AP Govt : ఇంటి నుంచి పనిచేస్తారా?
ABN, Publish Date - Feb 27 , 2025 | 03:00 AM
బెంగళూరు, చెన్నై నగరాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే.
ఐటీ, ఆధారిత రంగ ఉద్యోగులపై సర్వే
‘వర్క్ ఫ్రమ్ హోం’ను ప్రోత్సహించాలని సర్కారు యోచన
ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా స్థానికంగా సదుపాయాల కల్పన
కంపెనీలు, ఉద్యోగులకు తగ్గనున్న ఖర్చులు
రాష్ట్రంలో పెరగనున్న ఆర్థిక కార్యకలాపాలు
ఉద్యోగుల సేవలూ రాష్ట్రానికి అందుబాటులో
టెకీల అభిప్రాయం తెలుసుకునేందుకు సర్వే
తర్వాత యాజమాన్యాలతో సంప్రదింపులు
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు చెందిన ఎంతో మంది యువత ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. సొంత ఊరు, ఇల్లు వదిలి పొరుగు రాష్ట్రాల బాట పట్టారు. వీరంతా రాష్ట్రం నుంచి వెళ్లకుండా స్థానికంగా ఉంటూ ఇంటి నుంచే పనిచేస్తే..? దీనివల్ల ఉద్యోగులకు రవాణా, ఇంటి అద్దె, ఇతర ఖర్చులు... కంపెనీలకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. అంతేగాక రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఐటీ ఉద్యోగుల సేవలను రాష్ట్రానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తూ, ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోంను ప్రోత్సహించేందుకు సిద్ధమవుతోంది. ఉద్యోగులు ఇంటి వద్దే పని చేసుకునేలా సౌకర్యాలను కల్పించాలని యోచిస్తోంది. అందులో భాగంగా మొదట వర్క్ ఫ్రమ్ హోం చేయడంపై పొరుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాన్ని తెలుసుకుంటోంది. ఉద్యోగుల ఆసక్తిని తెలుసుకునేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సర్వే నిర్వహిస్తోంది. ఆ తర్వాత ప్రైవేటు ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల యాజమాన్యాలతో సంప్రదింపులు జరపనుంది.
కొవిడ్ సమయంలో...
కొవిడ్ సమయంలో ఉద్యోగులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంను ప్రోత్సహించాయి. కొవిడ్ తగ్గాక క్రమంగా మళ్లీ పాత పద్ధతే వచ్చినా, ఇప్పటికీ కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేస్తున్నాయి. అయితే వారమంతా గాక వారానికి ఒకట్రెండు రోజులు ఇంటి నుంచి పనిచేయించుకుంటున్నాయి. అలాగాక పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోంను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విధానానికి సుముఖత చూపుతున్నారు. మహిళలు ఇంటి పని చేసుకుంటూనే ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉండాలని భావిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన యువత ఐటీ ఉద్యోగాల కోసం కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు వలసపోవడాన్ని నివారించి స్వగ్రామాల్లో ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు అవకాశం కల్పించాలని ఐటీ శాఖ అధికారులకు చంద్రబాబు సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలోనే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పనిచేస్తున్న వారికి కూడా సొంతూళ్లలో సదుపాయాలు కల్పించాలని సర్కారు యోచిస్తోంది. రాష్ట్ర ఐటీ శాఖ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల నుంచి సానుకూలత వ్యక్తమైతే ఐటీ కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరపనుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు
ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ప్రోత్సహించి, తగిన సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ చెప్పారు. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ.. ఇంటి నుంచి పనిచేసేందుకు ఎంత మంది సుముఖంగా ఉన్నారో తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై యాజమాన్యాలతోనూ మాట్లాడుతామని వివరించారు. ఈ విధానం ఐటీ, ఐటీ ఆధారిత ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగుల కోసమేనని.. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి వర్తించదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజూ ఆఫీసులకు రావాల్సిందేనని, మినహాయింపులు ఉండవన్నారు.
Updated Date - Feb 27 , 2025 | 03:01 AM