CM Chandrababu: బంగారు కుటుంబాలకు సంక్షేమంలో కోత ఉండదు
ABN, Publish Date - Jul 05 , 2025 | 03:15 AM
బంగారు కుటుంబాలకు ఎంపికైన వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ఎలాంటి కోతా ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు...
వారికి పథకాలు యథాతథం: చంద్రబాబు
పేద, ధనిక అంతరాలు తగ్గించేందుకే పీ-4.. పథకం సమర్థ అమలుకు 2 కమిటీలు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 6-10 వేల బంగారు కుటుంబాలు
స్థానికంగా పరిశ్రమలుంటే వాటికి కుటుంబాల దత్తత బాధ్యత
ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు
లక్ష మంది మార్గదర్శులను గుర్తించాలి
ఫౌండేషన్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టీకరణ
పీ-4 లోగో ఆవిష్కరణ.. ఈ విధానం అమల్లో బాపట్ల నంబర్ వన్
కొందరు మార్గదర్శులు ఒక్కసారి ఆర్థిక సాయం చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఇలాంటివారి సాయాన్ని పీ-4 వేదికగా పేదలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమే. అయితే దత్తత తీసుకున్న పేద కుటుంబాలకు నిరంతరం దిశానిర్దేశం చేసే మార్గదర్శులను గుర్తించాలి.
- చంద్రబాబు
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): బంగారు కుటుంబాలకు ఎంపికైన వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ఎలాంటి కోతా ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపట్టిన పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షి్‌ప(పీ-4) విధానంలో భాగంగా.. ప్రతి నియోజకవర్గంలోనూ 6-10 వేల పేద కుటుంబాలు.. బంగారు కుటుంబాలకు ఎంపికయ్యే అవకాశాలున్నాయన్నారు. స్థానికంగా ఏయే అసెంబ్లీ స్థానాల్లో పరిశ్రమలు ఉంటే.. వాటి యాజమాన్యాలు అక్కడి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విధానం అమలు చేస్తామని తెలిపారు. పరిశ్రమలు లేని నియోజకవర్గాలు, ధనవంతులు పెద్దగా ఉండని ఏజెన్సీ ఏరియాల్లోని బంగారు కుటుంబాలకు మార్గదర్శకులను అన్వేషించే అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్ తొలి సర్వసభ్య సమావేశం శుక్రవారం సీఎం అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు ఇందులో పాల్గొన్నారు.
పీ-4 పథకం సమర్థ అమలుకు 2 కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పీ-4 చాప్టర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీల్లో స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్ వైస్‌చైర్మన్, ఇన్‌చార్జి మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. పీ-4 స్ఫూర్తిని చాటేలా రూపొందించిన 6 రకాల లోగోలను అధికారులు సీఎం ముందుంచారు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక లోగోను ఆయన ఈ సమావేశంలో ఖరారు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పేదల బతుకుల్లో వెలుగును నింపే పీ-4 స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం పిలుపిచ్చారు. పేదలు, ధనికుల మధ్య అంతరాలు తగ్గించేందుకే ఈ విధానం అమలుచేస్తున్నామన్నారు. గతంలో జన్మభూమి అని పిలుపిస్తే మంచి స్పందన వచ్చిందని.. ఇప్పుడు పీ-4కూ మంచి స్పందన వస్తోందని చెప్పారు. ‘ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను, లక్ష మంది మార్గదర్శులను గుర్తించే లక్ష్యంతో పనిచేయాలి. బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చే మార్గదర్శుల పాత్రపై మరింత స్పష్టతకు రావాలి. బంగారు కుటుంబాలు అన్ని అంశాల్లో సాధికారత సాధించేలా వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా మార్గదర్శులు దిశానిర్దేశం చేస్తూ ఉండాలి. వివిధ నియోజకవర్గాల పరిధిలో ఉండే ఎన్‌ఆర్‌ఐలు, వివిధ పరిశ్రమలు, ధనవంతులు ఎవరున్నారో గమనించండి. వివిధ రూపాల్లో పేదలకు సేవలు అందించేవారిని గుర్తించండి. వారిని పీ-4 వేదికపైకి తీసుకురావాలి’ అని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు.
2029కి పేదరిక నిర్మూలన..
కేవలం సంక్షేమం అందిస్తే పేదరికం పోదని, 75 ఏళ్లుగా సంక్షేమంపై ఎంతో ఖర్చు చేస్తున్నా పేదరిక నిర్మూలన మాత్రం జరుగడం లేదని సీఎం అన్నారు. ‘పేదరికం లేని సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా పనిచేయాలి. పీ-4 విధానం ద్వారా రాష్ట్రంలో 2029 నాటికి పేదరికాన్ని రూపుమాపాలి. సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన టాప్-10 శాతం మందిని.. అట్టడుగున పేదరికంలో ఉన్న 20 శాతం మందితో అనుసంధానం చేసే కార్యక్రమమిది. సమాజంలోని వనరులను ఉపయోగించి పైకి ఎదిగిన వారు ఇప్పుడు సమాజానికి ఎంతోకొంత తిరిగిచ్చేందుకు సిద్ధపడుతున్నారు. బిల్‌గేట్స్ ఫౌండేషన్, వేదాంత, జీఎమ్మార్ వంటి సంస్థలే దీనికి ఉదాహరణ. పీ-4 ద్వారా లబ్ధి పొందిన వారి కుటుంబాల గాధలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మార్గదర్శులకు సముచిత రీతిలో గౌరవమివ్వాలి’ అని కోరారు.
పీ-4 అమల్లో బాపట్ల టాప్..
పీ-4 అమల్లో బాపట్ల జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని సీఎం తెలిపారు. దీనికి కృషిచేసిన ఆ జిల్లా ప్రజాప్రతినిధులను, కలెక్టర్‌ను అభినందించారు. ఈ విధానం ద్వారా ముఖ్యమంత్రి అద్భుత కార్యక్రమాన్ని చేపడుతున్నారని, దీనికి తమ వంతు సహకారం అందిస్తామని పలువురు ఎమ్మెల్యేలు చెప్పారు. దీని అమలుపై తమకున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.
Updated Date - Jul 05 , 2025 | 03:19 AM