Employment Guarantee Scheme: ఉపాధి బకాయిలకు మోక్షం
ABN, Publish Date - Jul 11 , 2025 | 04:46 AM
2014 to 19 మధ్య కాలానికి సంబంధించి ఉపాధి హామీ పథకం పెండింగ్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది.
230 కోట్లు విడుదలకు కేంద్రం ఓకే
అమరావతి/న్యూఢిల్లీ, జూలై 10(ఆంధ్రజ్యోతి): 2014-19 మధ్య కాలానికి సంబంధించి ఉపాధి హామీ పథకం పెండింగ్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. సుమారు రూ.230 కోట్లు కేంద్రం వాటా నిధులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనులపైనా కత్తికట్టారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనుల బిల్లుల చెల్లింపును వైసీపీ అధికారంలోకి రాగానే నిలిపివేసింది. పనులు చేసిన వారిలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వీరికి బిల్లులు చెల్లించాలని తీర్పులు రావడంతో.. వైసీపీ ప్రభుత్వం ఏకంగా పనులన్నీ పూర్తయిపోయినట్లు కేంద్రానికి నివేదికలు పంపింది. దీంతో 4,22,633 పనులు పూర్తయినట్లు పేర్కొంటూ క్లోజ్ చేసేసింది. ఈ పనులకు కేంద్రం వాటాగా రావాల్సిన రూ.330 కోట్ల నిధులకూ తలుపులు మూసేసింది. కోర్టులకు వెళ్లినా ప్రయోజనం లేకుండా చేసింది. అప్పులు తెచ్చి మరీ పనులు చేసిన వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకోగా.. మరికొందరు వడ్డీలు కట్టుకుంటూ మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయారు. 2024లో కూటమి అధికారంలోకి రాగానే ఉపాధి బకాయిలపై దృష్టిసారించింది. చిక్కుముడులను విప్పుకొంటూ నిధుల విడుదలకు మార్గం సుగమం చేసింది. కేంద్రంతో మాట్లాడి అప్పట్లో పూర్తయినట్లు చూపిన పనులను తిరిగి ఆన్‌గోయింగ్ వర్క్స్‌గా చూపాలని విజ్ఞప్తులు చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు వైసీపీ హయాంలో పూర్తయినట్లు చూపిన పనుల్లో 3,52,788 పనులను ఆన్‌గోయింగ్ పనులుగా చూపేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.230 కోట్ల నిధుల విడుదలకు మార్గం సుగమం అయింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకు కొద్ది రోజుల క్రితం రూ.100 కోట్ల పెండింగ్ ఉపాధి నిధులను కేంద్రం విడుదల చేసింది.
కొద్ది రోజుల్లో రూ.230 కోట్ల నిధులు కూడా విడుదల కానున్నాయి. వీటితోపాటు మ్యాచింగ్ గ్రాంటుగా ఇవ్వాల్సిన రూ.220 కోట్ల నిధులను త్వరలోనే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పెండింగ్ ఉపాధి నిధుల విడుదలకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఉపాధి హామీ పెండింగ్ నిధుల సాధన కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. కక్షసాధింపులు ఎల్లకాలం చెల్లవని మరోసారి రుజువైందని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా తగిన మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించి, 30 రోజుల్లోగా కాంట్రాక్టర్లకు అన్ని బిల్లులు చెల్లించేలా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించామని తెలిపారు.
Updated Date - Jul 11 , 2025 | 04:46 AM