AP High Court: సజ్జలపై 18 వరకు తొందరపాటు చర్యలొద్దు
ABN, Publish Date - Jun 13 , 2025 | 04:35 AM
సంకర జాతి అంటూ రాజధాని ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈ నెల 18 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
పోలీసులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): సంకర జాతి అంటూ రాజధాని ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈ నెల 18 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి వినతి సమర్పించారని.. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి తనను అరెస్టు చేసే ప్రమాదం ఉందని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సజ్జల దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను గురువారం కోర్టు లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై ఎలాంటి కేసూ నమోదు కాలేదన్నారు. కేవలం ఆందోళనతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని తెలిపారు. సజ్జల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్.. పిటిషనర్‌పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలన్నారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.
సజ్జలపై తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో గురువారం దళిత యువజన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. అమరావతి మహిళలను సంకరజాతి వారని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన తాడేపల్లి ఎస్‌ఐ జె శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - Jun 13 , 2025 | 04:37 AM