NTR Jalasiri : జలసిరికి జవసత్వాలు
ABN, Publish Date - May 31 , 2025 | 04:25 AM
వైసీపీ పాలనలో నిర్వీర్యమైన ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు “జలసిరి 2.0”గా పునరుద్ధరించేందుకు కసరత్తు ప్రారంభించింది. పేద రైతులకు సోలార్, విద్యుత్ పంపుసెట్లు అందించి సాగు భూములకు నీటి వసతిని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటోంది.
‘ఎన్టీఆర్ జలసిరి 2.0’పై ప్రభుత్వం కసరత్తు
గతం కంటే మెరుగ్గా అమలుకు సన్నాహాలు
రైతులకు విద్యుత్తు, సోలార్ పంపుసెట్లు
గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు
వైసీపీ సర్కార్‌లో నిర్వీర్యమైన పథకం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ హయాంలో నిరాదరణకు గురైన వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం ఊపిరి పోస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న చంద్రబాబు సర్కార్.. జగన్ ప్రభుత్వంలో నిర్వీర్యమైన ‘ఎన్టీఆర్ జలసిరి’ పథకానికి జవసత్వాలు అందించి, త్వరలో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. 2014లో గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బోరుబావుల పథకం జలసిరికి కొనసాగింపుగా ఎన్టీఆర్ జలసిరి 2.0 పేరుతో అమలు చేయనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. విద్యుత్తు అందుబాటులో లేని రైతులకు సోలార్ పంపుసెట్లు, అందుబాటులో ఉండే రైతులకు విద్యుత్తు పంపుసెట్లు ఇవ్వడం ద్వారా పేద రైతులందరికీ పథకం ఫలాలు అందించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వినియోగించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ, నాబార్డు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తదితర నిధులను వినియోగించుకోవడం ద్వారా పేద రైతుల పొలాల్లో జలసిరిని నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఆర్ జలసిరి 2.0ను సమర్థవంతంగా అమలు చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కంకణం కట్టుకున్నారు.
విస్తృతంగా అమలవుతున్న సమయంలో..
పేద రైతుల భూములకు జలసిరి అందించాలని అప్పట్లో ఇందిర జలప్రభ పేరుతో కాంగ్రెస్ సీఎంలు వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డిలు హడావుడి చేశారు. అయితే పలు లోపాలతో ఈ పథకం ముందడుగు పడలేదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని బీడు భూములను సాగు భూములుగా మార్చాలని నిర్ణయించింది. మాజీ సీఎస్ టక్కర్ నేతృత్వంలోని కమిటీ ఎన్టీఆర్ జలసిరికి రూపకల్పన చేసింది. ఆ తర్వాత సీఎస్ దినే్‌షకుమార్ ఈ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ, ప్రతి ఒక్కరికి బోరుబావులు అందించేందుకు శ్రీకారం చుట్టారు. మొదట్లో విద్యుత్తుతో నడిచే పంపుసెట్లు అందించాలన్న నిర్ణయం ఆచరణలో అందరికీ ఇవ్వడం సాధ్యం కాలేదు. పొలాలకు విద్యుత్తు సౌకర్యం అందించాలంటే చాలా నిఽధులు అవసరమయ్యాయి. దీంతో కొద్ది మంది రైతులకు మాత్రమే విద్యుత్తు సౌకర్యం కల్పించి, పంపుసెట్లు అందించగలిగారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.6 వేలు, ఇతరులు రూ.20 వేల భాగస్వామ్య వాటా చెల్లించడం ద్వారా రూ.2.60 లక్షల విలువ కలిగిన సోలార్ పంపుసెట్లను పొలాల్లో ఏర్పాటు చేశారు. దీంతో చాలా చోట్ల రైతులు ఈ పథకాన్ని విస్తృతంగా వినియోగించుకున్నారు. 2019లో ఈ పథకం కోసం భారీగా దరఖాస్తులు అందాయి. రైతులందరికీ ఈ పథకం ఫలాలు అందించాలని అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీసీ అధికారంలో వచ్చింది. వచ్చీ రాగానే ఎన్టీఆర్ జలసిరి పేరు కనపడకుండా వైఎ్‌సఆర్ జలకళగా పేరుమార్చారు. మూడేళ్ల పాటు పథకం జోలికి వెళ్లకుండా నిర్వీర్యం చేశారు.
ఉచితమన్నారు...అసలే ఇవ్వలేదు.!
వైసీపీ ప్రభుత్వం విద్యుత్తుతో నడిచే పంపుసెట్లు ఉచితంగా ఇస్తామంటూ హడావుడి చేసింది. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత పథకం ప్రారంభించి, ప్రతి ఒక్క రైతు పొలంలో బోరుబావి తవ్వుతామని హామీ ఇచ్చింది. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బోరు మెషిన్, ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మెషిన్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పింది. అయితే మెషిన్లు కొనకుండా చివరకు ప్రైవేట్ బోరు యాజమానులకు పని అప్పగించారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వారు కూడా బోర్లు తవ్వకుండా నిలిపేశారు. కొంత మంది వైసీపీకి చెందిన వారికి మాత్రమే బోర్లు వేయించి మమ అనిపించారు. చివర్లో ఈ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేశామని చెప్పుకొనేందుకు 2 వేల పైచిలుకు మోటార్లును కొనుగోలు చేశారు. ఒక్కరికి కూడా విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేయకుండానే మోటార్లు కొనుగోలు చేశారు. ఎన్నికల ముందు గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేశారు. దీంతో మోటార్ల కొనుగోలు, పంపిణీపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై సమగ్రమైన విచారణ జరిగితే గానీ.. వాస్తవాలు వెలుగులోకి రావు.
మంచి ఆశయంతో రూపకల్పన
భూములకు నీటి వసతి కల్పించడం ద్వారా సాగు విస్తీర్ణం పెంచి, మంచి దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం జలసిరి పథకానికి రూపకల్పన చేసింది. అంతకుముందు వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల హయాంలోని పథకాల్లో లోటుపాట్లను అధ్యయనం చేసి సరికొత్త మార్గదర్శకాలతో ప్రణాళికలు రూపొందించారు. అన్ని కసరత్తుల తర్వాత పథకం అమలు ప్రారంభమై.. విస్తృత అమలు వేగం పుంజుకుంటున్న సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. రెండేళ్లు పథకం ఊసే ఎత్తలేదు. చివరకు వైఎ్‌సఆర్ జలకళ పేరుతో ప్రారంభించినా.. ప్రజలకు చేరువ కాలేదు. టీడీపీ ప్రభుత్వంలో బాగా అమలవుతున్న పథకాన్ని నిర్వీర్యం చేయడంతో రైతులు ఆశలు వదులుకున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News
Updated Date - May 31 , 2025 | 04:25 AM