ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: జలమే జీవం

ABN, Publish Date - Jul 09 , 2025 | 03:52 AM

నదీ జలాలే రాష్ట్రానికి సంపద, అభివృద్ధి అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మంగళవారం ఆయన పర్యటించారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి కృష్ణా జలాలను దిగువకు విడుదల చేశారు.

  • సంపద, అభివృద్ధికి నీరే ఆధారం

  • గోదావరితో ఉభయ రాష్ట్రాలు సుభిక్షం: సీఎం

  • ఏటా 2 వేల టీఎంసీలు సాగరం పాలు

  • చెరో 200 టీఎంసీలు వాడుకున్నా చాలు

  • బనకచర్ల సాకారమైతే కరువు ఉండదు

  • రాయలసీమ నుంచి దుర్భిక్షాన్ని తరిమేస్తాం

  • నాడు ఐదేళ్లలో సాగునీటిపై 68 వేల కోట్ల ఖర్చు

  • మేమే వచ్చినట్లైతే పోలవరం పూర్తయ్యేది: బాబు

  • శ్రీశైలం జలాశయం గేట్లెత్తి నీటి విడుదల

  • కృష్ణా జలాలకు జలహారతి.. గంగమ్మ తల్లికి సారె

‘‘శ్రీశైలంలో ప్రధానంగా రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒకటి శ్రీశైల మల్లన్న ఆలయమైతే, మరొకటి ఆధునిక దేవాలయం శ్రీశైలం జలాశయం. శ్రీశైల మల్లన్నను ఎంత పవిత్రంగా పూజిస్తారో... జలాశయం నీటిని కూడా అదే తరహాలో పూజిస్తే రైతుల కష్టాలన్నీ తీరిపోతాయి. గతంలో రాయలసీమను రాళ్లసీమ అన్నారు. సంకల్పంతో రాయలసీమ స్థితిగతులను మార్చేలా జలప్రణాళికలకు ఎన్టీఆర్‌ రూపకల్పన చేశారు. అదేబాటలో నడిచి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే నా లక్ష్యం.’

- సీఎం చంద్రబాబు

నంద్యాల, జూలై 8 (ఆంధ్రజ్యోతి): నదీ జలాలే రాష్ట్రానికి సంపద, అభివృద్ధి అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మంగళవారం ఆయన పర్యటించారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి కృష్ణా జలాలను దిగువకు విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ‘గోదావరి నుంచి ఏటా సముద్రంలోకి రెండు వేల టీఎంసీలు కలుస్తున్నాయి. అందులో 200 టీఎంసీలు చొప్పున ఏపీ, తెలంగాణ వాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలూ సుభిక్షమవుతాయి. పోలవరం నుంచి బనకచర్లకు నీరు రావాలి. గోదావరి నీరు బనకచర్ల వరకు వస్తే కరువు అనే మాటే ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాలూ కరువు కాటకాలకు దూరంగా ఉండాలన్నదే నా తపన’’ అని తెలిపారు. ముందుగా శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. సాక్షి గణపతిని దర్శించుకున్న అనంతరం... ప్రధాన ఆలయం వద్దకు ముఖ్యమంత్రి రాగానే అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీశైల మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు, అర్చకులు సీఎంను ఘనంగా సత్కరించి, ఆలయ జ్ఞాపికను అందజేశారు. అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా సున్నిపెంట చేరుకున్నారు. అక్కడ జలాశయంలో కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి, గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. అనంతరం శ్రీశైలం డ్యాం నాలుగు గేట్లను ఎత్తి కృష్ణా జలాలను దిగువన సాగర్‌కు విడుదల చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తన సంకల్పమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరాన్ని ఇప్పటికే పూర్తి చేసి తెలుగుజాతికి అంకితం చేసేవాళ్లమని తెలిపారు.

