Liquor Scam: బాలాజీ గోవిందప్ప అరెస్టు
ABN, Publish Date - May 14 , 2025 | 04:14 AM
వైసీపీ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. షెల్ కంపెనీల ద్వారా అక్రమ సొమ్ములు తాడేపల్లి ప్యాలెస్‌కు తరలించిన వ్యవహారంలో బాలాజీ పాత్ర కీలకమని అధికారులు గుర్తించారు.
మద్యం కేసులో కీలక మలుపు
మద్యం ముడుపులను షెల్ కంపెనీలకు మళ్లించిన వ్యవహారంలో గోవిందప్పే కీలకం
భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌గా స్కామ్‌లో భూమిక
సీఏగా తెలివితేటలు వాడి తాడేపల్లికి సొమ్ములు
సిట్ విచారణ ఎగ్గొట్టి అజ్ఞాతంలో.. కర్ణాటకలో ఆచూకీ..
చివరికి చామరాజనగర్ జిల్లా బీఆర్‌హిల్స్‌లో అరెస్టు
బెజవాడకు తీసుకొస్తున్న అధికారులు.. నేడు కోర్టుకు!
జగన్ ఓఎస్డీ కుమారుని వ్యాపారాల్లో తనిఖీలు
హైదరాబాద్‌లో ఆరుచోట్ల సోదాలు, డాక్యుమెంట్లు సీజ్
ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీంలో మధ్యంతర ఊరట
మిథున్‌రెడ్డికి చుక్కెదురు.. మధ్యంతర రక్షణ ఆదేశాలు రద్దు
అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని సిట్ అరెస్టు చేసింది. జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈకేసులో కర్ణాటకలో అదుపులోకి తీసుకుంది. మద్యం ముడుపులను షెల్ కంపెనీల్లోకి మళ్లించిన వ్యవహారంలో బాలాజీ పాత్రే కీలకమని సిట్ ఇప్పటికే గుర్తించింది. చార్టర్డ్ అకౌంటెంట్‌గా తన తెలివితేటలను వాడి తాడేపల్లి ప్యాలె్‌సకు ఆయన సొమ్ములు తరలించారనేందుకు ఆధారాలు సేకరించింది. ఈ నెల 11న విచారణకు రావాల్సిందిగా సిట్ ఈ నెల తొమ్మిదో తేదీన ఇచ్చిన నోటీసును తోసిపుచ్చి, బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీని కర్ణాటకలో గుర్తించిన సిట్ బృందం మంగళవారం అక్కడకు వెళ్లింది. మైసూరులోని ఓ రిసార్టులో ఉన్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లింది. అయితే, అప్పటికే ఆ బసను బాలాజీ ఖాళీ చేసినట్టు తెలుసుకుంది. సాంకేతికతను వాడి చామరాజనగర్ జిల్లా యల్లందూరు తాలుకాలోని ఒక అటవీ ప్రాంతంలోని (బీఆర్ హిల్స్) వెల్‌నెస్ సెంటర్‌లో ఆయనను కనుగొంది. అక్కడ సేద తీరుతున్న బాలాజీని అదుపులోకి తీసుకుంది. బీఆర్ హిల్స్‌లో ఒక్కసారిగా సిట్ అధికారులను చూడటంతో ఆయన అవాక్కయ్యారు. మారు మాట్లాడకుండా వచ్చి పోలీసు వాహనంలో ఎక్కి కూర్చున్నారు. ఆ వెంటనే స్థానిక కోర్టుకు బాలాజీని తరలించారు. కోర్టు అనుమతితో విజయవాడకు తీసుకొస్తున్నారు. బుధవారం సాయంత్రం లేక గురువారం విజయవాడ సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మద్యం స్కామ్ కేసులో బాలాజీ గోవిందప్పను ఏ33గా నిందితుల జాబితాలో సిట్ చేర్చింది. రాజ్ కసిరెడ్డి(ఏ 1) నుంచి బాలాజీ గోవిందప్ప వరకూ ఈ కేసులో ఇప్పటి వరకూ ఐదుగురు అరెస్టయ్యారు. .
షెల్ కంపెనీలు సృష్టించి.. ముడుపులు మళ్లించి..
గత ప్రభుత్వంలో జగన్ తాడేపల్లి ప్యాలె్‌సకు రూ.3,200కోట్ల మద్యం ముడుపులు చేరినట్టు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఐడీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు (ఐజీ ర్యాంక్) నేతృత్వంలో సిట్‌ను రంగంలోకి దించింది. తాడేపల్లిప్యాలెస్‌కు మద్యం సొమ్ములు చేర్చడంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల పాత్రను సిట్ అధికారులు పసిగట్టారు. వీరిలో బాలాజీ వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ). ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని వి.కోట మండలం పీ.కొత్తూరు ఆయన గ్రామం. చిత్తూరు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులుకు ఆయన సోదరుడు. సీఏ చదివిన బాలాజీ కొంతకాలం బెంగళూరులో ఉన్నారు. ఆ తర్వాత ఆస్ర్టేలియా వెళ్లి ఉద్యోగం చేశారు. హైదరాబాద్‌కు తిరిగివచ్చి 2009లో అప్పటి ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డి వద్ద చేరారు.
