Panchumarthi Anuradha: జగన్ మద్దతుతోనే ఆ నేతలు పేట్రేగుతున్నారు
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:17 AM
వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని శాసనమండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు.
ప్రసన్న వ్యాఖ్యలపై పంచుమర్తి, పల్లా, వర్ల ఆగ్రహం
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని శాసనమండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రసన్నకుమార్‌రెడ్డి చేయలేకపోయిన అభివృద్ధిని ప్రశాంతిరెడ్డి చేస్తుంటే చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ మద్దతుతోనే వైసీపీ నేతలు పేట్రేగుతున్నారని, ప్రసన్న వ్యాఖ్యలపై జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, వైసీపీ నేతలు రోజురోజుకి మరింత దిగజారిపోతున్నారని, దానికి నిదర్శనం వారి దిగజారుడు వ్యాఖ్యలేనని అన్నారు. జగన్ రెడ్డి డైరెక్షన్‌లో వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, విద్వేషం సృష్టించేలా, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా పేట్రేగుతున్నారని ఆరోపించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ, ‘వైసీపీ నేతల తీరు యథారాజా తథా ప్రజా అన్నట్లు ఉంది. జగన్‌లా ఆయన అనుచరులూ వ్యవహరిస్తున్నారు. గతంలో జగన్ తన చెల్లి కట్టుకున్న చీరపై కూడా కామెంట్ చేశాడు. నిన్న ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు భారతీయ కుటుంబ వ్యవస్థపై చేసిన దాడిగా భావిస్తున్నాం. ఆయన వ్యాఖ్యలపై పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేసి, అరెస్టు చేయాలి. ఆయనలా టీడీపీలఎవరు మాట్లాడినా మా పార్టీ అధినేత ఆ చెంపా ఈ చెంపా వాయిస్తారు’ అని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం మాట్లాడుతూ... ‘అరాచకం, అవినీతి, బూతు వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ. ఆంధ్ర రాజకీయలకు చీడ పట్టినట్లు వైసీపీ పట్టింది. బూతు వ్యాఖ్యలతో రెచ్చిపోవడం వైసీపీ నేతలకు సంప్రదాయంగా మారింది’ అని మండిపడ్డారు. నల్లపురెడ్డి లెంపలు వాయించుకొని ప్రశాంతిరెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jul 09 , 2025 | 05:21 AM