Freehold Lands: నెలలకొద్దీ నాన్చుడు
ABN, Publish Date - May 14 , 2025 | 04:08 AM
ఫ్రీ హోల్డ్ భూములపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో చిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసిన భూములపై సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తోంది.
‘ఫ్రీహోల్డ్’పై ఎటూ తేల్చని సర్కారు
జగన్ సర్కారు రాజకీయ లబ్ధి కోసం, అస్మదీయులకు మేలు చేసేందుకు, ‘సెటిల్‌మెంట్ల’ కోసం... నిషేధిత జాబితాలోని భూములను యథేచ్ఛగా ‘ఫ్రీ హోల్డ్’ చేసేసింది!
వైసీపీ సర్కారు పోయింది! కూటమి సర్కారు వచ్చింది! జగన్ సర్కారు చేసిన తప్పు సరిదిద్దే పేరిట... చిన్నాచితక రైతులనూ ఇబ్బంది పెడుతోంది! ‘ఫ్రీ హోల్డ్’పై ఎటూ తేల్చకుండా కాలం గడిపేస్తోంది!
ఇలా చేయాలి
నిజంగా భూ అక్రమార్కులకు మేలు చేయకూడదని ప్రభుత్వం భావిస్తే.. ఫ్రీహోల్డ్ భూముల బల్క్ రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలి.బినామీ భూముల రిజిస్ట్రేషన్‌లు ఆపాలి. భూ అక్రమార్కులపై కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు లోబడి ఫ్రీహోల్డ్ అయిన అర ఎకరం, ఎకరం, రెండెకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇవ్వాలి.
నాడు అడ్డగోలుగా జగన్ నిర్ణయం
ఏకంగా 13 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్
అందులో 5.75 లక్షల ఎకరాలు అక్రమమే
చర్యలు తీసుకోవాల్సింది వీటిపైనే..
కానీ.. మొత్తంగా రిజిస్ట్రేషన్లు ఆపిన ప్రభుత్వం
ఎకరం, రెండెకరాల రైతులకు తీరని కష్టం
పరిష్కారంపై స్పష్టత ఉన్నా వాయిదాల పర్వం
మరో 2 నెలలపాటు నిషేధం పొడిగింపు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
భారీగా, అక్రమంగా నిషేధిత భూములను ఫ్రీహోల్డ్ చేయించుకున్న వారూ... అర ఎకరం, ఎకరం భూములున్న బక్క రైతులూ ఒకటేనా? ఇది రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న! ఫ్రీహోల్డ్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకుండా... పదినెలలుగా నాన్చుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. చట్టవిరుద్ధంగా చేతులు మారిన భూముల విస్తీర్ణం ఎంతో తెలుసు! వాటి వెనుక ఉన్నదెవరో తెలుసు! ఇలాంటి భూములపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే ఒక నివేదిక ఉంది! అయినా సరే... ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తాజాగా.. ఫ్రీహోల్డ్ భూములపై నిర్ణయాన్ని మరో రెండు నెలలు వాయిదా వేసింది. దీంతో... చిన్న రైతులూ ఇబ్బంది పడుతున్నారు. అటు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయమూ పోతోంది.
జగన్ హయాంలో ఇలా...
తన రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడానికి, కాళ్లబేరానికి వచ్చిన వారితో సెటిల్‌మెంట్ చేసేందుకు వీలుగా నిషిద్ధ భూములపై వైసీపీ సర్కా రు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. అనేక ప్రాంతాల్లో వివాదాస్పద, సంశయాత్మక భూములను నిషేధ జాబితా నుంచి బయటకు తీసి ఫ్రీ హోల్డ్ చేశారు. అయితే... ఇలా నిషేధ జాబితా నుంచి బయటికి వచ్చిన భూములన్నీ అక్రమం కాదు. కొన్ని.. సక్రమమూ ఉన్నాయి. అందులో నే... రెండెకరాల లోపు చిన్న, సన్నకారు రైతులకు చెందినవీ ఉన్నాయి. ఇలాంటి వారంతా తమ భూములను విక్రయించుకునేందుకు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు, రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ.. కూటమి సర్కారు మొత్తంగా ‘ఫ్రీహోల్డ్’ భూములపై రిజిస్ట్రేషన్లు, లావాదేవీలను నిలిపివేసింది. ఎన్నికల ముందు జగన్ సర్కారు హడావుడిగా ఫ్రీ హోల్డ్ చేసిన భూములను తిరిగి నిషిద్ధ జాబితాలో చేర్చాలా? అలా వదిలేయాలా? లేక, కేటగిరీలుగా విభజించి చేయాలా? ఇలాంటి అంశాలను పరిశీలించాల్సి ఉంది. కానీ... నెలలు గడుస్తున్నా తుది నిర్ణయం తీసుకోవడంలేదు.
