ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

APSRTC: ఒకపక్క ఫుల్‌.. మరోపక్క డల్‌

ABN, Publish Date - Jun 04 , 2025 | 07:39 AM

ఆర్టీసీలో సిబ్బంది సర్దుబాటు సరిగా లేక ప్రధాన కార్యాలయంలో ఖాళీలు లేకపోవడం, కానీ డిపోల్లో సిబ్బంది కొరతతో సంస్థకు నష్టం జరుగుతోంది. పాలకమండలి, ఉన్నతాధికారుల మధ్య సమన్వయ సమస్యల వల్ల సంస్థ కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయి.

  • సిబ్బంది సర్దుబాటులో బ్యాలన్స్‌ తప్పుతున్న ఆర్టీసీ

  • ఆదాయం వచ్చే బస్‌డిపోల్లో భారీగా కొరత

  • హెడ్‌ ఆఫీస్‌లో ఖాళీల్లేకుండా ‘హౌస్‌’ఫుల్‌

  • సిఫారసులు, పైరవీలతో సిబ్బంది బదిలీలు

  • ఉన్నతాధికారుల నిర్ణయాలతో సంస్థకు నష్టం

  • పాలకమండలి, అధికారుల మధ్య సమన్వయ లోపం

నాలుగు చక్రాల్లోనూ సరిపడ గాలి ఉంటేనే బస్సు క్షేమంగా ముందుకువెళుతుంది. అలాగే అవసరం అయిన చోట సరిపడ సిబ్బంది ఉంటేనే సంస్థ కార్యకలాపాలు సజావుగా నడుస్తాయి. అయితే ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇందుకు విరుద్ధంగా ఉంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత వేధిస్తుంటే.. హెడ్‌ ఆఫీ్‌సలో మాత్రం ఒక్క ఖాళీ కూడా లేకుండా ‘హౌస్‌ ఫుల్‌’గా నడుస్తోంది. పలు డిపోల్లో తక్కువ మంది సిబ్బందితోనే నెట్టుకొస్తుండటం వల్ల అక్కడి వారిపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే.. అధికారులు, పాలకమండలి మధ్య అసలు సంబంధాలే లేవు. సరిదిద్దాల్సిన రవాణా శాఖ మంత్రి పట్టించుకోవడంలేదు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో రోజూ 45 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యం చేరుస్తున్న ప్రజా రవాణా సంస్థ ఏపీఎస్‌ ఆర్టీసీలో సిబ్బంది సర్దుబాటులో సమతుల్యత కొరవడింది. సంస్థకు ఆదాయం తెచ్చిపెట్టే బస్‌ డిపోల్లో సిబ్బంది కొరత భారీగా ఉంటే.. విజయవాడ హెడ్‌ ఆఫీస్‌ ఆర్టీసీ హౌస్‌లో మాత్రం ఫుల్లుగా ఉన్నారు. జిల్లాల్లో బస్‌ డిపో మేనేజర్లు పొరుగు డిపోల బాధ్యతలు కూడా అదనంగా చూస్తున్నారు. హెడ్‌ ఆఫీ్‌సలో ఒక్కటంటే ఒక్క ఆఫీసర్‌, సూపర్‌ వైజర్‌, క్లర్క్‌ పోస్టు కూడా ఖాళీగా లేకపోవడం విశేషం. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో పనులు ముందుకువెళ్లడం లేదు. పనిభారం పడి సిబ్బంది అనారోగ్యాల బారిన పడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో 62 వేల మంది సిబ్బంది ఉన్న ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇప్పుడు 47 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. గత పన్నెండు ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగ రిక్రూట్మెంట్లు లేకుండా కేవలం కారుణ్య నియామకాలు మాత్రమే చేస్తున్నారు. ఫలితంగా ఉన్న సిబ్బంది వయో భారంతో ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారు.


క్లరికల్‌ సిబ్బంది మొదలు డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌ల కొరత ఆర్టీసీలో ఎక్కువగా ఉంది. కొత్తగా రిక్రూట్మెంట్లు చేసుకుని మెరుగైన సేవలందిస్తే ఆక్యుపెన్సీ మరింత పెరిగి సంస్థ బలోపేతం అవుతుందని సీనియర్లు చెబుతున్నారు. కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నతస్థాయిలో అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని విమర్శిస్తున్నారు. రోజు వారీ కింద బస్సు డ్రైవర్లను నియమించుకుని, కొత్త బస్సులు కొనకుండా, ఉన్న వాటికి నిర్వహణ లేకుండా ఎన్నాళ్లు సంస్థను నడిపించగలమని వ్యాఖ్యానిస్తున్నారు. పైరవీలు చేసిన వారికి, సొంత మనుషులకు అడిగిన చోట పోస్టింగ్స్‌ ఇస్తూ అవసరమైన చోట ఖాళీ ఉంచితే సంస్థ నష్టపోతుందని సిబ్బందిలో ఆవేదన వ్యక్తం అవుతోంది. సర్దుబాట్లు చేయాల్సిన ఉన్నతాధికారులు ఇవేవీ పట్టించుకోవట్లేదని, ఆర్టీసీ బోర్డు సభ్యులకు చెబితే మాకే దిక్కు లేదంటూ నిర్వేదం ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు.


బోర్డు మీటింగ్‌ ప్రసక్తే లేదు

ఆర్టీసీలో కీలక నిర్ణయాలు తీసుకునే పాలకమండలి ఏర్పాటై 8 నెలలు కావస్తోంది. పూర్తి స్థాయి బోర్డు ఏర్పాటైనా ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. బోర్డు చైర్మన్‌, జోనల్‌ చైర్మన్‌ల పరిచయ కార్యక్రమం కూడా లేదు. హెడ్‌ ఆఫీసుకు వచ్చినప్పుడు కూర్చోవడానికి కనీసం ఒక గది ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకునే అధికారి ఒక్కరూ లేరు. బోర్డును పట్టించుకోకుండా ఉన్నతాధికారులు మాత్రం ప్రతి నెలా రెండు, మూడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాలకమండలి, ఉన్నతాధికారులు సమావేశమై చర్చించి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటే సంస్థకు ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి ఆర్టీసీలో లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రవాణా మంత్రిగా రామ్‌ప్రసాద్‌ రెడ్డి గత ఏడాది జూన్‌ చివరి వారంలో బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు రెండో వారంలో ఆర్టీసీ హౌస్‌లో అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మహిళలకు ఉచిత ప్రయాణం మొదలుకొని కొత్త బస్సుల కొనుగోలు వరకూ చాలా విషయాలు వెల్లడించారు. ఆ తర్వాత ఒక్క రోజైనా ఆయన ఆర్టీసీ హౌస్‌కు రాలేదు. అందుకు ప్రధాన కారణం సంస్థ ఉన్నతాధికారులు ఆయనను మంత్రిగా చూడట్లేదనే ప్రచారం జరుగుతోంది. బస్సుల నిర్వహణ కూడా సరిగా చెయ్యని ఆర్టీసీ అధికారులు కనీసం బస్టాండ్లను కూడా శుభ్రంగా ఉంచకపోవడంతో కలెక్టర్లు తనిఖీలు చేయాలంటూ ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమన్వయంతో ముందుకెళితేనే ఆర్టీసీ ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయని పలువురు సూచిస్తున్నారు.

Updated Date - Jun 04 , 2025 | 07:43 AM