MeeSeva scam: మీసేవ లో ఈ-స్టాంపుల కుంభకోణం
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:44 AM
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మీ సేవ కేంద్రం నిర్వాహకుడు పలు కంపెనీలకు నకిలీ స్టాంపులు విక్రయించి, రూ.కోట్లు కొల్లగొట్టినట్లు సమాచారం.
కళ్యాణదుర్గం వేదికగా నకిలీ స్టాంపుల విక్రయం
రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకూ స్కాం?
మీసేవ నిర్వాహకుడు ఎర్రప్ప సూత్రధారి
రూ.100 విలువైన స్టాంపులు రూ.లక్షకు విక్రయం
ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా కంపెనీ ఆడిట్‌తో వెలుగులోకి..
అనంతపురం క్రైం, జూన్ 23(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మీ సేవ కేంద్రం నిర్వాహకుడు పలు కంపెనీలకు నకిలీ స్టాంపులు విక్రయించి, రూ.కోట్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా ప్రతినిధులు అనంతపురం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు తన భార్య కట్ట భార్గవి పేరిట తహసీల్దారు కార్యాలయం వద్ద మీ సేవ కేంద్రం నడుపుతున్నాడు. ఇక్కడే ఈ-స్టాంపులను విక్రయిస్తుంటారు.
ఈ క్రమంలో నకిలీ స్టాంప్‌లు సృష్టించి, విక్రయించడం మొదలు పెట్టారు. రూ.100 విలువ గల స్టాంపులను సైతం రూ.లక్ష విలువైనవిగా చూపించి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా డెవలప్పర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నకిలీ స్టాంపులను భారీగా విక్రయించారు. ఆ సంస్థ అంతర్గత ఆడిట్‌లో ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ఇచ్చిన నకిలీ స్టాంపులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. టూటౌన్ పోలీసులు నిందితులు ఎర్రప్ప, ఆయన భార్య భార్గవి, మరో వ్యక్తిని ఆదివారం రాత్రే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకూ స్కాం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా ప్రతినిధి గుంటూరు సతీ్‌షబాబు సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Updated Date - Jun 24 , 2025 | 04:46 AM