CM Chandrababu : ఈఏపీల రుణానికి కసరత్తు
ABN, Publish Date - Jan 29 , 2025 | 03:08 AM
జగన్ హయాంలో పలు ఈఏపీ ప్రాజెక్టుల రుణాలను కూడా దారి మళ్లించారు. దీం తో ఆ ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టులకు రుణం దాదాపు విడుదల కాలేదు.
రాష్ట్రంలో రూ.27,259 కోట్లతో 11 ప్రాజెక్టులు.. సీఎం కీలక సమీక్ష
రాష్ట్రంలో రూ. 27,259 కోట్లతో 11 ప్రాజెక్టులు
అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి లోన్లు
గతంలో రుణాన్ని దారి మళ్లించిన జగన్ సర్కార్
పరిస్థితి చక్కదిద్దుతున్న కూటమి ప్రభుత్వం
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రుణాల సహకారంతో(ఈఏపీ ) చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైసీపీ పాలనలో గాడి తప్పిన ఈ ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. జగన్ హయాంలో పలు ఈఏపీ ప్రాజెక్టుల రుణాలను కూడా దారి మళ్లించారు. దీం తో ఆ ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టులకు రుణం దాదాపు విడుదల కాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితులను చక్కది ద్ది ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న 11 ఈఏపీ ప్రాజెక్టుల పురోగతిని మంగళవారం సమీక్షించారు. కాగా, రుణాలు ఇచ్చే సంస్థలు ఒకేసారి కాకుండా ప్రాజెక్టు పురోగతి ఆధారంగా, విడతల వారీగా రుణం విడుదల చేస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న 11 పాజెక్టులకు వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రూ. 20,523 కోట్ల రుణం మంజూరైంది. ఆ రుణం కాకుం డా ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6,736 కోట్లు సమకూర్చాలి. దీంతో 11 ప్రాజెక్టుల విలువ రూ.27,259 కోట్లకు చేరుతుంది. 2024 డిసెంబరు చివరి నాటికి రూ.6,603 కోట్ల లోన్ వచ్చింది. ఇంకా రూ.13,919 కోట్లు రావాల్సి ఉంది.రాబోయే ఐదేళ్లలో రూ.7,155 కోట్ల రుణాలు విడుదలవుతాయని ప్రభు త్వం అంచనా వేస్తోంది.
ఈ రుణాలతో పాటు ప్రభు త్వం తన వాటా కింద రూ.3,000 కోట్లు విడుదల చేస్తుంది. అమల్లో ఉన్న 11 ప్రాజెక్టులతో పాటు, ఇప్పటికే పూర్తయిన మరో 31 ఈఏపీలకు సంబంధించి రాష్ట్రం తీసుకున్న అప్పులపై 2024-25 నుంచి 2029-30 వరకు రూ.7,155 కోట్ల అసలు, రూ.5,470 కోట్ల వడ్డీ కలిపి మొత్తం రూ.12,625 కోట్లు చెల్లించాలి. ఈ రుణాలపై 6.08 శాతం నుంచి 7.04 శా తం వడ్డీ అమలవుతోంది.
అమల్లో ఉన్న ప్రాజెక్టులు.. ప్రస్తుత పరిస్థితి
ఏపీ మండల్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టు కోసం రూ. 2,240 కోట్ల రుణం మంజూరైంది. రాష్ట్రం తన వాటాగా రూ. 960 కోట్లు విడుదల చేయాలి. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 3,200 కోట్లు. ఇప్పటి వరకు రూ. 207 కోట్లు ఖర్చు చేశారు. వచ్చే ఐదేళ్లలో ప్రాజెక్టు పురోగతి ఆధారంగా రూ. 750 కోట్ల లోను విడుదలయ్యే అవకాశం ఉంది.
ఏపీ రోడ్లు, బ్రిడ్జిల పునర్నిర్మాణ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టుకయ్యే మొత్తం ఖర్చు రూ. 3,200 కోట్లు కాగా, ఇందులో రూ. 2,240 కోట్ల రుణం మంజూరైంది. రాష్ట్రం వాటాగా రూ. 960 కోట్లు ఇవ్వాలి. ఇప్పటి వరకు రూ. 269 కోట్లు ఖర్చు చేశారు. వచ్చే ఐదేళ్లలో రూ. 750 కోట్ల అప్పు వచ్చే అవకాశం ఉంది.
ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 4,234 కోట్లు అవుతుండగా, ఇందులో రూ. 2,963 కోట్లు రుణంగా మంజూరైంది. రాష్ట్రం వాటా రూ. 1270 కోట్లు. ఇప్పటి వరకు రూ. 908 కోట్ల రుణం విడుదల కాగా, మొత్తం రూ. 1,515 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ. 2,055 కోట్ల రుణం రావాలి. వచ్చే ఐదేళ్లలో రూ. 1,200 కోట్ల రుణం అందే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
ఏపీ ఇరిగేషన్, లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 2,000 కోట్లు. ఇందులో రూ. 1,700 కోట్లు రుణం కాగా, రూ. 300 కోట్లు రాష్ట్ర వాటా. ఇప్పటి వరకు రూ. 218 కోట్ల రుణం విడుదలైంది. రూ. 304 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ. 1,481 కోట్ల రుణం విడుదల కావాలి. వచ్చే ఐదేళ్లలో రూ. 100 కోట్ల లోన్ రావొచ్చని అంచనా.
ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్, అగ్రికల్చర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 1,600 కోట్లు కాగా ఇందులో రూ. 1,120 కోట్లు రుణం మంజూరైంది. రూ. 480 కోట్లు రాష్ట్రం తన వాటాగా విడుదల చేయాలి. ఇప్పటివరకు రూ. 194 కోట్ల రుణం అందింది. రూ. 243 కోట్లు ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేశారు. ఇంకా రూ. 925 కోట్లు రుణం రావాలి. వచ్చే ఐదేళ్లలో రూ. 100 కోట్లు రుణంగా అందే అవకాశం ఉంది.
ఏపీ అర్బన్ వాటర్ సప్లై, సెప్టేజ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టు ఖర్చు రూ. 3,723 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో రూ. 2,606 కోట్లు అప్పుగా మంజూరైంది. రూ. 1,117 కోట్లు రాష్ట్రం ఖర్చు చేయాలి. ఇప్పటివరకు రూ. 333 కోట్ల రుణం విడుదలైంది. ఈ ప్రాజెక్టుపై రూ. 446 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ. 2,272 కోట్ల రుణం రావాల్సి ఉంది. వచ్చే ఐదేళ్లలో రూ.2,000 కోట్ల రుణం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్: ఈ ప్రాజెక్టు ఖర్చు రూ. 2,362 కోట్లు కాగా ఇందులో రూ.1,617 కోట్లు లోన్‌గా మంజూరైంది. రూ.745 కోట్లు రాష్ట్ర ప్రభు త్వం సమకూర్చాలి. ఇప్పటి వరకు రూ. 1,298 కోట్ల రుణం వచ్చింది. ఈ ప్రాజెక్టుపై రూ.1,340 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.318 కోట్ల అప్పు రావాలి. వచ్చే ఐదేళ్లలో ఇది పూర్తిగా రానుందంటున్నారు.
విశాఖ-చెన్నై డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్-2: ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.1,758 కోట్లు. ఇందులో రూ.1,155 కోట్లు రుణం మంజూరైంది. రాష్ట్రం వాటా రూ.603 కోట్లు. ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా రుణం రాలేదు. వచ్చే ఐదేళ్లలో రూ.695 కోట్ల లోన్ అందుతుందని భావిస్తున్నారు.
ఏపీ హెల్త్‌సిస్టమ్ స్ర్టెంతెనింగ్ ప్రోగ్రామ్: ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.2,327 కోట్లు. ఇందులో రాష్ట్రం వాటా లేదు. మొత్తం అప్పుగా మంజూరైంది. ఇప్పటి వరకు రూ.2273 కోట్లు అప్పు విడుదలైంది. ఇంకా రూ. 54 కోట్ల అప్పు అందాల్సి ఉంది.
జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్: ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.1,000 కోట్లు. ఇందులో రూ.700 కోట్లు అప్పుగా మంజూరైంది. రూ.300 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పటి వరకు రూ.195 కోట్ల రుణం వచ్చింది. రూ.195 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.504 కోట్ల లోన్ రావాలి. వచ్చే ఐదేళ్లలో రూ.300 కోట్ల అప్పు వస్తుందని అంచనా.
సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆపరేషన్స్: ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 1,853 కోట్లు. ఇందులో రాష్ట్రం వాటా లేదు. మొత్తం అప్పుగా మంజూరైంది. ఇప్పటి వరకు రూ.947 కోట్ల అప్పు విడుదల కాగా, ఆ మొత్తాన్ని ఖర్చు చేశారు. ఇంకా రూ.905 కోట్ల అప్పు రావాలి. వచ్చే ఐదేళ్లలో ఈ మొత్తం విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jan 29 , 2025 | 03:08 AM