ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mineral Resources: క్రిటికల్‌ మినరల్స్‌లో స్వావలంబన

ABN, Publish Date - Jun 30 , 2025 | 03:22 AM

సంక్లిష్ట ఖనిజాల(క్రిటికల్‌ మినరల్‌) మైనింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణ అవసరాలకు ఈ ఖనిజాలను వినియోగించేందుకు వీలుగా నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌కు శ్రీకారం చుట్టింది.

  • రక్షణ అవసరాలే లక్ష్యంగా మైనింగ్‌

  • 2024-31 వరకు నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌

  • ఐదేళ్లలో 16 వేల కోట్ల వ్యయం

  • రూ.18 వేల కోట్ల పెట్టుబడులు

  • దేశీయ, అంతర్జాతీయంగా కొత్త మైనింగ్‌ ప్రాజెక్టులు

  • ప్రభుత్వ, ప్రైవేటుకు అవకాశాలు

  • అన్ని రాష్ట్రాలకూ ప్రోత్సాహకాలు

  • నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం

దేశీయ రక్షణ రంగానికి సంక్లిష్ట ఖనిజాల(క్రిటికల్‌ మినరల్‌) మైనింగ్‌ కీలకం. ఈ విషయంలో అంతర్జాతీయ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. రక్షణ రంగ అవసరాలకు విదేశాలపై ఆధారపడే బదులు, స్వయంగా మైనింగ్‌ రంగంలో అభివృద్ధి చెందాలని కేంద్రం నిర్ణయించింది. కేవలం ఐదేళ్ల వ్యవధిలో దేశీయ అవసరాల్లో కనీసం 10 శాతం లక్ష్యాలను చేరుకునేలా మైనింగ్‌ రంగంలో కార్యచరణ ప్రకటించింది. అదే నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌. దీనిలో రాష్ట్రాలకూ కీలక పాత్ర పోషించే అవకాశం కల్పించింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సంక్లిష్ట ఖనిజాల(క్రిటికల్‌ మినరల్‌) మైనింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణ అవసరాలకు ఈ ఖనిజాలను వినియోగించేందుకు వీలుగా నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఈ మిషన్‌ అమలు కానుంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న యుద్ధ భయాలు, సరిహద్దు వివాదాలు, పెరుగుతున్న సాంకేతిక దాడులను తిప్పికొట్టేందుకు డిఫెన్స్‌ రంగంలో నూతన ఆవిష్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్వయం సమృద్ధి సాధించడం, అంతర్జాతీయంగా పెద్ద ఎగుమతిదారుగా నిలవాలన్న సంకల్పంతో కేంద్రం ఈ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. దీనివల్ల దేశీయ రక్షణ రంగం అవసరాలను స్థానికంగా సమకూర్చుకోవడం అనే లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్థ, మైనింగ్‌ రంగంలో సాంకేతిక ముందడుగు, కోట్లాది మందికి ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో దీనిని చేపట్టింది. ఈ మిషన్‌లో 1200లకు పైగా మైనింగ్‌ ప్రాజెక్టులు తీసుకురావాలన్నది కేంద్రం సంకల్పం. దేశీయంగా మరో 100 బ్లాక్‌లలో సంక్లిష్ట మినరల్‌ మైనింగ్‌ ప్రారంభించాలని భావిస్తోంది.

ఈ ఐదేళ్ల లక్ష్య సాధనకు రూ.16 వేల కోట్లను వ్యయం చేయనుంది. కేంద్రం ప్రకటించిన మిషన్‌ వల్ల దేశీయ, అంతర్జాతీయంగా రూ.18 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనావేస్తోంది. అత్యధిక ప్రాధాన్యంతో దీనిని అమలు చేయాలనుకుంటున్న కేంద్రం.. సంక్లిష్ట మినరల్‌ మైనింగ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ఆసక్తి ఉన్న 24కు పైగా ప్రైవేటు సంస్థలను రంగంలోకి దింపాలని భావిస్తోంది. దీంతో అటామిక్‌ మినరల్స్‌ పరిధిలో ఉన్న ఆరు ఖనిజాల మైనింగ్‌లో పాల్గొనేందుకు ప్రైవేటుకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో కలిపి వచ్చే ఐదేళ్లలో సంక్లిష్ట మినరల్స్‌ మైనింగ్‌లో దూసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.

