Social Media Crackdown: అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిందే
ABN, Publish Date - May 09 , 2025 | 06:10 AM
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను కట్టడి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. పౌరుల హుందా జీవన హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది
పౌరులు హుందాగా జీవించే హక్కును కాపాడాలి: హైకోర్టు
సజ్జల భార్గవ్‌రెడ్డి, ఇతరులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు ఆదేశం
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు తేల్చిచెప్పింది. ‘అసభ్యకర, విద్వేషపూరిత వ్యాఖ్యల వల్ల అంతిమంగా సోషల్ మీడియా మాధ్యమాలే లబ్ధిపొందుతున్నాయి. అసభ్యకర, అనుచిత పదాలను గుర్తించి, పోస్టుల్లో వాటిని ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేయాలి. ఆయా పదాలు ఉపయోగించినప్పుడు ఖాతాను ఆటో బ్లాక్ చేసేలా సోషల్ మీడియా సంస్థలకు సూచనలు చేయాలి’ అని పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ప్రతీ పౌరుడికి హుందాగా జీవించే హక్కు ఉందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టంచేసింది. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వారి కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టేలా వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను ప్రోత్సహించారనే ఆరోపణలతో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆ పార్టీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి, సింగిరెడ్డి అర్జున్‌రెడ్డి, టి.సుమన్, రాహుల్‌రెడ్డి మరికొందరు వైసీపీ సానుభూతిపరులు పిటిషన్లు వేశారు.
ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్ ఎన్.విజయ్ తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా ఆ తీర్పును వెల్లడించారు. ‘బీఎన్‌ఎస్ సెక్షన్ 111 (వ్యవస్థీకృత నేరం) మినహా, పిటిషనర్లపై నమోదు చేసిన ఇతర సెక్షన్లు ఏడేళ్ల వరకు శిక్షకు వీలున్నవే. బీఎన్‌ఎస్ సెక్షన్ 111 వర్తింపజేయాలంటే పిటిషనర్లపై కనీసం రెండు చార్జిషీట్లు దాఖలై ఉండాలి. వారిపై నమోదైన కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెక్షన్ 111 కింద కేసు నమోదు చేయడం సరికాదని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నాం. పిటిషనర్లకు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో ముడిపడిన కేసుల్లో భార్గవ్‌రెడ్డి, ఇతర నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు. పిటిషనర్లపై రెండు వారాల పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు.
Updated Date - May 09 , 2025 | 06:10 AM