నాడు 13 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్
జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టం- 1977ను సవరించిన సంగతి తెలిసిందే. అసైన్ చేసి 20 ఏళ్లు దాటిన భూములను నిషేధ జాబి తా 22(ఏ) నుంచి తొలగించి ఆ భూములపై రైతులకు శాశ్వత హక్కులు(ఫ్రీ హోల్డ్) కల్పిస్తామని 2023 డిసెంబరులో జీఓ 596 జారీ చేసిం ది. ఆ తర్వాత ఏకంగా 13 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. వీటిలో 5.75 లక్షల ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసినట్లు కూటమి ప్రభుత్వం చేయించిన విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్‌లో ఎవరెవరు లబ్ధిపొందారో నిగ్గుతేల్చాల్సి ఉంది. ఇది ప్రభుత్వం చేతిలో పనే. ఫ్రీ హోల్డ్‌తో లబ్ధిపొందిన పెద్దలు, నేతలు ఎవరో గుర్తించే బాధ్యతను అధికారులకు అప్పగించాలి. గత ఏడాది ఆగస్టులో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌లపై నిషేధం విధించారు. తొలుత 2 నెలలపాటు నిషేధం అన్నారు. ఆ తర్వాత ప్రతి రెండు నెలలకోసారి పొడిగిస్తున్నారు. దీనిపై విమర్శలు రావడంతో సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రెవెన్యూమంత్రి అనగాని సత్యప్రసా ద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేసింది. తొలిసారిగా ఉపసంఘం భేటీఅయినా నిర్ణయమూ తీసుకోలేదు. ఉపసంఘం రెండో భేటీ వాయిదా పడింది. ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌లపై నిషేధాన్ని మరో రెండు నెలల పాటు... అంటే జూలై 11 వరకు పొడిగించారు.
పరిష్కారం చూపలేరా...
జగన్ ప్రభుత్వంలో 5.75 లక్షల ఎకరాల భూ ములను అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేశారని ప్రభుత్వం గుర్తించింది. ఈ డేటా ప్రభుత్వం వద్ద ఉంది. ఈ అక్రమాలకు బాధ్యులెవరో కూ డా సమాచారం ఉంది. ఆ భూములను తిరిగి నిషేధిత జాబితాలో చేర్చడం లేదా.. రిజిస్ట్రేషన్లు ఆపివేయడం చేస్తే సరిపోతుంది. ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ప్రభుత్వం ఓ స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోవ చ్చు. మంత్రివర్గ ఉపసంఘానికి రెవెన్యూశాఖ దీనిపై 4 నెలల క్రిత మే నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం చర్యలు తీసుకున్నా సమస్యకు ఓ పరిష్కారం లభించి ఉండేదని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఫ్రీ హోల్డ్‌ను కొనసాగిస్తూ జీఓ 596ను అమలు చేయాలనుకుంటే.. 50 సెంట్లు, ఎకరం, రెండు ఎకరాలున్న చిన్న రైతుల భూములను రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వాలి. అందులో బినామీ రిజిస్ట్రేషన్‌లు జరగకుండా చూసుకోవాలని రెవె న్యూ శాఖ నివేదించింది. ఒక వేళ ఫ్రీ హోల్డ్ అమలు చేయవద్దనుకుంటే అదే విషయాన్ని ప్రకటించాలి. కానీ, ఈ రెండింట్లో ఏ నిర్ణయం తీసుకోకుండా పది నెలలుగా నాన్చడం వల్ల భూముల రిజిస్ట్రేషన్ అవసరం ఉన్న పేద రైతుల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుంటోంది. అదే సమయంలో.. వైసీపీ కూడా ‘మేం మేలు చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చి అడ్డుకుంది’ అని ప్రచారం చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..
Updated Date - May 14 , 2025 | 04:08 AM