ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan: నాడు పదవులిచ్చాను.. నేడు కృతజ్ఞత చూపండి

ABN, Publish Date - Feb 25 , 2025 | 05:28 AM

పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వైసీసీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు.

  • పార్టీ కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కష్టపడాలి

  • ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా

  • అప్పుడే సీఎంతో సమానంగా మాట్లాడగలను

  • శాసనసభాపక్ష భేటీలో జగన్‌ స్పష్టీకరణ

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉండగా మీ అందరికీ పదవులు ఇచ్చానని.. అందుకు కృతజ్ఞతగా ఇప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వైసీసీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరెవరు శ్రమిస్తున్నారో గమనించడం కష్టమని.. కానీ ప్రతిపక్షంలో ఉండగా పార్టీ బలోపేతానికి ఎవరెవరు కష్టపడి పనిచేస్తున్నారో సులువుగా తెలుసుకోవచ్చని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ చేసి బయటకు వచ్చాక.. తాడేపల్లి ప్యాలె్‌సలో పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభలో బలంగా ప్రజాసమస్యలను లేవనెత్తేందుకు వీలుంటుందని జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. అప్పుడే ముఖ్యమంత్రితో సమానంగా సభలో మాట్లాడే అవకాశం వస్తుందన్నారు. ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానని పునరుద్ఘాటించారు. కాగా.. ప్రతిపక్ష నేత పదవి లేకున్నా.. సభకు వెళ్తేనే కదా ప్రభుత్వం ఏం చేస్తోందో తెలిసేదని వైసీపీ నేతలు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతల పనితీరు తెలుసుకోలేమన్న ఆయన వ్యాఖ్యలతోనూ వారు విభేదిస్తున్నారు.


హోదాపై ప్రభుత్వ స్పందన చూశాక నిర్ణయం: బొత్స

జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్న డిమాండ్‌పై ప్రభుత్వ స్పందన చూసిన తర్వాత సభకు వెళ్లాలో లేదో నిర్ణయించుకుంటామని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. సోమవారం అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని అసెంబ్లీ వేదికగా గవర్నర్‌ను కోరాం. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన్ను డిమాండ్‌ చేశాం. ప్రజల తరఫున పోరాడేందుకే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం. మిర్చి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇప్పించలేకపోతోంది. జగన్‌ మిర్చి యార్డును సందర్శించేవరకు చలనం లేదు. రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? రైతు సమస్యలకు ఎన్నికల కోడ్‌ అడ్డొస్తుందా? వారి కోసం జగన్‌ మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారా? మ్యూజికల్‌ నైట్‌కు కోడ్‌ వర్తించదా’ అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని.. లేకపోతే లేదంటే.. ఎమ్మెల్యే పదవులెందుకని విలేకరులు అడుగగా.. మీ సలహాలు తీసుకోవలసిన అవసరం లేదని బొత్స బదులిచ్చారు. ప్రతిపక్ష హోదా కోసం పోరాడతామని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా గొంతు నొక్కుతోందని విమర్శించారు.

Updated Date - Feb 25 , 2025 | 05:28 AM