క్రిటికల్‌ మినరల్స్‌ అంటే?

ఖనిజాల్లో సాధారణమైనవాటితో పాటు అసాధారణమైనవి, సంక్లిష్టమైనవి కూడా ఉంటాయి. అంటే, మైనింగ్‌ చేసే సమయంలో వచ్చే సమస్యలు, ఆ తర్వాత వాటిని తరలించే సందర్భంలో వచ్చే సవాళ్లను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఖనిజాలను క్రిటికల్‌ మినరల్స్‌(సంక్లిష్టమైనవి)గా పరిగణించి గుర్తించారు. అందులో 30 మినరల్స్‌ ఉన్నాయి. వీటిలో 14 ఖనిజాలను అటామిక్‌ మినరల్స్‌గా కేంద్రం ఎంఎండీఆర్‌ చట్టం-1957 ద్వారా నోటిఫై చేసింది. న్యూక్లియర్‌కి సంబంధించిన మినరల్స్‌ కూడా వీటిలో ఉండటంతో ఇప్పటి దాకా ప్రభుత్వ రంగ సంస్థలే ఆ ఖనిజాల మైనింగ్‌ చేయాలన్న నిబంధన ఉంది. అదానీ లాంటి కంపెనీలకు జగన్‌ ప్రభుత్వం బీచ్‌శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌ ఇద్దామని గతంలో ప్రయత్నించినా కేంద్రం నిబంధనల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. సంక్లిష్టమైన మినరల్స్‌లో 18 దేశీయ రక్షణ రంగ అవసరాలను తీర్చేవి ఉన్నాయి. వీటిని వ్యూహాత్మక ఖనిజాలుగా పరిగణిస్తున్నారు. వాటి వివరాలను ఇప్పటిదాకా కేంద్రం వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే మైనింగ్‌ చేసి రక్షణ రంగ అవసరాలను భర్తీ చేస్తున్నాయి. అయితే, ఇటీవలికాలంలో రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియాలో ఇజ్రాయిల్‌- పాలస్తీనా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ధం సందర్భంగా తెరపైకి వచ్చిన అధునాతన శత్రు విధ్వంసక బాంబులు, క్షిపణలు వంటివి ప్రభుత్వ తక్షణ అవసరాలను గుర్తు చేస్తున్నాయి. రక్షణ రంగంలో ఉన్న ఉత్పాదక కొరతలు, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్వయం సమృద్ధి సాధించలని కేంద్రం భావిస్తోంది. దీనికి అత్యంత కీలకమైన వనరు సంక్లిష్ట మినరల్స్‌. ఇప్పటిదాకా వీటిని యూరప్‌, అమెరికా, రష్యా, ఆఫ్రికా తదితర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. లిథియం, బెరీలియం, టైటానియం, నోబియం, జిక్రోనియం, కాండిమమ్‌, గ్లకోనైట్‌, గ్రాఫైట్‌, నికిల్‌, యూరేనియంతో సంబంధం లేని పాస్ఫేట్‌, ఇంకా, అరుదైన ఖనిజాలు వీటిలో ఉన్నాయి. కొన్నింటిని బీచ్‌శాండ్‌ మైనింగ్‌ ద్వారా ప్రాసెస్‌ చేసి సేకరించవచ్చు. మరి కొన్నింటిని మైనింగ్‌ ద్వారానే తీసుకోవాలి. అయితే, దేశీయంగా బీచ్‌శాండ్‌ మైనింగ్‌ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు భవిష్యత్‌ అవసరాలు, సరికొత్త సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన సాంకేతికత, పారిశ్రామిక ఉత్పాదకాలను పొందేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది.

