Excise Raid : తిరుపతిలో నకిలీ మద్యం!
ABN, Publish Date - Feb 01 , 2025 | 04:00 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎక్సైజ్ డీసీ విజయశేఖర్ శుక్రవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
30 లక్షల ముడి పదార్థాలు, యంత్రాలు సీజ్
6 లక్షల నగదు, 283 గ్రాముల బంగారం స్వాధీనం
ఇద్దరు అరెస్టు.. రైల్వేకోడూరులో తీగలాగితే కదిలిన డొంక
తిరుపతి (నేరవిభాగం), జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఇళ్లల్లో గుట్టుగా నకిలీ మద్యం తయారు చేస్తూ.. వాటిని బెల్ట్ షాపులకు తరలిస్తున్న ముఠా గుట్టును తిరుపతి, కడప జిల్లాల ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. భారీగా ముడిపదార్థాలు, యంత్రాలను సీజ్ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎక్సైజ్ డీసీ విజయశేఖర్ శుక్రవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో 4రోజుల క్రితం భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. ఈ ఘటనలో నిందితులైన అయ్యప్ప, వెంకటనారాయణను విచారించగా.. తిరుపతి నుంచి నకిలీ మద్యం తీసుకెళ్లి, బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారంతో దామినేడు ఇందిరమ్మ గృహాల్లోని బి బ్లాక్ 61వ నంబరు ఇంటి వద్ద 23 క్యాన్ల స్పిరిట్, నకిలీ లేబుళ్లు, 6,955 ఖాళీ బాటిళ్లు, నకిలీ మద్యం తయారు చేయడానికి వాడే సాచింగ్ మిషన్ సీజ్ చేశారు. మరోవైపు తిరుపతిలో ఉంటున్న కడప జిల్లా పింఛాకు చెందిన అన్నదమ్ములు చికెన్ శీను, మహేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఈ నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్న కింగ్‌పిన్ వెంకటరమణ ఇంటిని చూపించారు. ఆ ఇంట్లో అధికారులు దాదాపు రూ.6 లక్షల నగదు, 283.95 గ్రాముల బంగారు నగలు స్వాఽధీనం చేసుకున్నారు.
Updated Date - Feb 01 , 2025 | 04:00 AM