గాయపడితే సాయపడేలా..
ABN, Publish Date - Jun 22 , 2025 | 01:21 AM
నాగేంద్ర బైక్‌పై తన సొంతూరు నుంచి వేరొక ఊరు పని నిమిత్తం బయల్దేరాడు. దారిలో అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు అతడిని సమీపంలోనే ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అతడికి వైద్యం అందించాలంటే వెంటనే కొంత సొమ్ము చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. అయితే అతడి బంధువులు ఎవరూ అక్కడ లేరు. వారికి సమాచారం ఇద్దామంటే వారి వివరాలేవీ తెలియదు... ఇలాంటి
కొత్త ఉచిత పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
నగదు రహిత చికిత్సా పథకం -2025తో క్షతగాత్రులకు ఎంతో ప్రయోజనం
రూ.లక్షన్నర వరకు వైద్య ఖర్చులు భరించే అవకాశం
రోడ్డు ప్రమాద మరణాలు అరికట్టే దిశగా అడుగులు
నాగేంద్ర బైక్‌పై తన సొంతూరు నుంచి వేరొక ఊరు పని నిమిత్తం బయల్దేరాడు. దారిలో అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు అతడిని సమీపంలోనే ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అతడికి వైద్యం అందించాలంటే వెంటనే కొంత సొమ్ము చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. అయితే అతడి బంధువులు ఎవరూ అక్కడ లేరు. వారికి సమాచారం ఇద్దామంటే వారి వివరాలేవీ తెలియదు... ఇలాంటి సమయంలో అతడికి వైద్యం అందుతుందా? అతడి ప్రాణాలు దక్కుతాయా? అంటే దక్కుతాయి అంటున్నారు కాకినాడ రవాణా శాఖ అధికారులు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘నగదు రహిత ఉచిత చికిత్సా పథకం 2025’ రోడ్డు ప్రమాద బాధితుల వైద్యానికి తక్షణ సాయం అందిస్తోందని చెబుతున్నారు. 162 సెక్షన్ మోటారు వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం రూ.లక్షన్నర వరకు క్యాష్‌లెస్ ఫ్రీ ట్రీట్‌మెంట్‌ను అందించనున్నట్టు వారు వెల్లడించారు.
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో పరిధిలోనే వందలాది మంది మరణిస్తున్నా రు. వీరిలో చాలామందికి సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. లేదంటే తీవ్ర గాయాలపాలై జీవితాంతం నరకం చవిచూస్తున్నారు. ముఖ్యంగా ఇంటి యజమాను లు ప్రమాదాల బారిన పడితే ఆయా కుటుంబాల పరిస్థితి అయోమయంగా మారుతోంది. ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ ఉచిత వైద్య సాయం అందించేందుకు ఈ ఏడాది మే నెలలో ఈ నూతన పథకాన్ని తీసుకొచ్చింది. ప్రమాదానికి గురైన క్షతగాత్రుడికి వైద్య ఖర్చుల కోసం రూ.