేశారు. 2025-26 బడ్జెట్‌లో కూడా సాగు, తాగు నీటి అవసరాలకు నిధులు కేటాయించ లేదన్నారు.
అమరావతి, పోలవరం గురించి తెగ ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసు ఎత్తడం లేదని పేర్కొన్నారు. గోదావరి, బనకచర్ల పేర్లు చెప్పి రూ. వేల కోట్లు అప్పులు చేయాలని ఆలోచన చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగు నీరు లేక వలసలు పోతున్న గ్రామాల గురించి, అక్కడ ప్రజలు గురించి మాట్లాడటం లేదన్నారు. ఇప్పటికే ఏడాది పాలన పోయింది.. నిధులు ఇవ్వకపోవడంతో.. మరో యేడాది కూడా ఇదే పరిస్థితి దాపురిస్తోందని చెప్పారు.
సీఎం చంద్రబాబు ఇదే తరహాలో వ్యవహరిస్తే.. వంద యేళ్లకు కూడా కర్నూలు జిల్లాకు తాగు నీరు ఇవ్వ లేరని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతలు సక్రమంగా ఉండటం లేదు.. ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు చేస్తున్నారని చెప్పారు. భూ కేటాయింపులు మొత్తం పూర్తి పారదర్శకంగా ఉండేలా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు కాబట్టే.. ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడం లేదని విమర్శించారు. ప్రజలు అవసరాలను గుర్తించి, తాగు, సాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గోశాల నుంచి గోవిందుడి వరకు వైసీపీ అబద్ధపు ప్రచారం
మావోయిస్టుల కుట్రను భగ్రం చేసిన భద్రతా బలగాలు
For Andhrapradesh News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 01:03 PM