క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో.. పోలీసు కస్టడీకి కాకాణి
ABN, Publish Date - Jun 06 , 2025 | 04:38 AM
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డిని పోలీసు కస్టడీలో విచారించేందుకు కోర్టు అనుమతి మంజూరుచేసింది.
3 రోజుల విచారణకు నెల్లూరు ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతి
బెయిల్ పిటిషన్‌పై విచారణ 9కి వాయిదా
నెల్లూరు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డిని పోలీసు కస్టడీలో విచారించేందుకు కోర్టు అనుమతి మంజూరుచేసింది. మూడ్రోజుల పాటు విచారణ జరిపేందుకు వారిని పోలీసు కస్టడీకి ఇస్తూ నెల్లూరు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకాణిని పోలీసులు తమ కస్టడీకి తీసుకుంటారు. రోజూ సాయంత్రం 5 గంటల వరకూ న్యాయవాది సమక్షంలో ఆయన్ను ప్రశ్నిస్తారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో ఆయన ఏ4గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని పోలీసులు విచారించారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కాకాణిని విచారించాలని భావించారు. ఇందుకోసం పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. పైగా తప్పించుకుని తిరిగారు. బెంగళూరు శివార్లలో చింతామణి ప్రాంతంలోని వెంకటపురం గ్రామంలో మకాం వేసి ఉండగా.. గత నెల 25వ తేదీ రాత్రి పోలీసులు అరెస్టుచేశారు. నెల్లూరు కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. కాగా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో కాకాణి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 9న విచారణ జరుగనుంది.
Updated Date - Jun 06 , 2025 | 04:39 AM