CM Chandrababu : 2026 జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు
ABN, Publish Date - Feb 12 , 2025 | 04:03 AM
రాష్ట్రంలో 5లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేసి, వాటిని ఒకేరోజు ప్రారంభించాలని హౌసింగ్ అధికారులకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు.
అవన్నీ ఒకేరోజు ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
2026 జూన్ నాటికి 5లక్షల ఇళ్లు పూర్తి
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 5లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేసి, వాటిని ఒకేరోజు ప్రారంభించాలని హౌసింగ్ అధికారులకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. అర్బన్, రూరల్ హౌసింగ్ శాఖలు కలిసి ఐదేళ్లలో మొత్తం ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. 2029 నాటికి ఇళ్లతో పాటు కరెంటు, నీళ్లు, గ్యాస్, సోలార్ సహా అన్ని సదుపాయాలు కల్పిస్తాం. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల నిర్మాణం పూర్తయితే వాటిని లబ్ధిదారులకు ఇచ్చేయాలి. స్థలం కేటాయించి ఇళ్లు కట్టకపోతే మాత్రమే పాలసీ ప్రకారం అదే ప్రాంతంలో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున అర్హులైన పేదలకు స్థలాలివ్వాలి’ అని సీఎం పేర్కొన్నారు. కాగా, 2014-19 మధ్యకాలంలో మంజూరు చేసిన ఇళ్లకు నిధులు ఇవ్వడం లేదని కొంతమంది మధ్యలోనే నిర్మాణాలు నిలిపివేశారని, ఇలాంటివారు 50వేల మంది వరకూ ఉన్నారని మంత్రి పార్థసారథి చెప్పారు. వారందరినీ 2.0లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
Updated Date - Feb 12 , 2025 | 04:04 AM