Assurance on Job Security: ఉపాధి సిబ్బందిని ఆదుకుంటాం
ABN, Publish Date - Jun 24 , 2025 | 03:50 AM
ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రతి ఉద్యోగిని ఆదుకుంటామని, వారి ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ భరోసా ఇచ్చారు.
సోషల్ ఆడిట్ సిబ్బంది నిబంధనలు దాటొద్దు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్
అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రతి ఉద్యోగిని ఆదుకుంటామని, వారి ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ భరోసా ఇచ్చారు. సోషల్ ఆడిట్ కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌కు వచ్చిన టెక్నికల్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్లతో ఆయన మాట్లాడారు. సోషల్ ఆడిట్ సిబ్బంది నిబంధనల మేరకు తనిఖీలు చేసేలా చూడాలని సోషల్ ఆడిట్ డైరెక్టర్‌కు సూచించారు.
పక్క వార్డులకు బదిలీ చేయొచ్చు
సచివాలయ సిబ్బంది బదిలీల ఉత్తర్వులకు సవరణ
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు, రేషనలైజేషన్ ఉత్తర్వులకు స్వల్ప సవరణ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఒక వార్డు నుంచి మరో వార్డుకు బదిలీ చేయవచ్చని పేర్కొంది. సొంత వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయాలని, అదే జిల్లాలోని ఇతర పట్టణ స్థానిక సంస్థలకు కూడా బదిలీ చేయవచ్చని పేర్కొంది.
కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
8 ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద నిరసన
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (కాంట్రాక్ట్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోడి అర్జునుడు నాయకత్వంలో పలువురు కాంట్రాక్టు లెక్చరర్లు సోమవారం తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద పెద్దఎత్తున నిరసన తెలిపారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.రామ్మోహన్‌రావు, కార్యదర్శి కృష్ణమూర్తిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
Updated Date - Jun 24 , 2025 | 03:50 AM