AP High Court : వేలం ఆస్తికి సేల్ సర్టిఫికెటే ప్రామాణికం
ABN, Publish Date - Jan 26 , 2025 | 04:50 AM
దేశంలోని అన్ని దిగువ కోర్టులు, అధికారులు సర్వోన్నత న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని హైకోర్టుస్పష్టం చేసింది.
మార్కెట్ విలువపై రిజిస్ట్రేషన్ ఫీజు వద్దు!
తీర్పులు, చట్టాల్లో మార్పులపై అధికారులకు అవగాహన కల్పించండి
రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం
అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): వేలంలో కొన్న ఆస్తికి సేల్ సర్టిఫికేట్‌లో పేర్కొన్న విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీని వసూలు చేయాలి తప్ప మార్కెట్ విలువ ఆధారంగా కాదని హైకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఉన్నాయని, దేశంలోని అన్ని దిగువ కోర్టులు, అధికారులు సర్వోన్నత న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అధికారులు తమ వైఖరితో ప్రజలు కోర్టును ఆశ్రయించే పరిస్థితులు కల్పిస్తున్నారని, ఈ పరిస్థితిని అధిగమించాలంటే కోర్టు తీర్పులు, చట్టాల్లో వస్తున్న మార్పులపై రిజిస్ట్రార్‌లు, సబ్ రిజిస్ట్రార్‌లకు ఎప్పటికప్పుడు వర్క్‌షా్‌పలు, శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. చట్టాల్లో వస్తున్న మార్పులపై అధికారులకు అవగాహన కల్పించేందుకు లీగల్ మాడ్యూల్‌ను 4 వారాల్లో రూపొందించాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలు పురోగతిపై అధికారులు నివేదిక సమర్పించేందుకు వీలుగా విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుత కేసులో సేల్ సర్టిఫికెట్‌లో పేర్కొన్న ఆస్తివిలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ విధించి ఆస్తిని రిజిస్టర్ చేయాలని తిరుపతి సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల తీర్పు ఇచ్చారు. తిరుపతి కెనరా బ్యాంక్ నిర్వహించిన ఈ వేలంలో తిరుపతి సెంట్రల్ పార్క్‌లోని కమర్షియల్ కాంప్లెక్స్‌లోని పలు షాపులను కడపకు చెందిన కొండపనేని మల్లికార్జున, లోకేశ్ కస్తూరి, హైదరాబాద్‌కు చెందిన స్వాతి కస్తూరి రూ.2.17 కోట్లకు కొనుగోలు చేశారు. దీనిని నిర్ధారిస్తూ కెనరా బ్యాంక్ గతనెల 30న సేల్ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ ఆస్తిని తమ పేరు మీద రిజిస్టర్ చేయాలని మల్లికార్జున తదితరులు తిరుపతి సబ్ రిజిస్ట్రార్‌ను కోరారు. దీనికి మార్కెట్ విలువ(రూ.3.65కోట్లు) ఆధారంగా 6.5 శాతం స్టాంప్ డ్యూటీ, 1శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని సబ్ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. దీనిపై మల్లికార్జున తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ వద్ద విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది పి.సాయి సూర్యతేజ వాదనలు వినిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు
విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే
వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే
కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Jan 26 , 2025 | 04:50 AM