YCP Jagan: జాతీయ స్థాయిలో జగన్ పరువు పాయె
ABN, Publish Date - Jun 22 , 2025 | 04:01 AM
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ‘రప్పా, రప్పా’ నరుకుడు భాషను సమర్థించడం జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది.
‘రప్పా రప్పా’ను తప్పుబట్టిన నేషనల్ మీడియా
నరుకుతామంటే సమర్థించడమేంటని విస్మయం
మాజీ సీఎం తీరుపై వైసీపీ శ్రేణుల్లోనూ విమర్శలు
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ‘రప్పా, రప్పా’ నరుకుడు భాషను సమర్థించడం జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. ‘మళ్లీ అధికారంలోకి వస్తే.. తెలుగుదేశం వారిని గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్లుగా రప్పా రప్పా నరికేస్తా’ అని ఓ కార్యకర్త ప్రదర్శించిన ప్లకార్డులో ఉంటే మంచిదేగా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మీడియా సంస్థలు తప్పుపట్టాయి. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి.. ప్రత్యర్థి పార్టీ నాయకుల తలలు నరుకుతామంటే ప్రోత్సహించేలా మాట్లాడటం ఏమిటంటూ విస్మయం వ్యక్తం చేశాయి. అలాగే సొంత పార్టీ శ్రేణుల్లోనూ జగన్ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ప్రత్యర్థి పార్టీలను విధానపరంగా విమర్శిస్తుంటారని.. కానీ హత్యా రాజకీయాలను ప్రోత్సహించేలా జగన్ మాట్లాడటం ఏంటని విమర్శిస్తున్నారు. సప్త సముద్రాల ఆవల దాక్కున్నా, రిటైర్డయినా తీసుకువచ్చి పోలీసుల బట్టలూడదీస్తానంటూ వ్యాఖ్యలు చేయడం, తెనాలిలో రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శించడం ప్రజల్లో ఆయన గ్రాఫ్‌ను తగ్గిస్తాయని వాపోతున్నారు. జగన్ సొంత టీవీ చానల్‌లో రాజధాని అమరావతి మహిళల గురించి యాంకరు, డిబేట్‌లో పాల్గొన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా వైసీపీకి నష్టం కలిగిస్తాయని అంటున్నారు.
జగన్ వాహనానికే సింగయ్య బలి
పోలీసుల వద్ద పక్కా వీడియో ఆధారాలు
ఒకటి రెండు రోజుల్లో నిందితుల అరెస్టు
గుంటూరు, జూన్ 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్త చీలి సింగయ్యను బలితీసుకుంది మాజీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న వాహనమేనని తేలింది. పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణకు వచ్చిన సందర్భంగా ఈనెల 18న జగన్ కాన్వాయ్‌లో కారు తగిలి సింగయ్య మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన్ను ఢీ కొట్టింది జగన్ ప్రయాణిస్తున్న కారేనని పోలీసులు గుర్తించారు. దీనికి పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. పూలు చల్లేందుకు ముందుకు వచ్చిన సింగయ్యను జగన్ కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో కింద పడిపోయిన ఆయన భుజం మీదుగా కారు టైర్ ఎక్కడంతో ఆ తర్వాత కొద్దిసేపటికే సింగయ్య ప్రాణాలు వదిలారు. రెండురోజుల క్రితం అనుమానిత కారు డ్రైవర్, యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. జగన్ ప్రయాణిస్తున్న కారు సింగయ్యను ఢీ కొట్టిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. తొలుత పోలీసులు నిర్ధారించుకోకుండా వేరే కారు నంబర్‌తో సహా ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తమ వద్ద ఉన్న వీడియో దృశ్యాలను పూర్తిస్థాయిలో విశ్లేషిస్తున్నారు. సింగయ్యను కారు ఢీకొన్న విషయం జగన్ కూడా చూసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులను ఒకటి రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉంది.
Updated Date - Jun 22 , 2025 | 04:54 AM