YSRCP Jagan: నేడు వైసీపీ యువత పోరు
ABN, Publish Date - Jun 23 , 2025 | 05:02 AM
మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనకు వెళ్తుండగా.. ఆయన కారు వైసీపీ కార్యకర్త సింగయ్యను తొక్కేసిన ఘటన కలకలం రేపుతోంది.
సింగయ్య మరణాన్ని కప్పిపుచ్చేందుకే!
ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ ఎత్తు
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనకు వెళ్తుండగా.. ఆయన కారు వైసీపీ కార్యకర్త సింగయ్యను తొక్కేసిన ఘటన కలకలం రేపుతోంది. అక్కడ రప్పా రప్పా నరుకుతామని ప్లకార్డులు పెట్టిన కార్యకర్తను జగన్ వెనకేసుకురావడంపైనా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం నుంచి జనం దృష్టి మళ్లించడానికి ఆయన ఆకస్మికంగా సోమవారం ‘యువత పోరు’కు పిలుపిచ్చారు. నిరుద్యోగ భృతి హామీని సీఎం చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టాలని వైసీపీ శ్రేణులను ఆదేశించారు.
నాడు డీఎస్సీ తుస్సు
అధికారంలోకి వస్తే ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని 2019 ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించారు. మెగా డీఎస్సీ వేస్తాననీ హామీ ఇచ్చారు. కానీ ఆ ఐదేళ్లలో ఏమీ చేయలేదు. ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని 2023లో డీఎస్సీ ప్రకటించారు. కానీ ముందుకెళ్లలేదు. జగన్ చేసిన మోసానికి ఆ ఏడాది పట్టభద్రుల నియోజకవర్గ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి 3 నియోజకవర్గాల్లోనూ వైసీపీ పరాజయం పాలైం ది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు ఓడించారు. చంద్రబాబు సీఎం అయ్యాక 16వేలకుపైగా పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో యువత పోరుకు జగన్ పిలుపివ్వడం వైసీపీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, స్కాంలపై కేసులు, అరెస్టులు, జైలు కష్టాలతో కొందరు వైసీపీ ముఖ్య నేతలు, మాజీ/ప్రస్తుత అధికారులు విలవిలలాడుతున్నారు. గంజాయి, బెట్టింగ్ ముఠాలకు దన్నుగా ఆయన చేస్తున్న పరామర్శలు, పర్యటనల్లో వైసీపీ మూక చేస్తున్న అరాచకాలతో జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అన్నిటికీ మించి మద్యం స్కాం దర్యాప్తు క్రమంగా తాడేపల్లి ప్యాలెస్ దిశగా కదులుతుండడంతో జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
సహనం, నిస్పృహతో చివరకు క్రిమినల్స్‌ను సైతం సమర్థించే స్థితికి చేరుకున్నా రు. ఆయన వైఖరిని జాతీయ మీడియా సంస్థలు కూడా తప్పుబట్టడంతో షాకయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చే పరిస్థితి లేదని.. మహిళల్లో సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆశించిన జగన్‌కు నిరాశే ఎదురైంది. ఇంట్లో ఎందరు పిల్లలున్నా రూ.13 వేల చొప్పున ప్రభుత్వం జమచేయడం తట్టుకోలేకపోతున్నారు. గతంలో జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్ వంటివారు మీడియా ముందుకొచ్చి చంద్రబాబుపై దుమ్మెత్తిపోసేవారు. ఇప్పుడు అడపాదడపా పేర్ని మైకు ముందుకొస్తున్నా.. నకిలీ పట్టాల వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో.. ఆయన కూడా పెద్దగా చప్పుడు చేయడం లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అటు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కాకపోవడం.. పార్టీ భవిష్యత్ క్రమంగా ప్రశ్నార్థకమవుతుండడంతో నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి బుధవారం వైసీపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులతో జగన్ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు.
Updated Date - Jun 23 , 2025 | 05:02 AM