Degree Admissions: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డిగ్రీ దరఖాస్తులు
ABN, Publish Date - Jul 17 , 2025 | 05:00 AM
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల విధానంలో ఉన్నత విద్యా శాఖ మార్పులు చేసింది..
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల విధానంలో ఉన్నత విద్యా శాఖ మార్పులు చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు సమర్పించే విధానం అమల్లో ఉండగా.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. డిగ్రీ అడ్మిషన్ల నిబంధనలు-2000కు ఈ మేరకు సవరణలు చేస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం...
ఓఏఎండీసీ వెబ్‌సైట్ ద్వారా వేర్వేరు కాలేజీలకు, వేర్వేరు కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థి నేరుగా కాలేజీకి వెళ్లి కూడా దరఖాస్తు సమర్పించవచ్చు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఆ దరఖాస్తును ఓఏఎండీసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి, విద్యార్థికి ధ్రువీకరణ పత్రం ఇస్తారు.
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి.ఒకవేళ ఒక విద్యార్థి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రెండు రూపాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆఫ్‌లైన్‌లో కాలేజీలో సమర్పించిన దరఖాస్తును మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీ కేటగిరీ కింద ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుంది.
Updated Date - Jul 17 , 2025 | 05:00 AM