Student Admissions: కాలేజీలపై కుళ్లు రాతలు!
ABN, Publish Date - Jul 30 , 2025 | 03:46 AM
నిజంగా తప్పు జరిగితే దానిని ఎత్తి చూపించడం కాదు! లేని తప్పులను
ఇంటర్‌లో అడ్మిషన్లపై రోత పత్రిక అవాకులు
ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా.. తగ్గిపోయినట్టు ప్రచారం
గతేడాదితో పోలిస్తే పెరిగిన అడ్మిషన్లు
2023-24 కంటే 18 శాతం పెరుగుదల
2024-25 కంటే 3,206 అదనం
జగన్ జిల్లా కడపలోనూ పెరిగిన సంఖ్య
ప్రైవేటు కళాశాలల్లోనే తగ్గిన విద్యార్థులు
ఇంటర్‌పై పదోతరగతి ఫలితాల ప్రభావం
అయినా ప్రభుత్వ కాలేజీల అడ్మిషన్లు పైపైకే
రోత పత్రిక రాతలను ఖండించిన బోర్డు
(అమరావతి - ఆంధ్రజ్యోతి): నిజంగా తప్పు జరిగితే దానిని ఎత్తి చూపించడం కాదు! లేని తప్పులను ‘సృష్టించి’ ప్రభుత్వంపై బురదజల్లడమే జగన్ రోత పత్రిక నైజం! ఈ క్రమంలోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు దారుణంగా పడిపోయాయంటూ ఒక కథనాన్ని వండి వార్చింది. ప్రభుత్వ కాలేజీలన్నీ ఖాళీ అయిపోయాయని, ఎక్కడా విద్యార్థులు లేరన్నట్టుగా వాపోయింది. ఇంటర్ విద్యాశాఖ ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఈ శాఖ గణాంకాల ప్రకారం ఇంటర్ ఫస్టియర్‌లో 2023-24లో 67,148 మంది అడ్మిషన్లు పొందితే, 2024-25లో 71,632 మంది చేరారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 74,838కి పెరిగింది. అంటే 3206 మంది అదనంగా ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. కాగా గతేడాది ఫస్టియర్ చదివిన 71 వేల మందికిపైగా విద్యార్థులు ఈ ఏడాది సెకెండియర్‌కు వచ్చారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 1,46,332కు చేరింది. వైసీపీ ప్రభుత్వంలోని చివరి ఏడాదితో పోల్చినా, గతేడాదితో పోల్చినా విద్యార్థుల సంఖ్య పెరిగింది. జిల్లాల వారీగా చూసినా ఫస్టియర్ అడ్మిషన్లు పెరిగాయి. జగన్ సొంత జిల్లా కడపలోనూ విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2023-24లో కడపలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2,201 మంది విద్యార్థులు చేరితే, ఈ ఏడాది 2,783 మంది చేరారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గతేడాది 3,317 మంది చేరితే, ఈ సంవత్సరం 3,517 మంది చేరారు. అనకాపల్లిలో 2,962 నుంచి 3,292కు, కోనసీమలో 1,372 నుంచి 1,629కి, ఏలూరులో 1,993 నుంచి 2,197కి, కాకినాడలో 3,344 నుంచి 3,727కి, కృష్ణాలో 1,089 నుంచి 1,108కి, కర్నూలులో 4,066 నుంచి 6,014కు, నంద్యాలలో 3,206 నుంచి 3,423కు, ఎన్టీఆర్‌లో 1,380 నుంచి 1,839కి, ప్రకాశంలో 2,288 నుంచి 2,583కు, శ్రీకాకుళంలో 5,985 నుంచి 6,157కు, విశాఖలో 2,694 నుంచి 2,869కి, పశ్చిమగోదావరిలో 1,463 నుంచి 1,589కి అడ్మిషన్ల సంఖ్య పెరిగింది.
ప్రైవేటుపైనే పెద్ద దెబ్బ
ఈ సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణత శాతం ఇంటర్ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపింది. 2024లో 86.69శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, 2025లో 81.14శాతంకు తగ్గింది. దీంతో సుమారు 35 వేల మంది విద్యార్థులు తగ్గారు. ఆ ఫలితం ఇంటర్మీడియట్ విద్యపై పడింది. ప్రైవేటు కాలేజీల్లో గతేడాది 4,15,795 మంది చేరితే ఈ సంవత్సరం 3,92,009 మంది చేరారు. ప్రైవేటు కాలేజీల్లో 23,786 అడ్మిషన్లు తగ్గిపోయాయి. కాగా, అడ్మిషన్ల గడువును ఆగస్టు 11 వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది. ఇటీవల పాలిటెక్నిక్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయింది. డిప్లొమాలో సీటు పొందిన ఎవరైనా చేరేందుకు ఆసక్తి చూపకపోతే అలాంటి వారికి ఇంటర్‌లో అవకాశం కల్పించేందుకు ఈ మేరకు గడువు పొడిగించింది.
రోత పత్రిక వర్సెస్ బోర్డు
విద్యార్థుల సంఖ్య పెరిగిన కాలేజీల్లో కూడా తగ్గినట్టుగా జగన్ రోత పత్రిక అసత్యాలు రాసిందని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు వివరాలు వెల్లడించింది.
విద్యార్థుల సంఖ్య డబుల్ డిజిట్ దాటని కాలేజీలు 200కుపైనే ఉన్నాయని రాయ గా, అలాంటి కాలేజీలు 47 మాత్రమే ఉన్నాయని బోర్డు తెలిపింది. కర్నూలు జిల్లా, దేవరకొండ ప్రభుత్వ కాలేజీలో 82 మంది విద్యార్థులులే ఉన్నారని పత్రిక రాయగా.. 155 మంది ఉన్నారని బోర్డు పేర్కొంది. ఎమ్మిగనూరులో 450 మంది విద్యార్థులుంటే 182 మంది మాత్రమే ఉన్నట్లు అసత్య ప్రచారం చేసింది.
తిరుపతి జిల్లా చంద్రగిరి బాలికల కాలేజీలో 380 మంది చేరితే 285 మంది మాత్రమే చేరినట్లుగా విషం చిమ్మింది.
నెల్లూరు జిల్లాలో కేఏసీలో కాలేజీలో 300 మంది చేరితే 250 మంది చేరినట్టు, ఆత్మకూరులో 216 మందికి 134 అని, కందుకూరులో 239 మందికి 131 అని, కోవూరులో 152 మందికి 109 మంది అని, ఉదయగిరిలో 166 మందికి 100 మంది మాత్రమే ఉన్నారని రోత పత్రిక రాయడాన్ని బోర్డు తీవ్రంగా తప్పుబట్టింది.
Updated Date - Jul 30 , 2025 | 03:46 AM