Summer Vacation Tragedy: ఈతకు వెళ్లి మృత్యు ఒడికి..
ABN, Publish Date - May 14 , 2025 | 04:55 AM
వేసవి సెలవుల్లో బంధువుల ఊరికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు కడప జిల్లాలోని చెరువులో ఈతకి వెళ్లి గల్లంతై మృతి చెందారు. మరో విషాద ఘటనలో నెల్లూరు జిల్లాలో అన్నదమ్ములు కాలువలో గల్లంతయ్యారు.
చెరువులో మునిగి ఐదుగురు చిన్నారుల మృతి
కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో విషాదం
నెల్లూరులో గల్లంతైన అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం
బ్రహ్మంగారిమఠం/సంగం, మే 13 (ఆంధ్రజ్యోతి): ఆ చిన్నారులు వేసవి సెలవుల్లో ఆనందంగా గడుపుదామని బంధువుల ఊరికి వెళ్లారు. అక్కడ సరదాగా ఈతకు చెరువుకు వెళ్లి.. అందులో గల్లంతై మృతిచెందారు. ఈ విషాద ఘటన కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లెలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బోధనం గ్రామానికి చెందిన సుబ్బయ్య కుమారులు చరణ్(15), పార్థు(12) వేసవి సెలవులకు అవ్వగారి ఊరు అయిన బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లె గ్రామానికి వచ్చారు. అలాగే జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ కుమారుడు హర్ష (12) తన మేనత్త ఇంటికి వచ్చాడు. కాశినాయన మండలం మల్లేరు కొట్టాలు గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు తరుణ్‌యాదవ్ (10) పెదనాన్న ఇంటికి వచ్చాడు. వీరితో పాటు మల్లేపల్లెకు చెందిన తరుణ్‌యాదవ్ కుమారుడు దీక్షిత్(12) కలసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆడుకుంటూ రోడ్డుపైకి వెళ్లారు. సాయంత్రం 5 గంటలు దాటుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురై గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి చూడగా.. అక్కడ ఒడ్డుపై పిల్లల బట్టలు కనిపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. మోటార్ల సాయంతో చెరువులో నీటిని తోడారు. రాత్రి 11 గంటల సమయంలో పిల్లల మృతదేహాలను గుర్తించారు.
అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం
నెల్లూరు జిల్లా సంగం మండల పరిధిలోని కనిగిరి కాలువలో గల్లంతైన అన్నదమ్ముల మృతదేహాలు మంగళవారం లభ్యమయ్యాయి. కోవూరు స్టౌబీడీ కాలనీకి చెందిన బందా గోవిందయ్య, శేషమ్మల కుమారులు చందు(14), నందు (11) వేసవి సెలవులకు 10 రోజుల కిందట సంగంలోని అమ్మమ్మ, పెద్దమ్మల ఇంటికి వచ్చారు. స్థానిక విద్యార్థులతో కలసి సోమవారం కాలువలో ఈతకెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు ఇరిగేషన్ అధికారుల సాయంతో కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో మంగళవారం ఉదయానికి నీటి మట్టం తగ్గి వారు మునిగిన చోటుకు 200 మీటర్ల దూరంలో చందు మృతదేహం లభ్యమైంది. కాలువ క్రాస్ రెగ్యులేటర్లకు దిగువున నందు మృతదేహం దొరికింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..
Updated Date - May 14 , 2025 | 04:55 AM