Chevireddy Liquor Scam: హద్దులు దాటిన కిక్కు
ABN, Publish Date - Jun 24 , 2025 | 07:07 AM
మద్యం వల్ల నా తండ్రిని, సోదరుడిని కోల్పోయాను. మద్యానికి నేను దూరం. లిక్కర్ డబ్బు ముట్టుకోలేదు. ముడుపులతో నాకు సంబంధం లేదు.. అని జగన్ సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. ఇది నిజమేనా.. అంటే... కానే కాదు.. మద్యం సొమ్ములు ఆయన ముట్టుకున్నారు.
ఈ ఏడాది జనవరిలో టాంజానియాకు చెవిరెడ్డి బృందం
ఇనుప ఖనిజం, ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంపై ఆరా
వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పిన ప్రణయ్ ప్రకాశ్
‘నాకేం తెలియదు’ అన్న చెవిరెడ్డి మాటలు ఉత్తివే
‘నేను మద్యం ముట్టను..’ అంటూ చెవిరెడ్డి చెప్పిన కథలు, ప్రణయ్‌ప్రకాశ్ దొరకడంతో ఇప్పుడు ఆయనకే అడ్డం తిరిగాయి. రూ.వేల కోట్ల మద్యం ముడుపుల్ని ఆఫ్రికాకు తరలించి,ప్రణయ్‌తో కలిసి మైనింగ్ బిజినెస్ చేయాలని చెవిరెడ్డి ప్లాన్ చేశారనేందుకు పక్కా ఆధారాలు సిట్ సంపాదించింది.
ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్‌కు ప్రణాళికలు
రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి సూచనలతో పలు దేశాల్లో ప్రణయ్ పర్యటన
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘మద్యం వల్ల నా తండ్రిని, సోదరుడిని కోల్పోయాను. మద్యానికి నేను దూరం. లిక్కర్ డబ్బు ముట్టుకోలేదు. ముడుపులతో నాకు సంబంధం లేదు?’’ అని జగన్ సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. ఇది నిజమేనా? అంటే... ‘కానే కాదు! మద్యం సొమ్ములు ఆయన ముట్టుకున్నారు. ఎన్నికల ముందు ఆయన మనుషుల ద్వారానే వైసీపీ అభ్యర్థులకు చేరవేశారు. లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన ప్రణయ్ ప్రకాశ్‌తో చెవిరెడ్డి బాగా ‘టచ్’లో ఉన్నారు. అంతేకాదు.... ఆఫ్రికాలో కంపెనీ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు’’ అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించిన ఆధారాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా... మొదటి నుంచీ ఈ దందాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, 2023లో తాడేపల్లిలో ఫ్లాట్ తీసుకుని ‘క్యాష్ హ్యాండిల్’ చేసిన ప్రణయ్ ప్రకాశ్ న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో చెవిరెడ్డి పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్కామ్‌లో చెవిరెడ్డికి సంబంధించిప్రణయ్ ప్రకాశ్ దొరకనంత వరకు ఒక్క లెక్క... ఇప్పుడు ఒక లెక్క! మద్యం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి, ఇతర నిందితులు కిరణ్ కుమార్ రెడ్డి, చాణక్యల ఆదేశాల మేరకు ప్రణయ్.. తాడేపల్లిలో ‘డెన్’ ఏర్పాటు చేశారు. అక్కడికి డిస్టిలరీలు, మద్యం కంపెనీల ప్రతినిధుల నుంచి అట్టపెట్టెల్లో నగదు వచ్చి చేరేది. ఆ తర్వాత... చాణక్య సూచనల మేరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరుడు బాలాజీ, గిరి, మదన్‌రెడ్డి (గన్‌మెన్), నవీన్ తదితరులకు ఈ డబ్బు అందించేవారు. నగదును వివిధ మార్గాల్లో నియోజకవర్గాలకు తరలించారు.
ఓడిపోగానే చలో దుబాయ్...