లక్షన్నర వరకు ఆసుపత్రిలో చెల్లించనుంది. అయితే ఇవి ఎలా అందుతాయి? ఏ విధంగా ఈ పథకం బాధితులకు వర్తిస్తుందనే విషయమై కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. రోడ్డు ప్ర మాదంలో గాయపడిన వ్యక్తికి నగదు రహిత చికిత్సా పథకం-2025 వర్తించాలంటే ముం దుగా ప్రమాద విషయం పోలీసుల దృష్టికి వెళ్లాలి. క్షతగాత్రుడి వివరాలను పోలీసు వారు నమోదు చేసుకోవాలి. వాటిని ’ఈ-ధార్’ యాప్‌లో పొందుపరచాలి. ఇదంతా ప్రమాదం జరిగిన 24 గంటల్లోపే జరగాలి. లేకుంటే ఈ పథకం వర్తించదు. నగదు రహిత చికిత్స అందదు. అందుకే ఈ విషయంలో పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం వహించకూడదు. తప్పనిసరిగా రోడ్డు ప్రమాద బాధితు ల వివరాల సేకరణలో అప్రమత్తంగా ఉండాలి. ’ఈ-ధార్’లో పోలీసు సిబ్బంది బాధితుడి పేరున ఐడీ క్రియేట్ చేయాలి. అలాగే రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రిలో చేర్చాక అతడి పేరున టీఎంఎస్ పోర్టల్‌లో ఆసుపత్రి సిబ్బంది నమోదు చేసి మరో ఐడీని క్రియేట్ చేయాలి. ఈ ఐడీలను పరిశీలించడం ద్వారానే నగదు రహిత చికిత్స వర్తిస్తుంది. వైద్య ఖర్చులకు రూ.లక్షన్నర వరకు క్యాష్‌లెస్ ఫ్రీట్రీట్‌మెంట్ అందుతుంది. ఆసుపత్రి లో అయిన వైద్య ఖర్చుల బిల్లులను కేంద్రం చెల్లిస్తుంది. ఉదాహరణకు ఓ బాధితుడు ఆసుపత్రిలో చేరాక.. అతడి వైద్యానికి రూ.లక్ష ఖర్చు అయితే.. ఆ లక్షను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఒకవేళ ప్రమాదం తీవ్రస్థాయిలో జరిగి రూ.రెండు లక్షలు ఖర్చయినా.. కేంద్రం రూ.లక్షన్నర వరకు మాత్ర మే చెల్లిస్తుంది. మిగిలిన రూ.50 వేలు బాధితుడే ఆసుపత్రికి చెల్లించుకోవాలి. అయితే ఈ ఫ్రీ ట్రీ ట్మెంట్ సేవలు ఆయుష్మాన్ భారత్ రిజిస్టర్డ్ ఆసు పత్రుల్లో మాత్రమే అందుతాయి. ఇక ప్రమాదబారిన పడి ఆయుష్మాన్ భారత్ రిజిష్టర్డ్ ఆసుపత్రిలో చేరి నగదు రహిత చికిత్సా పథకం ద్వారా వైద్యం చేయించుకుంటున్న బాధితులు కేవలం ఏడు రోజుల వరకు మాత్రమే ప్రభుత్వం సాయం అందిస్తుంది. అంటే ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఏడు రోజుల వరకు అయ్యే ఖర్చులను మాత్రమే భరిస్తుంది. ఎనిమిదో రోజు నుంచి ఖర్చులన్నింటినీ బాధితుడే భరించాలి.
ఇలా కూడా చేయొచ్చు..
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కాల్ 112 నంబర్‌కు కాల్ చేయాలి. దీనివల్ల ఎక్కడ ప్రమాదం జరిగిందో, ఆ ప్రదేశం జియో లొకేషన్ ట్రాక్ చేసి దగ్గర్లో ఉన్న పోలీసువారికి, ఆసుపత్రులకు, అంబులెన్స్‌కు సమాచారం వెళుతుంది. దీనివల్ల సకాలంలో సమాచారం వెళ్లి బాధితులకు వెంటనే వైద్యం అందే అవ కాశం ఉంది. ఈ పథకం అందరికీ ఉచితం.
- డాక్టర్ ఏవీ పద్మావతి, కాకినాడ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్
పథకంపై అవగాహన పెంచుకోండి
కేంద్రం నగదు రహిత చికిత్సా పథకం తీసుకొచ్చింది. ఇది క్షతగాత్రుల వైద్య ఖర్చులకు ఉప యోగపడే క్యాస్‌లెస్ ట్రీట్‌మెంట్ పథకం. ప్రతి ఒక్కరికీ దీనిపై అందరికీ అవగాహన ఉండాలి.
- శ్రీధర్, ఉప కమిషనర్, రవాణాశాఖ, కాకినాడ జిల్లా
Updated Date - Jun 22 , 2025 | 01:21 AM