Farmers Rebellion: రైతులు తిరగబడితే ప్రభుత్వాలే గల్లంతు
ABN, Publish Date - Jul 07 , 2025 | 02:20 AM
రైతులు తిరగబడితే ప్రభుత్వాలే గల్లంతవుతాయి. అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటమే ఇందుకు నిదర్శనం. వారి పోరాటమే గత వైసీపీ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టేసింది. కరేడు రైతుల విషయంలో మేల్కొకపోతే కూటమి ప్రభుత్వానికీ అదే గతి పడుతుంది..
కరేడు రైతులకు హైకోర్టు న్యాయవాదుల మద్దతు
ఉలవపాడు, జూలై 6(ఆంధ్రజ్యోతి): ‘రైతులు తిరగబడితే ప్రభుత్వాలే గల్లంతవుతాయి. అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటమే ఇందుకు నిదర్శనం. వారి పోరాటమే గత వైసీపీ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టేసింది. కరేడు రైతుల విషయంలో మేల్కొకపోతే కూటమి ప్రభుత్వానికీ అదే గతి పడుతుంది’.. అని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(ఐలు) అధ్యక్షుడు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. ఇండోసోల్ కంపెనీ బాధిత గ్రామం కరేడులో ఆదివారం హైకోర్టు న్యాయవాదులు, పౌర హక్కుల సంఘం నాయకులు 21 మంది పర్యటించారు. అలగాయపాలెం, బట్టిసోమయ్య పాలెం, టెంకాయచెట్లపాలెం, చిన్నపల్లెపాలెం తదితర గ్రామాల్లో ఈ బృందం పర్యటించింది. మత్స్యకారులు, వేరుశనగ రైతులు, నర్సరీలో పనిచేస్తున్న మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంది. అనంతరం కరేడు బస్టాండ్ ప్రాంగణంలో గ్రామసభలో స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, పౌర హక్కుల సంఘం నాయకులు కరేడు రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని ఎండగట్టారు.
Updated Date - Jul 07 , 2025 | 02:21 AM