ఐదేళ్ల లక్ష్యంతో మైనింగ్‌ మిషన్‌

ఐదేళ్ల కాల వ్యవధి(2024-25 నుంచి 2030-31) సంక్లిష్ట ఖనిజాల మైనింగ్‌లో దేశీయ అవసరాల్లో కనీసం 10 శాతం డిమాండ్‌ను అందుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రక్షణ రంగ అవసరాలను కనీసం 50 శాతం తీర్చగలిగేలా నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మైనింగ్‌ మిషన్‌(ఎన్‌సీఎంఎం)ను ఖరారు చేసింది. ఇటీవల ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ మిషన్‌ కు ఆమోదం తెలిపారు. ఆ వెంటనే కేంద్ర గనుల శాఖ... మిషన్‌ అమలుపై నోటిఫికేషన్‌ జారీ చేసింది.

రాష్ట్రాల పాత్ర ఇదీ..

కేంద్రం ప్రకటించిన క్రిటికల్‌ మినరల్‌ జాబితాలో 24 ఖనిజాలు ఉన్నాయి. వీటి మైనింగ్‌కు సంబంధించి కేంద్రం అనుమతులు ఇచ్చిన తర్వాత, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వాలు మైనింగ్‌కు అవసరమైన అన్ని రకాల అవకాశాలు కల్పిస్తాయి. వీటిని ప్రాధాన్య ప్రాజెక్టులుగా పరిగణించి రాష్ట్రస్థాయిలో కీలక అనుమతులు ఇస్తాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా మైనింగ్‌ ప్రాజెక్టులు చేపట్టాల్సి వస్తే వాటిని తమ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల(ఏపీఎండీసీ లాంటివి)తో ప్రోత్సహించాలి. అవి అంతర్జాతీయ మైనింగ్‌ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందించాలి.

అంతర్జాతీయ మైనింగ్‌లో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు దేశీయ మైనింగ్‌లో వెనుకబడ్డాయి. అవి ప్రాజెక్టులు దక్కించుకున్నా తిరిగి ఔట్‌ సోర్సింగ్‌ కింద ప్రైవేటుకే అప్పగిస్తున్నాయి. అయితే, కేంద్రం ప్రతిపాదించిన మిషన్‌ ద్వారా వీలైనంత మేరకు దేశీయంగా మైనింగ్‌ ప్రాజెక్టులు చేస్తూనే, అంతర్జాతీయ ప్రాజెక్టులు దక్కించుకోవాలని దిశానిర్దేశం చేసింది. అంటే, ఏపీఎండీసీ, ఎన్‌ఎండీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు క్రిటికల్‌ మినరల్స్‌ లభ్యత బాగా ఉన్న దేశాల్లో మైనింగ్‌ ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌లు దక్కించుకోవాలి. కనీసం ఈ ఐదేళ్లలో 50 నుంచి 100 కాంట్రాక్ట్‌లు పొందాలి. దీనికి అవసరమైన రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్రం రూ.1,600 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. మరో రూ.1,500 కోట్ల రాయితీలను సిద్ధం చేస్తోంది. ప్రైవేటు సంస్థలు కూడా అంతర్జాతీయంగా క్రిటికల్‌ మినరల్‌ మైనింగ్‌ ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఇలా ప్రాజెక్టులు తీసుకొచ్చే ప్రైవేటు సంస్థలకు ప్రత్యేక రాయితీలు, ఆర్ధిక ప్రోత్సాహకాలు అందించనుంది. వీటి కోసం కేంద్రం ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించింది. ఇటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ రంగసంస్థలు(28), ఇటు ప్రైవేటు రంగ సంస్థలు(24) వీలైనంత మేరకు సంక్లిష్ట మినరల్‌ మైనింగ్‌ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌లు తీసుకోవాలని, వాటి ద్వారా వచ్చే ఖనిజాలను దేశీయ అవసరాలకు ఉపయోగించుకునేలా మిషన్‌ను రూపకల్పన చేసింది. వెసులుబాటును బట్టి విదేశీ ఎగుమతులకు వీలు కల్పిస్తారు. అంతర్జాతీయ మైనింగ్‌ ప్రాజెక్టుల ద్వారా దేశానికి వచ్చే ఖనిజాలపై దిగుమతి సుంకాలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. దీంతోపాటు ఇతరత్రా ఎలాంటి సుంకాలు కూడా ఉండ వని పేర్కొంది. ఈ క్రమంలో కేంద్రం రూ.4 వేల కోట్ల సబ్సీడీ ప్యాకేజీలను సిద్ధం చేసింది.