ఇక్కడ కొట్టేసిన లిక్కర్ సొమ్ముతో... ఆఫ్రికాలో మైనింగ్ వ్యాపారం! ఇదీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి తదితరుల ఆలోచన. జాంబియా, టాంజానియా, జింబాబ్వే లాంటి దేశాల్లో మైనింగ్ వ్యాపా రం చేసేందుకు చెవిరెడ్డి ప్రయత్నించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే చాణక్య సలహా మేరకు ప్రణయ్ ప్రకాశ్ దుబాయ్‌కి చెక్కేశాడు. ‘లిక్కర్ సొమ్ములతో చెవిరెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు ఆఫ్రికాలో ఐరన్ ఓర్ మైనింగ్ మొదలుపెడతారని... అందులో నాకు జీతంతోపాటు షేర్లు కూడా ఇస్తారని చాణక్య నాకు చెప్పాడు. జాంబియా, జింబాబ్వే, టాంజానియాల్లో ఐరన్ ఓర్ వ్యాపారంపై వివరాలు సేకరించాలని చాణక్య, రాజ్ కసిరెడ్డి చెప్పడంతో నేను ఆ దేశాల్లో పర్యటించాను. జాంబియాలో నెలరోజులు ఉన్నా. తర్వాత ఇండియాకు వచ్చేశా. అప్పుడే నాకు సీఐడీ నుంచి ఫోన్ వచ్చింది. దుబాయ్ వీసా గడువు ముగియడంతో థాయ్‌లాండ్‌కు వెళ్లిపోయా. మళ్లీ వీసా తీసుకుని అక్కడి నుంచి దుబాయ్‌కి చేరుకున్నా. అప్పుడే... చాణక్య టెలికాన్ఫరెన్స్‌లో చెవిరెడ్డితో మాట్లాడించారు. అప్పుడు ఆయన అరైజ్ గ్రూప్ సీఈవో గగన్ గుప్తాను కలిసేందుకు దుబాయ్‌కి వచ్చారు. నివేద్ శెట్టి అనే వ్యక్తి టాంజానియాలో అరైజ్ సంస్థ వ్యవహారాలు చూస్తున్నారని, కంపెనీ పెట్టేందుకు ఆయ న సహకరిస్తారని చెప్పారు. జనవరి 13న నేను జింబాబ్వే వెళ్లాను. నాతోపాటు బెంగళూరుకు చెందిన జియాలజిస్టు మనోహర్ ఘోర్పడే కూడా ఉన్నారు. అదే సమయంలో నాకు చాణక్య నుంచి ఫోన్ వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు టాంజానియా వస్తున్నారని చెప్పారు. టాంజానియాకు వెళ్లాలని నాకు చెప్పడంతో... నేను జనవరి 31న అక్కడికి చేరుకున్నాను. అక్కడికి... చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు వచ్చారు. అందరం కలిసి నివేద్ శెట్టిని కలిశాం. ఐరన్‌ఓర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై చెవిరెడ్డి ఆరా తీశారు’’ అని ప్రణయ్ ప్రకాశ్ తన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారు. అంతేకాదు... లిక్కర్ సొమ్మును ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచిన విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు, ఇతరులకు చెప్పొద్దని కూడా తనను హెచ్చరించినట్లు వివరించారు. లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి పాత్రను ప్రణయ్ ఇంత స్పష్టంగా వివరించారు.
షెల్టర్ జోన్‌గా దుబాయ్...
కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్‌పై ఆరా తీయడం మొదలుకాగానే... ఇందులోని పాత్రధారులంతా దుబాయ్‌కి చేరుకోవడం గమనార్హం. మొదట చాణక్య దుబాయ్ చేరుకున్నారు. తర్వాత ప్రణయ్‌నీ, లీలా డిస్టిలరీస్ వ్యవహారాలు నడిపించిన వరుణ్ పురుషోత్తంనూ రప్పించారు. ముగ్గురూ దుబాయ్ బిజినెస్ బేలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లమని ప్రణయ్ తెలిపారు. మధ్య మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా అక్కడికి వచ్చేవారట. ఇక... జగన్ అధికారంలో ఉండగా ‘వసూల్ రాజా’ పేరు మార్మోగిన సంగతి తెలిసిందే. ఆయన ఏపీలో దోచుకున్న సొమ్మును దుబాయిలో పెట్టుబడి పెట్టారని, అమెరికాలో షిప్పింగ్ కంపెనీని కొనుగోలు చేశారని ప్రచారం జరిగింది. అధికారులు, ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్ వెళ్లినట్లుగా వసూల్‌రాజా, మరి కొందరు క్రమం తప్పకుండా దుబాయికి వెళ్లి వచ్చేవారు. వారికి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ వ్యాపారం ఉందని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. అయితే, మద్యం కుంభకోణం లింకులను ఆరాతీస్తే ఈ కేసులో ఉన్నవారి షెల్టర్‌జోన్ దుబాయి అని తేలింది.
Updated Date - Jun 24 , 2025 | 11:45 AM