Engineering Colleges: ఇంజనీరింగ్‌లో పెరిగిన సీట్లు
ABN, Publish Date - Jul 02 , 2025 | 06:20 AM
రాష్ట్రంలో ఈఏడాది సుమారుగా 34 వేల ఇంజనీరింగ్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది 1.81 లక్షల సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది దాదాపు 2.15 లక్షల సీట్ల భర్తీకి అనుమతి లభించింది.
2 లక్షలకు పైగా అందుబాటులోకి
అందులో సగానికిపైగా సీఎ్‌సఈకే
యూనివర్సిటీ కాలేజీలో క్వాంటమ్ కంప్యూటింగ్
కొత్తగా రెండు కళాశాలలకు అనుమతి
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈఏడాది సుమారుగా 34 వేల ఇంజనీరింగ్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది 1.81 లక్షల సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది దాదాపు 2.15 లక్షల సీట్ల భర్తీకి అనుమతి లభించింది. 18 ప్రభుత్వ కళాశాలల్లో 6,400 సీట్లు, 225 ప్రైవేటు కళాశాలల్లో 1,79,334 సీట్లు, 11 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 11,500 కన్వీనర్ కోటా సీట్లు... మొత్తంగా 1,97,234 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లు కూడా ఉంటాయి. అవి కూడా కలిపితే మొత్తం సీట్లు 2.15 లక్షలు దాటుతాయని సాంకేతిక విద్యాశాఖ అంచనా వేసింది. ఈ మొత్తంలో కంప్యూటర్ సైన్స్(సీఎ్‌సఈ) బ్రాంచ్ సీట్లు సగానికిపైగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1,02,614 సీఎ్‌సఈ సీట్లున్నాయి. ఐటీలో 6,360, సివిల్‌లో 8,180, మెకానికల్‌లో 9,815, ఈఈఈలో 10,895, ఈసీఈలో 32,300, ఇతర శాఖల్లో 16,260 సీట్లు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆరు రకాల కొత్త కోర్సులకు అనుమతి లభించింది. ఏఎన్‌యూ పరిధిలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఏఐ అండ్ ఎంఎల్... ఏయూ పరిధిలో వీఎల్‌ఎ్‌సఐ, క్వాంటం కంప్యూటింగ్... కృష్ణా వర్సిటీ పరిధిలో ఏఐ అండ్ ఎంఎల్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో బ్రాంచ్‌లో 60 చొప్పున సీట్లు కేటాయించారు. కొత్తగా ప్రకాశం జిల్లాలో, గుడివాడలో కలిపి రెండు కళాశాలలకు అనుమతులు వచ్చాయి. మొత్తంగా వర్సిటీ కాలేజీల్లో 360, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 19,974 సీట్లు పెరిగాయి. ఈ సంవత్సరం ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. దీంతో ఇంజనీరింగ్ అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది జనరల్ కేటగిరీలో 3,93,976 మంది ఇంటర్ పూర్తిచేశారు.
పాత ఫీజులతోనే..?
ఈ విద్యా సంవత్సరంలో కూడా దాదాపుగా పాత ఫీజులే ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంజనీరింగ్ కోర్సుల ఫీజుల అంశం న్యాయస్థానంలో ఉంది. గతేడాది కోర్టు ఆదేశాల మేరకు కనీస ఫీజు రూ.40 వేలు, గరిష్ఠ ఫీజు రూ.1.05 లక్షలుగా ఖరారు చేశారు. ఈ సంవత్సరం కూడా దాదాపుగా అవే ఫీజులతో అడ్మిషన్లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం కళాశాలల్లో 110... రూ.40 వేల ఫీజు స్థాయిలోనే ఉన్నాయి. ఎనిమిది కాలేజీల్లో మాత్రమే ఫీజు రూ.లక్ష దాటింది. ఈ విద్యా సంవత్సరం తర్వాత మళ్లీ మూడేళ్ల కాలానికి ఒకేసారి ఫీజులు నిర్ణయిస్తారు.
Updated Date - Jul 02 , 2025 | 06:23 AM