రిజర్వాయర్లు ఆధునిక దేవాలయాలు

శ్రీశైలం గేట్లు ఎత్తిన అనంతరం సీఎం సున్నిపెంటలోని ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ స్థానికులు, రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రిజర్వాయర్లు ఆధునిక దేవాలయాలని అన్నారు. ‘2014-19 మధ్య సాగునీటి రంగానికే రూ.68 వేల కోట్లు ఖర్చు చేశాం. ఒక్క సీమకే రూ.12,500 కోట్లు ఖర్చు చేశాం. కానీ దురదృష్టవశాత్తు గత ఐదేళ్లు ఒక పార్టీ పాలించింది. దదాని పేరును నా నోటి నుంచి పలికేందుకు కూడా ఇష్టం లేదు. ఐదేళ్లలో కేవలం రూ.2వేల కోట్లు ఖర్చు చేసి సాగునీటి రంగాన్ని నాశనం చేసింది’’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతున్నామన్నారు. ‘వ్యవసాయానికి ప్రధానమైన సాగునీటి కోసం ఎంతో కృషి చేస్తున్నాం. నిజానికి జలాలే మన సంపద.. మన అభివృద్ధి. వాటితోనే మన రైతుల కష్టాలు పూర్తిగా తీరతాయి. రూ.3,590 కోట్లతో హంద్రీనీవా విస్తరణ, లైనింగ్‌ పనులు వేగవంతం చేశాం. గోదావరితో రాయలసీమకు సాగునీరు వస్తోంది. ప్రస్తుతం కృష్టా డెల్టాకు కూడా గోదావరి ద్వారా నీళ్లు ఇస్తున్నాం. ఈనెల 15లోగా అనంతపురం జిల్లాలోని జీడీపల్లి, పీఏబీఆర్‌తో పాటు ఈనెల 30లోపు కుప్పం, మదనపల్లెకు కూడా నీటిని తీసుకెళ్తాం. రాయలసీమను అన్ని విధాలుగా అభివృద్ధిపరచి ప్రపంచంలో నెంబర్‌ వన్‌ వ్యవసాయ ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. హార్టికల్చర్‌ హబ్‌గాను..ఇండస్ట్రియల్‌ కారిడార్‌గాను మార్చేస్తున్నాం’ అని చంద్రబాబు తెలిపారు. తాను రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘‘సమైక్య రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎం, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా. విభజన తరువాత రెండో సారి సీఎం అయ్యాను. నన్ను బలమైన శక్తిగా మార్చిన తెలుగు ప్రజలకు జీవితాతం కృతజ్ఞుడనై ఉంటాను. 2027నాటికి పోలవరం పూర్తిచేస్తాం. రాయలసీమ అభివృద్ధికి నా వద్ద బ్లూప్రింట్‌ ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో రహదారి, పోర్ట్‌ వ్యవస్థ మనవద్ద ఉంది. గత ప్రభుత్వం డ్రిప్‌ ఇరిగేషన్‌ను రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ 90శాతం సబ్సిడీతో ఆ సదుపాయం కల్పిస్తున్నాం. తెలుగుగంగ, కేసీ కెనాల్‌, ఎస్‌ఆర్‌బీసీ, నగరి, గాలేరు, హంద్రీనీవా కింద ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. రాష్ట్రంలో 1,004 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 554 టీఎంసీలు మాత్రమే నీళ్లు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఉన్నాయి. మరో 450 టీఎంసీలు వస్తే రాష్ట్ర జలాశయాలు కళకళలాడతాయి’’ అని సీఎం తెలిపారు.

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్‌

రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు సీఎం చెప్పారు. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఇది కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ హామీ అమలుపై కూటమి ప్రభుత్వ కసరత్తు పూర్తయింది. ముఖ్యమంత్రి వెంట జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి, నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి, డీఐజీ కోయ ప్రవీణ్‌, ఎస్పీ అదిరాజ్‌సింగ్‌ రాణా, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గిత్త జయసూర్య, భూమా అఖిలప్రియ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

1.06 లక్షల క్యూసెక్కుల విడుదల

శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారడంతో చంద్రబాబు 6,7,8,11 క్రస్ట్‌ గేట్లను పదడుగులు ఎత్తి నీటిని విడుదల చేశారు. 1,06,976 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదిలారు. ప్రస్తుతానికి శ్రీశైలంలోకి సుంకేసుల, జూరాల నుంచి 1,86,534 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కుడి ఎడమ విద్యుత్‌ ఉత్పాదన కింద 65,719 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ధవళేశ్వరం గేట్లన్నీ ఎత్తివేత

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదులు పొంగి పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం స్వల్పంగా పెరిగింది. స్పిల్‌వేలోకి చేరుకున్న 2,02,463 క్యూసెక్కుల వరదను అధికారులు దిగువకు విడుదల చేశారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి మంగళవారం సాయంత్రానికి 1,98,710 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మొరాయించిన గేట్లను రిపేర్‌ చేసి కాటన్‌ బ్యారేజ్‌లోని మొత్తం 175 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 9.80అడుగులుగా నమోదైంది. వ్యవసాయ అవసరాల కోసం డెల్టా కాలువలకు 13,550 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 06:37 AM