పరిశోధనకు పెద్దపీట!

దేశీయంగా, అంతర్జాతీయంగా మైనింగ్‌ ద్వారా వచ్చే ఖనిజాలతో ప్రత్యేక హబ్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో పరిశోధన, అధ్యయనం, వినియోగం తదితర కార్యాచరణల కోసం జాతీయంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేయనున్నారు. అంతిమంగా మైనింగ్‌ రంగంలో చేసే పరిశోధనల ఫలితాలతో కనీసం 100 పేటెంట్లు పొందాల్సి ఉంటుందని ఈ మిషన్‌ దిశానిర్దేశం చేసింది. మిషన్‌ అమలులో భాగంగా దేశీయంగా 4 ప్రాంతీయ పార్క్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. మిషన్‌ అమలు కోసం ప్రాజెక్టులకు రాష్ట్రాల్లో, అంతర్జాతీయంగా ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు తలెత్తకుండా చూసుకునేందుకు కేంద్రం కీలక అధికారాలతో కూడిన సాధికారిక కమిటీని ప్రకటించింది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో నీతి అయోగ్‌, కేంద్ర గనుల శాఖ సహా 17 శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. కేంద్రం సూచించే ఓ సంయుక్త కార్యదర్శుల నేతృత్వంలో మిషన్‌ సెక్రటేరియట్‌ ఏర్పాటు కానుంది.

మిషన్‌లోని కీలకాంశాలు

  • 2024-25 సంవత్సరం నుంచి 2030-31 వరకు క్రిటికల్‌ మినరల్‌ మైనింగ్‌లో రూ.16 వేల కోట్ల వ్యయం చేస్తారు.

  • మైనింగ్‌ సెక్టార్‌లో రూ.18 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా. ఈ మిషన్‌ కార్యకలాపాల కోసం నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌(ఎన్‌ఎమ్‌ఈటీ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. దీనిద్వారా మిషన్‌ కార్యకాలపాలు జరగనున్నాయి.

  • దేశీయంగా క్రిటికల్‌ మినరల్‌ మైనింగ్‌ కోసం ఎన్‌ఎమ్‌ఈటీ రూ.3 వేల కోట్లు ఖర్చు చేయనుంది. జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా రూ.4 వేల కోట్లు వ్యయం చేయనుంది.

  • దేశంలో కొత్తగా 1200 మైనింగ్‌ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. వీటితోపాటు మరో 100 కొత్త మైనింగ్‌ బ్లాక్‌లు ప్రారంభించనున్నారు.

  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఊ)కు అవకాశం కల్పిస్తారు.

  • అటామిక్‌ మినరల్స్‌లో ఉన్న 6 ఖనిజాల(లిధియం, బెరీలియం, టైటానియం, నోబియం, టాటాలమ్‌, జిక్కో)ను ఆ జాబితా నుంచి తొలగించారు. వీటి మైనింగ్‌కు ప్రైవేటు కంపెనీలకు అవకాశం కల్పిస్తారు.

Updated Date - Jun 30 , 2025 | 03:26 AM