Minister Satya Kumar : వైద్య సేవలు మరింత మెరుగ్గా..
ABN, Publish Date - Feb 20 , 2025 | 05:38 AM
వైద్య సేవలు, మందులు పంపిణీ వంటి అంశాలపై సమీక్షల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఆస్పత్రుల్లో తనిఖీ చేపట్టారు.
ఆస్పత్రుల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి
చిన్నచిన్న మరమ్మతులు వెంటనే చేయించాలి
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
విజయవాడ జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు
రోగులకు అందించే ఆహారం రుచిచూసిన మంత్రి
అమరావతి, విజయవాడ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రుల పనితీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందులు పంపిణీ వంటి అంశాలపై సమీక్షల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఆస్పత్రుల్లో తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. దాదాపు మూడున్నర గంటల పాటు జీజీహెచ్ మొత్తం తిరిగి పలు విభాగాలు, వార్డులను పరిశీలించారు. పరిశుభ్రత, డాక్టర్ల హాజరు, రోగులకు అందిస్తున్న మందులు, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులను ఆదేశించారు.
రోగులతో మాట్లాడి.. భోజనం రుచిచూసి..
విజయవాడ జీజీహెచ్‌కు ప్రతిరోజూ 2,500 మంది పైగా రోగులు వస్తున్నారని తెలుసుకున్న మంత్రి.. ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద పలువురితో మాట్లాడారు. 15 నిమిషాల్లో ఓపీ రిజిస్ట్రేషన్ జరుగుతోందని, డాక్టర్లను కూడా తక్కువ సమయంలోనే కలుస్తున్నామని రోగులు వివరించారు. అనంతరం ఫార్మసీకి వెళ్లి మందుల కౌంటర్లను మంత్రి పరిశీలించారు. కౌంటర్ల సంఖ్య, మందుల లభ్యతపై ఫార్మసిస్టులతో పాటు రోగుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మరో రెండు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులకు అందించే ఆహారం నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో భోజనాన్ని మంత్రి స్వయంగా రుచి చూశారు. ప్రతి రోగికి రోజుకు 2,417 కేలరీలు అందేలా ఆహారం ఇస్తున్నట్లు డైటీషియన్ మంత్రికి వివరించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జీబీఎస్ రోగిని మంత్రి పరామర్శించారు. సీనియర్ డాక్టర్లు ఓపీ సేవలు అందించడం లేదన్న వార్తల నేపథ్యంలో ఓపీ కేంద్రాలను సందర్శించారు.
అక్కడ ముగ్గురు ప్రొఫెసర్లు, విభాగాధిపతులు విధుల్లో ఉన్నారని నిర్ధారించుకున్నారు. కాగా, కొంత మంది రోగులను వారి బంధువులే స్ట్రెచర్లు, వీర్‌చైర్స్‌లో తీసుకెళ్లడాన్ని గమనించిన మంత్రి.. అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తగినంత మంది సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. స్ట్రెచర్లు, వీల్ చైర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. విరిగిపోయిన మరుగుదొడ్లు, స్నానాల గదుల తలుపులకు వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. పార్కింగ్, ఇతర లోపాలను సరిదిద్దాలన్నారు. కాగా, మంత్రి వస్తున్నారన్న విషయాన్ని ముందే తెలుసుకున్న జీజీహెచ్ అధికారులు శానిటేషన్ విషయంలో జాగ్రత్త పడ్డారు. కొంత మంది వైద్యులు హడావిడిగా వార్డుల్లో ప్రత్యక్షమయ్యారు.
జీబీఎస్ అంటు వ్యాధి కాదు: సత్యకుమార్
గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) అంటు వ్యాధి కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో.. రోగులకు ఏయే విభాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో సులువుగా తెలిసేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది కొరత లేకుండా చూస్తామరి హామీ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం జి.కొండూరు మండలం కందులపాడు శివారు చేగిరెడ్డిపాడు గ్రామానికి చెందిన మహిళ మృతికి కారణాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Updated Date - Feb 20 , 2025 | 05:38 AM