ఆయన ద్వారానే జగన్ కుటుంబానికి చేరువయ్యారు. వైసీపీ ఆవిర్భావంతో విజయసాయి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో బాలాజీ పూర్తి స్థాయిలో భారతీ సిమెంట్స్‌తో పాటు జగన్,భారతి ఆర్థిక లావాదేవీలను దగ్గరుండి చక్కబెడుతూ, వారికి అత్యంత సన్నిహితునిగా మారారు .అనతికాలంలోనే భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌గా ఎదిగారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లిక్కర్ పాలసీ మొదలు ముడుపుల వసూళ్ల వరకూ ప్రతి అడుగులోనూ బాలాజీ పాత్ర ఉంది. రాజ్ కసిరెడ్డి తెచ్చి ఇచ్చిన కోట్లాది రూపాయల మద్యం ముడుపులను ఊరు పేరు లేని షెల్ కంపెనీల్లోకి మళ్లించడంలో మాస్టర్ మైండ్ గోవిందప్పదేనని సిట్ ఆధారాలు సేకరించింది. మొత్తం బాగోతాన్ని పసిగట్టిన అధికారులు ఆయనను విచారించి అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చబోతున్నారు. రూ.కోట్లాది రూపాయలు ఎవరికి చేర్చారు.. ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడ దాచారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో సృష్టించిన షెల్ కంపెనీలు ఎవరివి.. వాటిలో ఎవరి పేరుతో పెట్టుబడులు పెట్టారు... నకిలీ జీఎస్టీ ఇన్వాయి్‌సలు, హవాలా మార్గంలో వెళ్లిన డబ్బుల వివరాలు కక్కించనున్నారు. కాగా, 2009లోనూ అప్పటి సీబీఐ, ఈడీ కేసుల్లో బాలాజీకి నోటీసులు వెళ్లాయి. సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసుల నుండి ఆయన బయటపడ్డారు.
అన్నకోసం పట్టుబట్టి జడ్పీపీఠం
జిల్లా పరిషత్ ఎన్నికల్లో బాలాజీ తన అన్నయ్య శ్రీనివాసులును పట్టుబట్టి మరీ చిత్తూరు జడ్పీ ఛైర్మన్‌గా ఎంపిక చేసుకోగలిగారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులకు ఆ పదవి కట్టబెట్టాలని ఎంత ప్రయత్నించినా, ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. స్వయానా అప్పటి సీఎం జగన్ సతీమణి భారతి సూచనతో శ్రీనివాసులు జడ్పీ చైర్మన్‌గా నియమితులవడం అప్పట్లో వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
నిన్న విజయసాయి.. నేడు గోవిందప్ప..
జగన్ దురాశకు ఇద్దరు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లు ఆయుధాలుగా మారడం గమనార్హం. నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయి రెడ్డి పెద్ద పెద్ద సంస్థలకు ఆడిటర్‌గా పనిచేస్తూ జాతీయ స్థాయిలో పెరు తెచ్చుకున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అత్యాశకు సహకరించారు. తండ్రి మేళ్లకు తనయుడికి లబ్ధి కలిగించే క్రమంలో సూట్‌కేసు కంపెనీలు ఏర్పాటు చేయించి రూ.43వేల కోట్ల కుంభకోణంలో సీబీఐకి విజయసాయి చిక్కి విలవిల్లాడారు. మొత్తం పదకొండు కేసులను నమోదు చేసిన సీబీఐ.. దాదాపు అన్నింట్లోనూ సాయిరెడ్డిని ఏ2గా చేర్చింది. హైదరాబాద్‌లో అరెస్టు చేసి అప్పట్లో చంచల్‌గూడ జైలుకు పంపించింది. ఇక రెండో సీఏ బాలాజీ గోవిందప్ప. జగన్ సీఎంగా ఉండగా జరిగిన మద్యం స్కామ్‌లో అక్రమ సొమ్ములను షెల్ కంపెనీల్లోకి మళ్లించి దాచేందుకు బాలాజీని వాడారు. ఇప్పుడు ఆయన సిట్‌కు చిక్కి జైలు ఊచలు లెక్కించనున్నారు.
కొసమెరుపు: విజయసాయిరెడ్డి దగ్గరే మొదట బాలాజీ సీఏగా పనిచేశారు. విజయిసాయి ద్వారానే జగన్, భారతీలకు దగ్గరయ్యారు. ఆ కుటుంబం కారణంగానే అప్పట్లో విజయసాయి జైలుకు వెళితే, ఇప్పుడు బాలాజీ వంతు వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..
Updated Date - May 14 , 2025 | 05:56 AM